పీకేబాబు.. ఏపీబాబు

Political Satirical Story on Chandrababu And Pawan Kalyan - Sakshi

పీకేబాబుకి ఫోన్‌ కలపమన్నాడు ఏపీబాబు.ఫోన్‌ కలిపి ఏపీబాబుకి ఇచ్చాడు ఏపీబాబు దగ్గరుండే పీఏబాబు.  ‘‘నీ ఆవిర్భావ సభకు రాలేకపోయాను పీకేబాబూ.. సారీ’’ అన్నాడు ఏపీబాబు. పీకేబాబుకు ఫీజులు ఫట్‌మన్నాయి.

నా ఆవిర్భావ సభా!  ‘‘ఎవడ్రా.. లైన్‌లో ఏపీబాబు ఉన్నాడని చెప్పింది’’ అని ఎగిరిపడ్డాడు.  పీకేబాబు దగ్గరా ఓ పీఏబాబు ఉన్నాడు.ఆ బాబు పరుగున వచ్చాడు.  
‘‘మైండ్‌ దొబ్బిందా.. ఏపీబాబు అని ఫోన్‌ ఇచ్చావ్‌. లోపల చినబాబు ఉన్నాడేంటి?’’ అని అరిచాడు.‘‘లోపలున్నది చిన్నబాబు కాదు పీకేబాబూ.. పెదబాబే’’ అన్నాడు పీకేబాబు పీఏబాబు.  
‘‘పెదబాబా.. పెదబాబెవరు?’’ అన్నాడు పీకేబాబు.

‘‘అదే బాబూ.. ఏపీబాబునే పెదబాబు అన్నాను’’ అన్నాడు పీఏబాబు.  పీకేబాబుకు మండిపోయింది.  
‘‘యదవ ఇంటర్‌ప్రెటేషన్‌లు ఇవ్వకురోయ్‌. కాలిపోద్ది’’ అన్నాడు. ‘‘పిలిచే వరకు మళ్లీ లోపలికి రాకు.. పో అవతలికి’’ అని కూడా అన్నాడు. పీఏబాబు వెళ్లిపోయాడు.  
ఫోన్‌లో ఉన్నది ఏపీబాబంటే నమ్మబుద్ధి కాలేదు పీకేబాబుకి! జయంతి సభని.. వర్ధంతి సభ అని, ఆవిర్భావ సభని.. ‘నీ ఆవిర్భావ సభ’ అని చినబాబు మాత్రమే అనగలడు. అయినా, కన్‌ఫామ్‌ చేసుకుందాం అనుకున్నాడు. 

‘‘హలో.. మీ పేరు చంద్రబాబేనా’’ అన్నాడు.  ఈసారి ఏపీబాబు ఫీజులు ఫట్‌మన్నాయి.  
‘‘ఎంత బాధగా ఉంటుందో తెలుసా.. ఒక సీఎంను  పట్టుకుని ‘మీ పేరు అదే కదా’ అని అడుగుతారా మీరు?! ఇదేనండీ డెమోక్రసీ. ఇలాగేనా పెద్దవాళ్లను గౌరవించడం?’’ అన్నాడు ఏపీబాబు.  
ఏపీబాబు హర్ట్‌ అయ్యాడని పీకేబాబూ కొంచెం హర్ట్‌ అయ్యాడు. ‘‘అయ్యో.. నాయుడుగారూ, ఆవిర్భావ సభని ‘నీ ఆవిర్భావ సభ’ అని స్టేట్‌ మొత్తం మీద అనగలిగింది చినబాబొక్కడే కదా. అందుకనే మీరు మీరేనా లేక చినబాబా అని తెలుసుకోడానికి మీ పేరు చంద్రబాబేనా అని అడిగానంతే’’ అన్నాడు. 

ఏపీబాబు ఇంకా హర్టయ్యే ఉన్నాడు.  
‘‘పార్టీ నీదైనప్పుడు.. నీ పార్టీ ఆవిర్భావ సభ జరుగుతున్నపుడు అది నీ ఆవిర్భావ సభే అవుతుంది కదా పీకేబాబూ..’’ అన్నాడు.  
ఆ మాటకు స్ట్రెస్‌ ఫీలయ్యాడు పీకేబాబు. నెత్తిమీద జుట్టుని చేత్తో పైకి అనుకుని, ఏపీబాబును లైన్‌లోనే మూసి, తన పీఏబాబుని పిలిచాడు.
‘‘నువ్వన్నది కరెక్టేరోయ్‌.. ఏపీబాబు పెదబాబే’’ అన్నాడు. 

పీఏబాబు ముఖం వెలిగిపోయింది.  
‘‘మరీ అంత వెలిగిపోకు, నా మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో నాకే తెలీదు. వెళ్లు. మళ్లీ నేను పిలిచినప్పుడు రా’’ అన్నాడు.  
పీఏబాబు వెళ్లాక.. మళ్లీ ఏపీబాబుకు లైన్‌ తెరిచాడు పీకేబాబు. 

‘‘ఏమైంది పీకేబాబూ.. ఏంటీ గ్యాపూ..’’ అన్నాడు ఏపీబాబు.  
‘‘గ్యాపు కాదు నాయుడుగారూ.. మ్యాపు. మీ ఫోన్‌ వచ్చినప్పుడు రూట్‌మ్యాపు వేస్తున్నా. ప్రచారం చేసుకుని చావాలిగా. ఏ రూట్‌లో వెళితే కూల్‌గా ఉంటుందా అని ప్లాన్‌ చేస్తున్నా. ఈ ఎండలు కూడా ఇప్పుడే రావాలా.. ఎలక్షన్‌ టైమ్‌లో! జగన్‌ ఎలా తిరిగాడంటారూ.. ఆ ఎర్రటి ఎండల్లో, ఆ వానాకాలం బురదల్లో, ఎముకలు కొరికే ఆ చలిలో! గ్రేట్‌ కదా’’ అన్నాడు.  
ఏపీబాబుకి కాలిపోయింది. 

‘‘గ్రేట్‌ అని చెప్పి నీ ఓటు కూడా జగన్‌కే వేస్తావా ఏంటీ పీకేబాబూ! నీకూ ఓ పార్టీ ఉంది. నీకూ ఓ కేడర్‌ ఉంది. నిన్ను నమ్ముకుని ఇక్కడొక పార్టీ ఉంది. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ. అది మర్చిపోకు’’ అన్నాడు.  
‘‘జగన్‌ గ్రేట్‌ అన్నాను కానీ, జగన్‌ గ్రేట్‌ అని ప్లకార్డ్‌ పట్టుకుని తిరుగుతానా నాయుడుగారూ! చెప్పండి, ఏంటి ఫోన్‌ చేశారు?’’ అన్నాడు పీకేబాబు.  
‘‘చెప్పాను కదయ్యా.. ఆవిర్భావ సభకు రాలేకపోయానని. సారీ చెబ్దామని ఫోన్‌ చేశాను. సారీ చెప్పాను’’ అన్నాడు ఏపీబాబు.  
పీకేబాబు నవ్వాడు.  ‘‘నాకు సారీ చెప్పమన్లేదు నాయుడుగారూ.. ప్రజలకు చెప్పమన్నాను. మీరు తిన్నగా ఉండుంటే, చేస్తానన్నది చేసుంటే.. నేనిప్పుడు మీకోసం ఇంత డబుల్‌ యాక్షన్‌ చేయాల్సిన పనేముందీ!’’ అన్నాడు.  –మాధవ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top