నేటి నుంచి పాదయాత్ర యథాతథం

Praja Sankalpa Yatra Starts From Rajolu East Godavari - Sakshi

రాజోలు, మామిడికుదురు మండలాల్లో సాగనున్న ప్రజాసంకల్ప యాత్ర

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం నుంచి జిల్లాలో యథాతథంగా జరుగనుంది. రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం చింతలపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. చింతలపల్లి నుంచి రాజోలు మండలం కూనవరం, మలికిపల్లి, కడలి, వేగివారిపాలెం క్రాస్, పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం గెద్దాడ, మొగలికుదురు, తిరిగి రాజోలు మండలం తాటిపాక గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది. ఉదయం బస ప్రాంతంలో తనను కలిసేందుకు వచ్చే వారితో మమేకమై, వారి వినతులు స్వీకరించిన అనంతరం వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారి వినతులు స్వీకరించనున్నారు.

కోనసీమలో అపూర్వ స్పందన
ఈ నెల 12వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి మీదుగా జిల్లాలోకి అడుగిడిన పాదయాత్ర అశేష జనవాహినితో చరిత్రపుటల్లోకెక్కింది. బ్రిడ్జిపైన, రాజమహేంద్రవరం బహిరంగ సభకు జనం పోటెత్తారు. మరుసటి రోజు రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం ధవళేశ్వరం, సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ బ్యారేజీ మీదుగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద కోనసీమలోకి అడుగుపెట్టింది. కోనసీమలో ప్రజా సంకల్పయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. రావులపాలెం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగం విభిన్నశైలిలో సాగడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. కొత్తపేట నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలోకి అడుగిడిన పాదయాత్రకు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

వశిష్ట గోదావరి వెంట సాగిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారు. పి.గన్నవరంలో జరిగిన బహిరంగ సభకు మునుపెన్నడూ లేనంతగా ప్రజలు హాజరవడం కోనసీమలో చర్చనీయాంశమైంది. వైనతేయ నదిపై డొక్కా సీతమ్మ వారధి మీదుగా రాజోలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌ రాజోలు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో స్థానిక సమస్యలను ప్రస్తావించడంతో ఆ ప్రాంతవాసులు ముగ్ధులయ్యారు. పాదయాత్రలో ప్రజలు చెబుతున్న బాధలు, కష్టాలనే బహిరంగ సభల్లో ప్రస్తావిస్తుండడంతో కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల సమస్యలను సైతం జననేత తన డైరీలో పొందుపరుచుకుంటుండడం ప్రజలు, ముఖ్యంగా మేధావి వర్గాన్ని ఆకట్టుకుంటోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top