30వేలు... 3సార్లు

Practical guidelines for allocation of Congress tickets - Sakshi

కాంగ్రెస్‌ టికెట్ల కేటాయింపునకు పక్కా మార్గదర్శకాలు

మూడుసార్లు ఓడిపోయిన వారికి నోచాన్స్‌

30వేల ఓట్ల కన్నా ఎక్కువ తేడాతో ఓడినా లేనట్లే

25వేల కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న వారికీ హుష్‌కాకి

కుటుంబంలో కచ్చితంగా ఒక్కరికే టికెట్‌

10–13 తేదీల్లో రాష్ట్రంలో ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ పర్యటన

15వ తేదీలోపు ఏకే ఆంటోనీ కమిటీకి అభ్యర్థుల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు పక్కాగా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపడమే లక్ష్యంగా టీపీసీసీ టికెట్ల ఖరారు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా 3 లేదా అంతకంటే ఎక్కువసార్లు ఓటమి పాలయిన ఆశావహుల అభ్యర్థనను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మూడుసార్లు ప్రజాక్షేత్రంలో మద్దతు పొందని నాయకులను రంగంలోకి దింపడం ద్వారా గెలుపు ఖాయం చేసుకోలేమనే అంచనాతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే గత ఎన్నికల్లో 30వేల ఓట్ల కన్నా ఎక్కువ తేడాతో ఓడిపోయిన వారికి, పోటీచేసి 25వేల కన్నా తక్కువ ఓట్లు పొందిన వారికి, డిపాజిట్లు కోల్పోయిన వారికి కూడా టికెట్లు కేటాయించకూడదని నిర్ణయించారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఏర్పాటయిన తర్వాత శనివారం రాత్రి జరిగిన ప్రాథమిక భేటీలో వీటిలోని కొన్ని అంశాలపై చర్చ జరిగింది. ఇదే కమిటీ ఒకట్రెండు సార్లు సమావేశమై టికెట్ల ఖరారుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలకు ఆమోదం తెలపనుంది.  

20:20:20....
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు కేటాయించడం లేదని, ఇప్పటికే అధిష్టానం ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని తెలుస్తోంది. సిట్టింగ్‌లున్నా, ఇతర ప్రత్యేక పరిస్థితులున్నా సర్దుకుపోవాల్సిందేనని, రాహుల్‌ ప్రత్యేక అనుమతి ఇస్తే తప్ప ఈసారి కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ సీట్లు కేటాయించేది లేదని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్‌ నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 7 చోట్ల ఎంతటి బలమైన అభ్యర్థులను నిలబెట్టినా ఎంఐఎంకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.

మిగిలేది 112. ఇందులో 20 స్థానాలు పొత్తుల్లో ఇతర పార్టీలకు ఇవ్వాలి. మిగిలిన 92లో మరో 20 చోట్ల కాంగ్రెస్‌ గెలిచే పరిస్థితుల్లేవు. అవిపోను మిగిలిన 72లో 20 సీట్లు వారసులకు ఇస్తే మిగిలేది 50 స్థానాలు. వారసులకు ఇవ్వాల్సి వచ్చే 20 సీట్లలో ఎంతమంది గెలుస్తారన్నది కూడా అనుమానమే. అలాంటప్పుడు సొంతంగా మెజార్టీ సాధించే అవకాశాలు మా పార్టీకి తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఖచ్చితంగా మేమే పూర్తి మెజార్టీ సాధించే దిశలోనే టికెట్ల కేటాయింపు ఉంటుంది.’అని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.

ఆ మూడు రోజులే...
ఇక, టికెట్ల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్‌ కమిటీ ఈ నెల 10–13 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనుంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఇచ్చిన 1:3 జాబితాను వడపోసే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ వడపోత అనంతరం 15వ తేదీలోపు ప్రతి నియోజకవర్గానికి 1 లేదా 2 పేర్లతో ఏకే ఆంటోనీ నేతృత్వంలోని జాతీయ ఎన్నికల కమిటీకి జాబితా ఇవ్వనుంది. అక్కడ తుది నిర్ణయం తీసుకుని 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు ఏ క్షణమైనా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ఆ సర్వే నివేదికే ‘కీలకమా’?
టికెట్ల కేటాయింపునకు మార్గదర్శకాల మాట అలా ఉంచితే... రాష్ట్రంలో నిర్వహించిన సర్వే నివేదికలే కీలకం కానున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల నుంచి సర్వే టీంలను ఏఐసీసీ రాష్ట్రానికి పంపింది. ఈ టీంలు గత నెలలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2 రకాల సర్వేలు నిర్వహించాయి.

ఫలానా నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి అయితే ఎలా ఉంటుంది? అదే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి? అనే అంశాలపై దాదాపు నెల రోజులకు పైగా నిర్వహించిన ఈ సర్వే నివేదికలను క్రోడీకరించి అప్పుడే ఏఐసీసీకి కూడా అందజేశారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివే దికల ఆధారంగా టికెట్ల కేటాయింపుపై ఏఐసీసీ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిందని, రాష్ట్ర స్థాయిలో జరిగే కసరత్తు పూర్తయితే, రెండింటినీ బేరీజు వేసి అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top