దారులన్నీ జనసంద్రం

prajasankalpayatra tenth day ended at Dornipadu - Sakshi

రాజన్న తనయుడికి జన నీరాజనాలు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

పదో రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

సాక్షి, ఆళ్లగడ్డ: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. 10వ రోజు ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో సాగింది. పెద్దచింతకుంట, భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌రోడ్‌, కొండాపురం మీదుగా దొర్నిపాడు వరకు జననేత పాదయాత్ర చేశారు. ఈ రోజు వైఎస్‌ జగన్‌ 13.2 కిలోమీటర్లు నడిచారు.

ఈ రోజు పాదయాత్ర ప్రారంభం నుంచే ప్రజలు పోటెత్తడంతో దారులన్ని జనసంద్రాన్ని తలపించాయి. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, యువత, స్కూల్ పిల్లలు, రైతులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల వారు వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమ సమస్యలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యలు తెలుసుకున్న జగన్ అందరికీ ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దని త్వరలోనే మంచిరోజులొస్తాయని భరోసా కల్పించారు.

పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డలో ముస్లిం సోదరులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. టీడీపీ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. వారి సమస్యలపై స్పందించిన జగన్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పింఛన్‌కు, ఉద్యోగాలకు అన్ని అర్హతలున్నా తమనెవరూ పట్టించుకోవడం లేదని దివ్యాంగులు వాపోయారు. చింతలకుంటలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

చింతకుంటలో రైతులను వైఎస్‌ జగన్‌ కలిశారు. విత్తనాల ధరలు ఎలా ఉన్నాయి? మద్దతు ధర ఎంత ఉంది? పంటను వ్యాపారులు ఎంతకు కొంటున్నారు? సహా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు వివరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని పండగ చేసేలా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులను ఆయన కోరారు.

కేసీ కెనాల్‌ నుంచి నీటి విడుదలకు సహకరించాలని దొర్నిపాడులో వైఎస్‌ జగన్‌ను కలిసి రైతులు కోరారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వెలుగు ప్రాజెక్టు ఉద్యోగులు కూడా వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top