ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వండి

Posani Krishna Murali appealed to the Public About YS Jagan - Sakshi

      మళ్లీ మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు

      ప్రజలకు సినీనటుడు పోసాని కృష్ణమురళి విజ్ఞప్తి

      సీఎం కావడానికి జగన్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి

      ఇతర సీఎంల కంటే బాగా పనిచేయకపోతే నన్ను చెప్పుతో కొట్టండి

      ప్రతి ఒక్కరికీ సేవ చేయడానికే జగన్‌ ముందుకువచ్చారు

      చంద్రబాబులా అధికారం కోసం ఆయన మాయమాటలు చెప్పలేదు

      ప్రజాసంకల్పయాత్రలో జగన్‌తో కలసి నడిచి మద్దతు తెలిపిన పోసాని 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్లీ మళ్లీ ఆయన్నే గెలిపించుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కావడానికి వైఎస్‌ జగన్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఇంతకుముందున్న ముఖ్యమంత్రుల కంటే వైఎస్‌ జగన్‌ బాగా పనిచేయకపోతే ఇంటికి వచ్చి తనను చెప్పుతో కొట్టవచ్చని చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో పోసాని పాల్గొని వైఎస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు. ప్రతిపక్ష నేతతో కలసి ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామంలో కొద్దిసేపు పాదయాత్రలో అడుగులు వేశారు.

అనంతరం పోసాని ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘ఒక్కసారి జగన్‌ నమ్మి ఓటేయ్యండి. ఆయన పనితీరు చూసి ప్రతీసారి మీరే ఓటేస్తారు. ఆయనతో రెండు కిలోమీటర్లు నడవలేకపోయాను. ముఖంపై ఎండ పడుతోంది. మట్టి పడుతోంది. అయినా జగన్‌ అలాగే చేతులు ఊపుతూ అందరినీ పలుకరిస్తూ వెళ్లిపోతున్నారు. ఆయన పక్కన నడవలేక నాకు కళ్లు తిరిగాయ్‌. అలాంటిది ఆయన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఇప్పటికే రెండు వేల కిలోమీటర్లు పూర్తిచేశారు. ఆయన గురించి నేను మాట్లాడాలంటే ఆకాశమే హద్దు. ఆయన కార్యదక్షత, చిత్తశుద్ధి, ఆత్మ విశ్వాసం, ప్రజలపై ఆయనకు ఉన్న అభిమానానికి, నమ్మకానికి జగన్‌కు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. ఇలాంటి పాదయాత్ర నబూతో నభవిష్యతి. నాకు తెలిసి ఎవరూ చేయలేరు. 

ఆయనే ముఖ్యమంత్రి కావాలి..
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చూస్తుంటే ఇలాంటి వ్యక్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అన్పిస్తోంది. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి చేయాలని కాదు. ఆయన అంకిత భావం చూసి చెబుతున్నా. అధికారం కోసం అమలుగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయను, నిజాయతీ, విశ్వసనీయతతో రాజకీయ విలువలు పెంచుతానని జగన్‌ నాతో అంటుంటే గర్వంగా ఉంది. ఒక కమిట్‌మెంట్‌తో ముందుకు వచ్చిన జగన్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకే నేను మీ ‘సాక్షి’ ముఖంగా ఆంధ్రప్రదేశ్‌లో కుల మత భేదం లేకుండా వర్గ, వర్ణభేదం లేకుండా ప్రతీ ఓటర్నీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చెబుతున్నా.

జగన్‌ రెడ్డి నేను కమ్మ నాకు ఆ కులపిచ్చి లేదు. మేం క్లాస్‌మేట్స్‌ కాదు. మా ఇద్దరిది ఒక జిల్లా కాదు. కేవలం ఆయన కార్యదక్షత నాకు నచ్చింది. దైవసాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నాపై ఒట్టుపెట్టుకుని చెబుతున్నా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నమ్మి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తెలుగుదేశంలో ఏమేం లోపించినవో, ఆంధ్రదేశంలో ఏమేం జరగటంలేదో అవన్నీ చేస్తారు. రోడ్లు, నీళ్లు, నిరుద్యోగం సమస్యలతోపాటు కూలీలు, రైతులు తదితర అనేక రంగాల వారి సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఏ కులానికో, వర్గానికో పరిమితం కాకుండా మనిషన్న ప్రతీ వాడికి సేవ చేయడానికి ముందుకు వచ్చారని ప్రగాఢంగా నమ్ముతున్నాను.  

బాబు, కాంగ్రెస్‌ కలసే జగన్‌పై కేసు పెట్టారు
వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు రద్దుచేస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని అధికారం కోసం మోసం చేసినా, ఎస్సీల్లో పుట్టాలని ఎవరూ కోరుకోరని వాఖ్యలు చేసినా చంద్రబాబును ప్రజలు ప్రశ్నించడంలేదు. చంద్రబాబు తీరు ఎలా ఉంటుందంటే.. ఒక బ్రాహ్మణుడు యజ్ఞానికి ఒక మేకను తీసుకెళ్తుంటే ఆ మేకను కోసుకు తినాలని దొంగలు అనుకున్నారు.

ఆ నలుగురు దొంగలు ఒక్కొక్కరుగా విడిపోయి నాలుగు సెంటర్లలో పంతులుగారికి ఎదురుపడి మేకను చూపిస్తూనే ఏంటి కుక్కను తీసుకెళుతున్నారంటూ ఆయన్ని ప్రశ్నించి మేకను కుక్క అనుకుని వదిలేసి వెళ్లిపోయేలా చేసి మేకను ఎత్తుకెళ్లి కోసుకుని తినేశారు.

చంద్రబాబు అలాగే జగన్‌ అవినీతి పరుడంటూ తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్‌తో కలిసి జైల్లో పెట్టించాడు. వైఎస్‌ సీఎంగా ఉండగా జగన్‌పై ఏ ఒక్కరు కేసు పెట్టలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్‌ను వదిలి ఆయన బయటకు వచ్చాడో అప్పుడు రాజకీయంగా ఎదిగిపోతాడని సోనియాకు, చంద్రబాబుకు భయం పట్టుకుంది. యర్రంన్నాయుడు, శంకర్రావులతో టీడీపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు కలసి కేసులు పెట్టించి, వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చి అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. చంద్రబాబుకు రాజకీయంగా మనుషులను చంపడం మామూలే.

తన మామనే సీఎం పదవి కోసం రాజకీయంగా చంపేసాడు. కాంగ్రెస్‌ నుంచి వచ్చి ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరాడు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి రామారావుకు పదవిలేకుండా చేసి చివరకు ఆయన మానసిక క్షోభతో చనిపోయేలా చంద్రబాబు చేశాడు’’ అంటూ పోసాని మండిపడ్డారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top