ఆర్టీసీ కార్మికులను కేసీఆర్‌ బెదిరిస్తున్నారు: పొన్నం

Ponnam prabhakar commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం చంద్రశేఖర్‌రావు నియంతలా వ్యవహరి స్తున్నారని, వారిని బెదిరించేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు ‘సమ్మె చేసుకుంటే చేసుకోమనండి’ అని మాట్లాడటం తగదన్నారు.

గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు ఇలా మాట్లాడి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. గురువారం గాంధీభవన్‌లో పొన్నం విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వమే నిర్వహిస్తుందని గతంలో కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షుడిగా హరీశ్‌రావు ఉన్నందునే కేసీఆర్‌ ఈ విధంగా మాట్లాడుతున్నారని.. అదే కేటీఆరో, కవితో ఉండి ఉంటే సమస్య ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవ్వాలని పొన్నం పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొందరు ఉద్యోగ సంఘం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. అలాంటి నేతలు తమ సంఘాలను మూసేసుకుంటే మంచిదని హితవు పలికారు.

అది రాజ్యాంగ విరుద్ధం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో కేంద్రంలోని బీజేపీ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్‌నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. గోవా, మేఘాలయా, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినా ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవలేదని ప్రశ్నించారు.

బీజేపీ కపట వైఖరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న పార్టీ లు ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్, టీడీపీలు బీజేపీని ఎండగట్టే విషయంలో తమతో కలసి రావాలని కోరారు. బీజేపీ వైఖరికి నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్‌ తలపెట్టిన ఆందోళనలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పొంగులేటి పిలుపునిచ్చారు.

ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెంచాలి: చిన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను పెంచాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఏం చేసుకుంటారో చేసుకోండని ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీదరించుకుంటున్నారని చెప్పారు. ఉచిత బస్‌పాస్‌లకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు అందాల్సిన అన్ని బెనిఫిట్స్‌ వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

మత్స్యకారుల కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం 21న
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగమైన అఖిల భారత మత్స్యకారుల కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించనున్నారు. గురువారం ఈ మేరకు ఆ విభాగ చైర్మన్‌ టి.ఎన్‌.ప్రతాపన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మత్స్యకారుల వాణిని వినిపించేం దుకు, వారికి అండగా ఉండేందుకు ఈ విభాగం ఏర్పడిందని, ఇది రెండో కార్యవర్గ సమావేశమని ఆయన తెలిపారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీని యర్‌ నేతలు పాల్గొంటారని వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top