ప్రియాంక గాంధీ డ్రెస్‌పై విమర్శలు

Priyanka Gandhi Changes Her Twitter Picture And Sparks A discussion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ బుధవారం అనూహ్యంగా ట్విటర్‌లో చర్చనీయాంశం అయ్యారు. ఉత్తరప్రదేశ్‌ (తూర్పు) పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె అహ్మదాబాద్‌లో తొలిసారిగా చేసిన ప్రసంగం  కారణంగా ఆమె చర్చనీయాంశం అయ్యారనుకుంటే పొరపాటే. ఫిబ్రవరి 11వ తేదీన సామాజిక మీడియా ‘ట్విటర్‌’ వేదికపైకి అడుగు పెట్టిన ప్రియాంక గాంధీ, చీరతో ఉన్న తన ప్రొఫైల్‌ ఫొటోను మార్చి నీలిరంగు జీన్స్, అదే రంగు చొక్కాతో దిగిన ఫొటోను పెట్టారు. అంతకుముందు ముదురు ఎరుపు రంగు చీర, పొడువైన చేతుల జాకెట్‌తో దిగిన ఫొటో ఉండేది.

ప్రియాంక గాంధీ జీన్స్‌ ఫొటో పెట్టడం పట్ల బీజేపీ మద్దతుదారులు విమర్శించగా, కాంగ్రెస్‌ మద్దతుదారులు మెచ్చుకున్నారు. అయితే పోకిరి వేషాలంటూ ఎవరూ ఘాటుగా తిట్టకపోవడం గమనంలోకి తీసుకోవాల్సిన విషయం. ‘గాంధీజీ ఎప్పుడూ ఒకేరకమైన దస్తులు ధరించేవారు. అందుకు మీరు భిన్నం. కొన్ని సార్లు జీన్స్, షర్టులు ధరిస్తారు. మరికొన్ని సార్లు చీరలు ధరిస్తారు. మీరు ధరించే దుస్తులపై మీకు విశ్వాసం లేదా ? చీరలు ధరించి ప్రజలను ఫూల్స్‌ చేయొచ్చని అనుకుంటున్నారా?.....అని ఒకరు, ప్రియాంక గాంధీ జీ, మీరు జీన్సే వేస్తారని తెలుసు. ఎన్నికల మేకప్‌ కోసం జీన్స్‌ను వదిలేసి చీరను కట్టి, ఇంగ్లీషును వదిలేసి హిందీలో మాట్లాడుతూ ఎవరిని మోసం చేద్దామని.. అంటూ మరొకరు, అనేక స్కామ్‌లకు సంబంధించి భర్తపై విచారణ కొనసాగుతోంది, మీరేమో దేశం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గనిపించడం లేదా?.. అంటూ ఇంకొకరు విమర్శనాస్త్రాలు సంధించారు.

‘చివరకు ఓ మహిళా రాజకీయ వేత్త జీన్స్‌ ధరించి ప్రజల ముందుకు వచ్చారు. ఇది చాలా గొప్ప విశయం. పెద్ద ప్రతీకాత్మకం.. అంటూ ఒకరు, అహా! ఎంత కూల్‌గా కనిపిస్తున్నారో! అంటూ మరొకరు, ఇది మంచి వ్యూహం, మిమ్మల్ని చూసైనా రాహుల్‌ గాంధీ తన కుర్తా, పైజామాను వదిలేసి జీన్స్, షర్టుతోని జనంలోకి రావాలి! అంటూ ఇంకొకరు మెచ్చుకోలుగా వ్యాఖ్యలు చేశారు.

ప్రియాంక చాలా అందగత్తే!
ప్రియాంక గాంధీపై వ్యాఖ్యానాలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియగానే బీజేపీ నాయకుడు, ఎంపీ హరీష్‌ ద్వివేది మాట్లాడుతూ ‘ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉన్నప్పుడు జీన్స్‌ ధరిస్తారని, కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు మాత్రం చీరతో వస్తారన్న విశయం అందరికి తెల్సిందే’ అని వ్యాఖ్యానించారు. బీహార్‌కు చెందిన బీజీపీ మంత్రి వినోద్‌ నారాయణ్‌ ఝా మరో అడుగు ముందుకేసి ‘ప్రియాంక గాంధీ చాలా అందగత్తే, అది మినహా ఆమె రాజకీయంగా సాధించినదీ ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. అందుకు ఆయన జాతీయ మహిళా కమిషన్‌ నుంచి తిట్లు కూడా తినాల్సి వచ్చింది.

మహిళా నేతలపై గతంలోనూ
మహిళా రాజకీయ నేతల గురించి గతంలోను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వచ్చాయి. వసుంధర రాజె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె గురించి ఎల్‌జేడీ నాయకుడు శరద్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘ఆమె ఒకప్పుడు సన్నగా ఉండేది. ఇప్పుడు ఆమె బాగా లావయింది. ఇప్పుడు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. 2017లో బీఎస్పీ నాయకురాలు మాయావతి గురించి ఎస్పీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘మాయావతికి ఎలా చోటివ్వగలం, ఆమెకు చాలా చోటు అవసరం. పైగా ఆమె పార్టీ ఎన్నికల గుర్తు మరీ ఏనుగాయె!’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top