ట్రిపుల్‌.. ట్రబుల్‌

Political Parties Target to Uttar Pradesh Elections - Sakshi

యూపీలో మూడుముక్కలాట 

బరిలో బీజేపీ – ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి – కాంగ్రెస్‌

అన్ని పార్టీల్లోనూ లుకలుకలు.. గెలుపు కోసం ఎత్తులు.. పైఎత్తులు

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాజకీయంగా ఏ పార్టీకయినా ఎంతో కీలకమైనది. ఇక్కడ ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఢిల్లీలో పాగా వేయడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఢిల్లీ కోటకు సింహద్వారంగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లో నెహ్రూ–గాంధీ కుటుంబానికి మంచి పట్టు ఉండేది.  తొలి ఎన్నికల నుంచి మూడు దశాబ్దాలకుపైగా ఆ పార్టీ ఇక్కడ రాజ్యమేలింది. తర్వాత ప్రాంతీయ పార్టీలు బలపడటంతో కాంగ్రెస్‌ బలహీనపడింది. ఓబీసీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ, దళితుల మద్దతుతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధికారం కైవసం చేసుకున్నాయి. మరోవైపు బీజేపీ కూడా గణనీయంగా బలపడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ విజయం సాధించింది.    

ప్రస్తుత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ముక్కోణపు పోటీ అనివార్యమయింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) ఒక కూటమిగా బరిలో ఉంటే, కాంగ్రెస్, బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 19 సీట్లే గెలుచుకోగలిగింది. ఒంటరిగా పోటీ చేసిన ఎస్పీ 47 సీట్లకే పరిమితమయింది. 2018లో జరిగిన వరుస ఉప ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కలిసి పోటీచేసి బీజేపీని ఓడించాయి. దాంతో పొత్తుతో బీజేపీని చిత్తు చేయవచ్చని ఈ రెండు పార్టీలకు నమ్మకం కుదిరింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ 38 చోట్ల, ఎస్పీ 37 చోట్ల పోటీ చేస్తున్నాయి. 3 స్థానాలను మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్‌కు కేటాయించాయి.

కాంగ్రెస్‌ ఒంటరిపోరు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలో దిగుతోంది. గత ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఈసారి కాంగ్రెస్‌తో కలవడానికి బీఎస్పీ అధినేత మాయావతి ఇష్టపడటం లేదు. సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌కు మాయవతి కూటమికి రాజీ కుదరలేదు. పొత్తు కోసం తన స్థాయిని తగ్గించుకోవడానికి కాంగ్రెస్‌ సముఖంగా లేదు. ఇప్పుడు తలొంచితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తలొగ్గాల్సి వస్తుందని భావించిన కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలో దిగుతోంది. ఇంత వరకు మొత్తం 27 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవలే యూపీ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకా గాంధీ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ప్రచార వ్యూహాలు పన్నుతున్నారు.

పట్టు కోసం ‘కమల’ తంత్రం
అధికార బీజేపీ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుంది. రాష్ట్రంలో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి, ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన మేరకు విజయం సాధించలేకపోవడంతో ఈసారి ఎలాగైనా పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. విపక్షాల్లో చీలికలు తేవడం, మిత్రపక్షాలను పెంచుకోవడం ద్వారా లబ్ధిపొందేందుకు కమలనాథులు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అప్పాదళ్, సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) నేతలకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం ద్వారా వారు జారిపోకుండా జాగ్రత్త పడింది.

బీజేపీకి ప్లస్‌.. మైనస్‌
ఉప ఎన్నికల ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై కూడా పడుతుందని విశ్లేషకుల అంచనా. ఈసారి ఎస్పీ, బీఎస్పీల కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 2014  ఎన్నికల్లో బీజేపీ సమాజ్‌వాదీ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీల నుంచి యాదవేతరుల ను, బీఎస్పీ ఓటు బ్యాంకు నుంచి జాటవేతర  దళి తులను దూరం చేసి తనవైపునకు తిప్పుకోవడం ద్వారా వాటి ఓటు బ్యాంకులను కొల్లగొట్టి లబ్ది పొందింది. తమ ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడానికి పూర్వ శత్రుత్వాలను మరిచి బీఎస్పీ, ఎస్పీలు చేతులు కలపడం బీజేపీకి సవాలుగా పరిణమిస్తుంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి సకల ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక ల విజయంతో నైతిక బలం పుంజుకున్న కాంగ్రెస్‌ ఈసారి రాష్ట్రంలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని పరిశీలకుల అంచనా.

రాహుల్‌ సోదరి ప్రియాంక రాక కూడా కొద్దోగొప్పో ప్రభావం చూపుతుందని వారంటున్నారు. ఒకవైపు ఎస్పీ, బీఎస్పీ కూటమి, మరోవైపు పునరుత్తేజిత కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం బీజేపీకి అంత సులభం కాదని ఎన్నికల పండితులు చెబుతున్నారు. తాజాగా ప్రకటించిన ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ కొంత వరకు బీజేపీకి లాభించవచ్చని పరిశీలకుల భావన. పుల్వామా దాడి కూడా రాష్ట్రంలో బీజేపీకి అనుకూలించే అంశం కావచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలకు కలిపి 44 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 42.63శాతమే పడ్డాయి.అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా రాజకీయ చాణక్యమే కారణం. అయితే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పని తీరు, గోరక్షకుల మూక హత్యలు, కేంద్రంలో బీజేపీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తదితర నిర్ణయాలు బీజేపీ పరపతిని తగ్గించా యి. దీని ఫలితం.. 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో కనబడింది. విపక్షాల సంగతి పక్కన పెడితే 2014 నాటి స్థాయిలో లేకపోయినా మోదీ హవా తగ్గిపోలేదన్నది బీజేపీకి సానుకూల అంశం. అదీకాక బద్ద శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు ఇప్పుడు చేతులు కలిపినా వాటి ఓటర్లు అంత సులభంగా కలుస్తారా అన్నది అనుమానమే.

ముక్కోణపు పోటీ ఎవరికి లాభం?
80 లోక్‌సభ నియోజకవర్గాల్లో చాలాచోట్ల ఎస్పీ–బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి, కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్నాయి. ఈ ముక్కోణపు పోటీ నుంచి లబ్ధి పొందాలని అధికార బీజేపీ చూస్తోంది. ప్రతిపక్షాల్లో చీలికవచ్చి ముక్కోణపు పోటీ జరిగితే సాధారణంగా అధికార పార్టీకే లాభం కలుగుతుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో బహుముఖ పోటీ జరిగింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలు వేటికవి సొంతంగా పోటీ చేశాయి. దాంతో వాటి దృష్టంతా సొంత అభ్యర్థుల గెలుపుపైనే పెట్టడంతో బీజేపీ గెలుపు సునాయాసమయ్యింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 80 సీట్లకు 71 సీట్లు        కైవసం చేసుకుంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అఖండ విజయం సాధించింది. మొత్తం 403 స్థానాల్లో 312 సీట్లు గెలుచుకుంది. 2018 ఉప ఎన్నికల్లో అఖిలేశ్, మాయావతి చేతులు కలపడంతో బీజేపీ దెబ్బతింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top