పొలిటికల్‌ సప్లిమెంటరీ డిసెంబర్‌ పోతే.. ఏప్రిల్‌ ఉందిగా!

Political Parties Campaign For Lok Sabha Elections - Sakshi

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలు..

లోక్‌సభ బరిలో నిలిచి..

గెలుపు కోసం సీరియస్‌ ప్రిపరేషన్‌

‘పోయిన చోటే వెతుక్కోవాలి’ సామెతను ఫాలో అవుతున్నారు మన నాయకులు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నాయకులు ఈ నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో అధికార పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. టీడీపీని వీడిన నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ను వీడిన బి.వెంకటేష్‌ నేత టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ను వీడిన డీకే అరుణ బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ బరిలో నిలిచారు. వీరితోపాటు కిషన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రమేష్‌ రాథోడ్, రేవంత్‌రెడ్డి.. ఇలా మొత్తం పద్నాలుగు మంది పొలిటికల్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కు సీరియస్‌గా ప్రిపేర్‌ అవుతున్నారు. వీరి సంగతిలా ఉంటే.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బెటర్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లున్నారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఈయన నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

రమేష్‌ రాథోడ్‌– ఆదిలాబాద్‌
ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ అసెంబ్లీ స్థానానికి తొలిసారిగా (1999) జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్‌ రాథోడ్‌ ఎన్నికయ్యారు. తదుపరి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి  ఆయన ఆదిలాబాద్‌ నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నిక, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన భార్య సుమన్‌ రాథోఢ్‌ ఖానాపూర్‌ నుంచి అసెంబ్లీకి  ఎన్నికయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రమేష్‌ రాథోడ్‌ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆదిలాబాద్‌ లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.

బి.వెంకటేష్‌ నేత– పెద్దపల్లి
చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన బి.వెంకటేష్‌ నేత అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పొన్నం ప్రభాకర్, బండి సంజయ్‌– కరీంనగర్‌
ఈ ఇద్దరూ 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. బండి సంజయ్‌ బీజేపీ తరఫున, పొన్నం కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో అవే పార్టీల నుంచి తలపడుతున్నారు. 

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి– భువనగిరి
నల్లగొండ అసెంబ్లీ స్థానానికి 1999 నుంచి 2014 వరకు నాలుగుసార్లు కాంగ్రెస్‌ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున భువనగిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు.

మల్లు రవి– నాగర్‌కర్నూలు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1991, 1998 ఎన్నికల్లో నాగర్‌కర్నూలు ఎంపీగాను, 2008 ఉప ఎన్నికలో జడ్చర్ల ఎమ్మెల్యేగాను గెలిచారు మల్లు రవి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జడ్చర్లలో పోటీచేసి ఓడిపోయారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

డీకే అరుణ– మహబూబ్‌నగర్‌
గద్వాల నుంచి 2004 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి గెలిచిన డీకే అరుణ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

నామా నాగేశ్వర్‌రావు– ఖమ్మం
టీడీపీ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభస్థానం నుంచి గెలిచారు. లోక్‌సభలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌గానూ పనిచేశారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరి.. ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీకి దిగారు.

బలరామ్‌ నాయక్‌– మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ తరఫున 2009 ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన బలరామ్‌ నాయక్‌.. మన్‌మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తదుపరి ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

కిషన్‌రెడ్డి– సికింద్రాబాద్‌
బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2004 ఎన్నికల్లో హిమాయత్‌నగర్‌ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. పునర్విభజనలో ఆ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా ఏర్పడిన అంబర్‌పేట నియోజకవర్గానికి 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

రేవంత్‌రెడ్డి, ఎన్‌.రామచందర్‌రావు– మల్కాజిగిరి
టీడీపీ తరఫున కొడంగల్‌ నుంచి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు, ఆ తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బరిలో నిలిచారు. అలాగే, బీజేపీ తరఫున హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ గెలిచిన ఎన్‌.రామచందర్‌రావు మల్కాజిగిరి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈ లోక్‌సభ ఎన్నికలోనూ అదే పార్టీ నుంచి మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్నారు.

ఫిరోజ్‌ఖాన్‌– హైదరాబాద్‌
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరోజ్‌ఖాన్‌ నాంపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈయన తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసినా గెలవలేదు. తాజాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

రఘునందన్‌రావు– మెదక్‌
భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్‌రావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఈ లోక్‌సభ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున మెదక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఆయన.- తాటి జాన్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top