టీడీపీ.. పిల్ల కాంగ్రెస్‌

Prajakutami will have no impact on voters: ktr - Sakshi

సోనియాను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌ దత్తపుత్రుడు

తెలుగుదేశాన్ని కాపాడుకునేందుకే హస్తం పార్టీతో పొత్తు

ఐటీ దాడులపైనా బాబుది రాజకీయమే

కూటమికి ప్రజల ఆమోదం లేదు

రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కావు

వంద సీట్లకు తగ్గకుండా గెలుస్తాం

విలేకరులతో ఇష్టాగోష్టిలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిల్ల కాంగ్రెస్‌గా మార్చారని మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌తో పొత్తు అని చంద్రబాబు అన్నారని.. వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే అలా చేశారని వ్యాఖ్యానించారు.

సోనియాగాంధీని ఇటలీ మాఫియా, అవినీతి అనకొండ అని ఎన్నోసార్లు విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు అయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలు ఉత్త ఉత్తర పుత్రులేనని కాంగ్రెస్‌ అధిష్టానం గ్రహించడం వల్లే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పారు. కేటీఆర్‌ మంగళవారం హైదరాబాద్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆయనేమన్నారంటే...

బాబులో మానసిక భయాందోళన...
ఎక్కువ మంది రాజకీయ నేతలు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేస్తారు. చంద్రబాబు అయితే ప్రతీది రాజకీయమే చేస్తారు. జగన్‌పై దాడి చేసిన గంటలో ఏపీ మంత్రి లోకేష్‌ ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. నేను మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో ఖండిస్తూ ట్వీట్‌ చేశా. దీనికే టీఆర్‌ఎస్, బీజేపీకి లింకు పెట్టి మాట్లాడారు. ఐటీ దాడులు సహజంగా జరుగుతాయి.

ఈ విషయంలోనూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మోదీని తానే దించుతాననే స్థితిలో మాట్లాడుతున్నారు. చంద్రబాబు మానసిక భయాందోళనలో, ఆయనతోనే అంతా జరుగుతుందనే మానసికస్థితిలో ఉన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్న ఆయన ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు దేశంలో ఒక్క వైఎస్సార్‌సీపీతో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు.

కేసీఆర్‌ పేదల పక్షపాతి...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల పక్షపాతి. ఆయనకు అనుకూల పవనాలు ఉన్నాయి. సీఎంగా కేసీఆర్‌ ఉండాలని, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు అన్నట్లుగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. తెలంగాణలో ఏ పార్టీలో అయినా కేసీఆర్‌ మోకాలెత్తు నాయకుడు లేరు. కేసీఆర్‌ మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలనేది మా పార్టీలోని అందరి కోరిక. నాకు, మంత్రి హరీశ్‌రావుకు అందరికీ ఇదే ఆకాంక్ష.

కూటమికి ఆమోదం లేదు...
మహాకూటమికి అసలు ప్రజల ఆమోదమే లేదు. రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కావు. ఒక్కోసారి ఒకటే కావచ్చు, మరోసారి సున్నా కూడా కావచ్చు. పై స్థాయిలో పార్టీలో కలిసినా కింది స్థాయి నేతలు, కేడర్‌ కలవరు. 119 సీట్లలో పోటీ చేస్తామని చెప్పిన కోదండరాం మూడు స్థానాలకు పరిమితమవుతున్నారు.

వారు ఆరు స్థానాలని చెప్పుకుంటున్నా సిద్దిపేట, దుబ్బాక, చాంద్రాయణగుట్ట స్థానాల్లో పోటీ చేయడమంటే పోచమ్మ ముందు పొట్టేలను కట్టేసినట్లే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశాయి. ఈ విషయంపై మమ్మల్ని మొదట హెచ్చరించింది ఎంఐఎం నేతలే. ఎంఐఎం మాకు మిత్రపక్షం. ఎన్నికల ఫలితాలు వచ్చాక చంద్రబాబు, రాహుల్‌గాంధీ వీణ, ఫిడేలు వాయించుకోవాల్సిందే. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ మ్యూజియంగా మారుతుంది.

ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో మేలు...
ఏ ఒక్క అభ్యర్థినీ మార్చేది లేదని మా పార్టీ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వల్ల మేలే జరిగింది. టికెట్‌ ఆశించిన వారికి సర్దిచెప్పేందుకు వీలైంది. మిగిలిన 12 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం. పోలింగ్‌కు మరో 30 రోజులే ఉంది. ఈలోపు అసాధారణమైన సంఘటనలు ఏమీ జరగవు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వచ్చినా ఏమీ మారదు. ముందుగా చెప్పినట్లుగానే వంద సీట్లకు తగ్గకుండా గెలుస్తాం.

చంద్రబాబు ఏపీ ప్రతినిధి కాదు...
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ మొత్తానికి ప్రతినిధి కాదు. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో సీఎం అయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆయన్ను విమర్శిస్తే ఇక్కడి వారు ఓట్లు వేయరనేది తప్పుడు అభిప్రాయం. ఇక్కడ స్థిరపడిన ఏపీ ప్రజలు చంద్రబాబును తమ ప్రతినిధిగా భావించడంలేదు. హైటెక్‌ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్‌ నిర్మించింది నేనే అని చెప్పినా 2004లో ఆయనకు ఎవరూ ఓట్లు వేయలేదు.

కూటమి నేతలది కుసంస్కారం
కూటమిలోని కొందరు నేతలు మంత్రి హరీశ్‌రావుపై కుసంస్కారంతో దిగజారి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. పుట్టింది, చచ్చేది టీఆర్‌ఎస్‌లోనే అని హరీశ్‌ పలుసార్లు స్పష్టం చేశారు. రాజకీయాలు ఏమున్నా తర్వాత. మొదట మేమంతా ఒక కుటుంబం. ప్రతాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి చిల్లర మాటలు మమ్మల్ని ఏమీ చేయలేవు. సీఎం కేసీఆర్‌ సీటు మారతారనేది తప్పుడు ప్రచారం.

ఎవరినీ పిలవకుండా యూనిటీ ఎలా...
తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే తాను ముక్కలు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదు. బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుస్తాం. బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్‌ రాకుండా చేస్తాం. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ అని పటేల్‌ విగ్రహం పెట్టారు. ఏ రాష్ట్రాన్ని, ఏ పార్టీని పిలవకుండా చేసేది యూనిటీ ఎలా అవుతుంది. దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలే గెలవాలి. రాష్ట్రాలు బలపడితేనే దేశం బలపడుతుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యం ఇదే. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలి. అలా అయితే జాతీయ పార్టీల మదం తగ్గుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top