మూణ్నెల్ల కింద వోడిపోయినోల్లకు.. మల్ల వోట్లేత్తరా..?

Political Satirical Story on Lok Sabha Election - Sakshi

బాతాఖానీ

పెద్దాటో వోతంటే దానికి వెట్టిన మైకులల్ల తెలంగాన యాసల పాటత్తంది. శెయ్యి నిషాని మీద ఓటెయ్యిమని, రావుల్‌గాందిని పదాన మంత్రిని శెయ్యిమని.. అటో యెన్కాల ఇంకో జీబుల క్యాండెట్‌ నిలబడి దండం బెడ్తున్నడు..

‘అన్న గిప్పుడు వోయిన ఆటోను జూసినవా?’ అని రాజుగాడు నా దగ్గరికచ్చిండు.. యేదో కొత్త ఇశయం వున్నట్టు.
‘సూశినరా.. యేవుంది అండ్ల. ఎలశ్చన్లు గద. శెయ్యి గుర్తోల్లు పెచారం జేస్తున్రు. యెప్పుడెలశ్చన్లు అచ్చినా గివ్వి మామూలే గదర..’
‘అరె యేం లేకపోవుడేందే. గా క్యాండెటుæ మొన్న మూణ్నెల్ల కిందటి ఎలశ్చన్ల నిలవడి ఓడిపాయె గద. మల్ల గిప్పుడు ఓటియ్యిన్రని అడుగున్నడేందే’ అన్నడు రాజుగాడు.

‘రాజు గాన్ని పిస్సోని లెక్క జూసి.. అరె గప్పుడు అసంబ్లి ఎలశ్చన్లు రా. గిప్పుడు పాల్రమెంటు ఎలశ్చన్లు అచ్చినయి గద. మల్ల నిలవడ్డడు. ఓటియ్యివని అడుగతండు తప్పేవుంది?’ అన్న నాకే అన్ని దెల్సినట్టు.
‘మూన్నెల్ల కిందట్నే వోడిపాయె. గిప్పుడె మల్ల నిలవడుడేంది. ఇంకెవ్వల్‌ లేర పోట్జెయ్యనీకి..’ లాజిక్‌ దీసిండు రాజుగాడు.
‘ఆల్ల ఐకమాండ్‌ డిసైడ్‌ శేసింది. గీనెకు పైసలున్నయ్‌. కర్సు వెట్టుకుంటడు. కారు గుర్తు క్యాండెట్‌ను ఓడిత్తరని. నడువ నీకేమైతందిరా..’ నవ్వుకుంటనే నేనన్న.

‘నాకేవైతది గని. నాకు దెల్వకడుగుత. మొన్ననె అసంబ్లి ఎలశ్చన్ల నలుపై వేల వోట్లతోటి వోయిపాయె గద. గిప్పుడు పాల్రమెంటు ఎలశ్చన్ల ఏడు అసంబ్లిలు ఉంటయ్‌ గద. ఒక్కకాడ గెలవనోడు. ఏడిట్లల్ల యెట్ల గెలుస్తడని డౌటనుమానం గంతె..’ ఎగసెక్కంగనె అన్నడు వాడు.

‘నీకన్ని ఇచ్చంత్రాలేర? శెయ్యి గుర్తోళ్లు గిప్పుడు పరేశాన్ల వున్నరు. పెద్దపెద్దోల్లు అనుకున్నోల్లంత మొన్న వోడిపాయిరి. గప్పుడంటె ముక్కెమంత్రి ఎవలుండాలెనని జనం వోట్లేసిన్రు గద. పాతాయినె ముక్కెమంత్రిని జనం డిసైడ్‌ జేసిరి. గిప్పుడు పదాన మంత్రి కోసం గద. దబ్బన రావుల్‌గాందిని గెలిపియ్యాల్నని జనాలు అనుకుంటె... పైసలున్నాయిన. గంతో గింతో పేరుండె. యెంపి గావచ్చు గద. గందుకె శెయ్యి గుర్తు పెద్ద లీడర్లంత నిలవడ్డరు’ పొల్లువోకుంట శెప్పిన.

‘గట్లనా.. అసంబ్లిల్నే గెల్వలేనోల్లు పాల్రమెంట్ల గెలుత్తరా అన్న నీ మాటల్‌ గని. గందుకనె మొన్న సీయెం కొడ్కు కేటీయారు అన్నడు. గీడ చెల్లని రూపాయి బిల్ల గాడ చెల్తదా అని. గిప్పుడు సూత్తంటె గయినె అన్నదె నువ్వద్ది అనిపిస్తంది..’ అన్నడు రాజుగాడు.
‘వొక్క గిక్కడ్నే యేందిరా.. మొన్నోడిపోయిన శెయ్యి గుర్తు లీడర్లు ముగ్గురో నల్గురో పోటి జేత్తన్రు. ఒకాయనైతె మన పక్కన రంగరెడ్డి జిల్లల గెల్వనాయన కర్నారం జిల్లకు వోయిండు. ఇంకొకాయినె పాలమూరు నుంచి పట్నం అచ్చిండు. ఇంకొకామె శెయ్యి గుర్తు మీద అసంబ్లిల వోడిపొయ్యి పువ్వు గుర్తు మీద పాల్రమెంటుకు నిలవడ్డరు.. ఇగ పార్టి పెసిడెంట్‌ అసంబ్లికి గెల్శి గుడ.. యెవ్వల్లేక పాల్రమెంటుకు పోటీలున్నడు’ డిటేల్‌గ జెప్పిన.

‘నువ్వన్ని వొక్క పార్టోల్లయె చెప్తున్నవ్‌ అన్న. కమ్మం జిల్లల శెంద్రబాబు సైకిలి గుర్తు మీద వోడిపోయినాయిన గాన్నె కారెక్కి పోటి జేత్తలేడ? మంచిరాల జిల్ల శెన్నూర్ల శెయ్యి గుర్తు మీద వోడిపోయినాయ్నె సుత పెద్దపెల్లిల కార్ల శికార్‌ జెయ్యవట్టె.. దాన్నేవంటరే మరి..?’ రాజుగాడు మల్ల లాజిక్‌ దీసిండు.
‘ఎవ్వల ఇకమత్‌ వాల్లదిరా.. పొయిన కాన్నే ఏరుకోవాలె అంటరు. గిది గట్లనె.. లక్కిలాట్రి లెక్కన్న మాట. ఇంక వారమైతె తెలుస్తది గద. ఎవ్వల నసీబ్‌ ఏందో..-’పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి– కరీంనగర్‌

‘హస్త’కళ

వనపర్తిలో సోమవారం జరిగిన రాహుల్‌గాంధీ బహిరంగసభలో ఓ కార్యకర్త కాంగ్రెస్‌ పార్టీభారీ జెండాను ప్రదర్శిస్తూ విన్యాసాలు చేయడం ఆకట్టుకుంది.– ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top