హద్దులు దాటిన హైడ్రామా

Political High Drama in Karnataka - Sakshi

రెబెల్స్‌ను కలిసేందుకు వెళ్లిన డీకేశి  

హోటల్‌ వద్ద అడ్డుకున్న పోలీసులు  

కుమారస్వామి, డీకే నుంచి   ప్రాణాపాయం ఉందన్న రెబెల్స్‌   

శాసనసభ్యత్వానికి మంత్రి నాగరాజు, ఎమ్మెల్యే సుధాకర్‌ రాజీనామా  

విధానసౌధలో సుధాకర్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు  

తీవ్ర ఉద్రిక్తత  పోలీస్‌ కమిషనర్‌ రాక  

రాజ్‌భవన్‌కు సుధాకర్‌  గవర్నర్‌కు రాజీనామా లేఖ

సాక్షి, బెంగళూరు: కన్నడనాట సంకీర్ణ సర్కారు సంక్షోభం బెంగళూరుతో పాటు దేశ వాణిజ్య రాజధాని ముంబయ్‌లోనూ ప్రకంపనలు సృష్టించింది.  నాలుగు రోజుల నుంచి ముంబయిలో మకాం వేసిన కాంగ్రెస్, జేడీఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించాలంటూ  కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్, (మాజీ) మంత్రి డీకే శివకుమార్‌ బుధవారం ఉదయం ముంబయ్‌కి వెళ్లారు. ఆయనతో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు జీటీ దేవెగౌడ, శివలింగేగౌడ, బాలకృష్ణ ప్రత్యేక విమానంలో వెళ్లారు. 

హోటల్‌లోకి నో ఎంట్రీ  
రినైజాన్స్‌ హోటల్‌ వద్దకు వెళ్లిన మంత్రి డీకే శివకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు అనుమతించలేదు. అయితే హోటల్‌లో తాను రూమ్‌ బుక్‌ చేసుకున్నానని.. వెళ్లి వస్తానని మంత్రి డీకే చెప్పినా పోలీసులు వినలేదు. పోలీసులకు, డీకే శికి మధ్య వాగ్వాదం కొనసాగింది. అనంతరం మంత్రి డీకే మీడియాతో మాట్లాడుతూ హోటల్‌లో ఉన్నవారు కూడా తనకుమిత్రులే అన్నారు. ఈ క్రమంలో వారితో స్నేహపూర్వకంగా మాట్లాడేందుకే వచ్చానని చెప్పారు. అయితే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదన్నారు. లోపలకు వదలకపోవడంతో రోడ్డుపైనే డీకే అల్పాహారం గావించారు. ఎమ్మెల్యేలను కలవకుండానే డీకే తిరుగుముఖం పట్టారు. 

ప్రాణహాని ఉందని రెబెల్స్‌ ఫిర్యాదు  
ఈ తతంగాన్నంతా ప్రత్యక్షంగా, టీవీల్లో తిలకిస్తున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. మంత్రి డీకే శివకుమార్, కర్ణాటక సీఎం కుమారస్వామి నుంచి రక్షణ కల్పించాలని పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హోటల్‌ వద్ద భద్రత పెంచాలని కోరారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కాగా, సీఎల్పీ నేత సిద్ధరామయ్య డీకే శివకుమార్‌ ముంబయ్‌ వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన తర్వాత మంత్రి డీకే శివకుమార్‌ హోటల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. మంత్రి డీకే శివకుమార్‌ ముంబయి వెళ్తారని తెలిసి మంగళవారం రాత్రే బీజేపీ నేతలు ఆర్‌.అశోక్, కేజే బోపయ్య రినైజాన్స్‌ హోటల్‌కు చేరుకున్నారు. రెబెల్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడి అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.   

సాక్షి బెంగళూరు: సంక్షోభ రాజకీయాలు సినిమా కంటే రసవత్తరంగా సాగుతున్నాయి. గంటగంటకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గత వారం రోజులుగా సంకీర్ణ రెబెల్స్‌ రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. బుధవారం మంత్రి ఎంబీటీ నాగరాజు, సుధాకర్‌ రాజీనామాకు యత్నించారు. నాగరాజు స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. కె.సుధాకర్‌ను మాతం కాంగ్రెస్‌ నాయకులు విధానసౌధలోనే అడ్డుకున్నారు.  రాజీనామా వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి సౌధ నాలుగు గేట్లను బంద్‌ చేశారు. సుమారు వెయ్యి మంది పోలీసులు విధానసౌధ చుట్టుముట్టారు. గవర్నర్‌ వజూభాయ్‌వాలా.. ఎమ్మెల్యే కె.సుధాకర్‌ను 10 నిమిషాల్లో తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌కుమార్‌ విధానసౌధకు చేరుకుని మంత్రి కేజే జార్జి చాంబర్‌లో ఉన్న ఎమ్మెల్యే సుధాకర్‌ను గవర్నర్‌ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగాసుధాకర్‌ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ వీఆర్‌ వాలాకు అందజేశారు. అంతకుముందు సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు సుధాకర్‌కు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ వీడబోరని సిద్ధు చెప్పారు. బీజేపీ నాయకులు గూండాయిజం చేస్తే భయపడేది లేదన్నారు.

అభివృద్ధి లేదు, అందుకే రాజీనామా: సుధాకర్‌
గవర్నర్‌తో భేటీ అనంతరం చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే కె.సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ తన ఆత్మసాక్షిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అయితే అసెంబ్లీ ఆవరణలో తోపులాట జరిగిన మాట వాస్తవమే. అందులో ఎవరి తప్పూ లేదు. కానీ కాంగ్రెస్‌ నేతలు అలా ప్రవర్తించి ఉండకూడదు. మాజీ సీఎం సిద్ధరామయ్య నాకు ఆదర్శం. నాపై దాడికి దిగారేమో అని నా కుటుంబసభ్యులు భయపడ్డారు. నేను ఇప్పటి వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. సొంత నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. కాంగ్రెస్‌ నేతలు నియంత్రించాలనుకుంటే కుదరదు. నేనేం స్కూల్‌ పిల్లాడిని కాను. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 13 నెలలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఫలితంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు. ఎంటీబీ నాగరాజు కూడా ఆయన వెంట ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top