సారు..చెబితే పదహారు!

Political Setirical Story on Lok Sabha ELection - Sakshi

బాతాఖానీ

‘మావా.. ఇంతకీ మన స్టేట్‌లో ఎంపీ సీట్లెన్నంటవ్‌’ అంటూ వచ్చాడు పొద్దు పొద్దున్నే.. మా ఊళ్లో ప్రతి విషయంలో లాజిక్‌లు తీసే సాగర్రావు. ‘తెల్లందాక నిద్రపోలేదా ఏంది..? పొద్దుగాల్నే ఈ డౌటచ్చింది నీకు..?’ ఇంటి ఆవరణలో కూర్చొని చదువుతున్న పేపర్‌ మడిచిపెడుతూ ఎదురు ప్రశ్నవేశా..

‘నిద్ర సంగతి వోని గని ముందు గీ ముచ్చట చెప్పు..మన సీట్లెన్ని..?’ పట్టించుకోకుండానే మరోసారి పట్టుబట్టిండు సాగర్రావు. ‘అదేం ముచ్చట.. మన తెలంగాణల పదిహేడు ఎంపీ సీట్లున్నయి.. అవెందుకు మారుతయి.. ఎవల్నడిగినా సెబుతరు..’’ ఒకింత అసహనంగా బదులిచ్చా...

‘మరైతే.. పదహారు సీట్లకు పదహారు సీట్లు గెలుసుకోవాలంటున్నడేంది? కేసీఆర్‌ సారు..? ఆయన కే తెల్వదంటవా..?’ అసహనాన్ని పట్టించుకోకుండా లాజిక్‌ తీసిండు మావోడు.
ఓహో.. అదా సంగతి..?’ మెల్లగా విషయం అర్థం అయింది నాకు..

‘‘అలా కాదు.. హైదరాబాదు సీటును వాళ్ల సోపతి పార్టీ ఎమ్మైఎమ్మోళ్లకు వదిలిపెట్టి, మిగిలిన పదహారు సీట్లను లెక్కవెట్టి సెప్పిండు..’’ సర్ది చెప్పడానికి ప్రయత్నించా.
‘‘అంటే.. ఇప్పుడు గెల్వాల్సిన సీట్లు మొత్తం పదహారే అన్నట్లు కదా...’’ మళ్లీ మొదటికొచ్చిండు సాగర్రావు.
‘‘మొత్తం పదిహేడే.. కాని.. సోపతి పార్టీకి హైదరాబాదు సీటు ఇడిసిపెట్టిండు కాబట్టి..మిగిల్న పదహారు సీట్లకు పదహారు సీట్లు గెలుసుకోవాలని టార్గెట్‌ పెట్టుకొన్నడు కేసీఆరు..’’ కాస్త వివరంగా చెప్పేందుకు ప్రయత్నించా...

‘‘అదంత నాకు తెల్వదు.. సారు సెప్పిండంటే పదహారు సీట్లే..’’ కేసీఆర్‌పై స్వామిభక్తితో ఎవరు చెప్పినా వినేది లేదంటూ ముక్తాయింపు ఇచ్చిండు లాజిక్‌ల సాగర్రావు.
‘ఇప్పుడంతే.. కేసీఆర్‌ నోటి నుంచి వచ్చిందే వేదం.. సారు పదహారు సీట్లు గెల్వాలని లక్ష్యంగా పెట్టుకొట్టే.. రాష్ట్రంలో మొత్తం సీట్లే పదహారనే ఫీలింగ్‌కు వచ్చిండ్రు జనాలు.. ’ అని మనసులో అనుకొంటూ ఇంట్లోకి నడిచా..!– ఆది వెంకట రమణారావు,సాక్షి– మంచిర్యాల

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top