ఫ్యాను గాలి జోరు

Political leaders and cine actress joins ysrcp party - Sakshi

తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు

టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరుతున్న కీలక నేతలు

ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీల చేరిక

చంద్రబాబు నిరంకుశ ధోరణి, అవమానాలు భరించలేకేనని స్పష్టీకరణ

తాజా పరిణామాలతో చంద్రబాబులో కలవరం

సాక్షి, అమరావతి/ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. వారికి సర్దిచెప్పి నిలువరించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. టీడీపీకి రాజీనామాలు సమర్పించి వైఎస్సా ర్‌సీపీలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జగన్‌ నివాసానికి వస్తున్న నేతలు, వారి అనుచరులతో ఆ పరిసర ప్రాంతాలన్నీ జాతరను తలపిస్తున్నాయి. చంద్రబాబు నిరంకుశ ధోరణి, ఎదుర్కొంటున్న అవమానాలు భరించలేకే టీడీపీని వీడుతున్నట్లు వైఎస్సార్‌సీపీలో చేరుతున్న నేతలు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీలోకి వలసలు మరింత ఊపందు కున్నాయి. గురువారం సైతం పార్టీలోకి చేరికలు కొనసాగాయి. తాజా పరిణామాలు టీడీపీ వర్గాల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఒకదశలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ అభ్యర్థులను వెతుక్కో వాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబులో పెరిగిపోతున్న అసహనం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో వెల్లువెత్తు తున్న అభిమానాన్ని చూస్తుంటే.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించడం తథ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలుగుదేశం శ్రేణులు సైతం తమ అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని అంగీకరిస్తుండటం గమనార్హం. 

వైఎస్సార్‌సీపీలోకి క్యూ కట్టిన నేతలు
తెలుగుదేశం పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్టీ రామారావు పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుని తీసుకొని వచ్చి పార్టీలో చేర్చారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అయితే చంద్రబాబు విధానాలు నచ్చక ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీలో సీనియర్‌ నేతలుగా కొనసాగి, ఆ పార్టీకి ఎంతోకాలం వెన్నుదన్నుగా నిలిచిన దాసరి జైరమేష్, ఆయన సోదరుడు బాలవర్ధనరావులు కూడా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడకే చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అంతకుముందే పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకే చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి, గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌తో సహా పలువురు నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌ దంపతులు, విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు వైఎస్సార్‌సీపీలో చేరారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులు మొత్తం టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వలస వచ్చారు. అంతకు ముందే పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరినా.. ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వచ్చారు. అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు కూడా పార్టీలో చేరారు. ఇక సినీ నటులు జయసుధ, అలీ, పృధ్వి, కృష్ణుడు, రాజారవీంద్ర తదితరులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరి ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఇక గురువారం టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీకి రాజీనామా చేస్తాననే సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. 

గురువారం కొనసాగిన చేరికలు
కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గురువారం వైఎసాŠస్‌ర్‌సీపీలో చేరారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్, హిందూపురంకు చెందిన వాల్మీకి సంఘం నేత వాల్మీకి రామాంజనేయులు, నంద్యాలకు చెందిన గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఛైర్మన్‌ దస్తగిరిరెడ్డి కూడా పార్టీలో చేరారు. వారు వేర్వేరుగా తమ అనుచరులతో వచ్చి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. లబ్బి వెంకటస్వామి, దస్తగిరిరెడ్డిలు చేరిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కర్నూలు నేతలు శిల్పామోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు. వాల్మీకి రామాంజనేయులు చేరినప్పుడు కర్నూలు నేత ప్రత్తికొండ మురళీధర్‌రెడ్డి ఉన్నారు. 

శ్రీకాకుళం టీడీపీ నేతల చేరిక
శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు పలువురు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటకు చెందిన సీనియర్‌ నాయకులు దంతులూరి రమేష్‌బాబు, లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. హయాతినగరంలో యలమంచిలి హరికృష్ణ యాదవ్‌తోపాటు 35 మంది పార్టీలో చేరారు. వీరందరికీ  సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బద్రి రామారావుతోపాటు 80 కుటుంబాలు తమ్మినేని సీతారాం సమక్షంలో పార్టీలో చేరారు. పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం కడగండి గ్రామానికి చెందిన 200 కుటుంబాలు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సమక్షంలో పార్టీలో చేరారు. పాతపట్నంలో 60 మంది మత్స్యకారులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

రేపు చేరనున్న కపలవాయి
టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్‌ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్‌ ఈనెల 16న పిడుగురాళ్లలో జరగనున్న వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలో పార్టీలో చేరతారని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

చంద్రబాబులో కలవరం
పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వెళ్లిపోతుండడం చంద్రబాబును తీవ్రంగా కలవరపరుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర తర్జనభర్జనలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రతి నియోజకవర్గంలోనూ అసమ్మతులు భగ్గుమంటున్నాయి. నేతలు, కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబు తాత్కాలిక నివాసానికి చేరుకొని మరీ నిరసన తెలియజేస్తున్నారు. మంత్రులు, సీనియర్‌ నేతల నియోజకవర్గాలకూ ఇవి తప్పడం లేదు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గం సత్తెనపల్లిలో ఆయన వ్యతిరేకవర్గం తీవ్రమైన దూషణలతో నిరసనలకు దిగుతున్నారు. కుక్కను నిలబెట్టినా గెలిపిస్తాం కానీ కోడెలను మాత్రం అంగీకరించేది లేదంటూ గత మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.

తిరువూరు ‘దేశం’లో భగ్గుమన్న అసమ్మతి
తిరువూరు టిక్కెట్‌ను మంత్రి జవహర్‌కు కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయించడంతో ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు వర్గీయులు ధర్నాకు దిగారు.  పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు మళ్లీ స్వామిదాసుకే టిక్కెట్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. దాసు అనే సీనియర్‌ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం నిర్ణయం మారని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తామని పలువురు నేతలు అల్టిమేటం ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top