కథ బెంగళూరు చుట్టూనే..

Political Drama in Karnataka - Sakshi

అసమ్మతి నేతలకు కేరాఫ్‌  

రెండు పార్టీల్లోనూ ఇదే తంతు

సాక్షి బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. అసమ్మతి ఎమ్మెల్యేలకు కేంద్రంగా మారింది. అసమ్మతి వాదం బెళగావి జిల్లాలో (గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహోళి) ప్రారంభమైనప్పటికీ బెంగళూరు కేంద్రంగా తారస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది బెంగళూరుకు చెందిన వారు ఉండటమే విశేషం. నగరంలోని 28 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 15, జేడీఎస్‌ 2, బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కాంగ్రెస్‌ – జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు అసంతృప్తిగా ఉన్నారు. అందులో ఐదుగురు కాంగ్రెస్‌ (రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, మునిరత్న, రోషన్‌బేగ్, ఎస్‌టీ సోమశేఖర్‌) జేడీఎస్‌ నుంచి ఒకరు (గోపాలయ్య) ఉన్నారు. అదేవిధంగా బెంగళూరు రూరల్‌ పరిధిలోని హొసకోటె ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు కూడా అసంతృప్తుల జాబితాలోకి వెళ్లిపోయారు. బెళగావి జిల్లా రాజకీయాల్లో మంత్రి డీకే శివకుమార్‌ జోక్యం చేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రమేశ్‌ జార్కిహోళి బీజేపీలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సరైన సంఖ్యాబలం లేక ఆలస్యమైనప్పటికీ బెంగళూరు నగర ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. 

రేవణ్ణ జోక్యంతోనే..
ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోదరుడు మంత్రి హెచ్‌డీ రేవణ్ణ బెంగళూరులోని అన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగింది. సూపర్‌ సీఎంగా పేరుమోసిన రేవణ్ణ.. తన పరిధి దాటిపోయి అన్ని శాఖల్లో జోక్యం చేసుకోవడం కూడా కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేదు. సీఎం కుమారస్వామికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ ఏం చేయలేని పరిస్థితి. ఈక్రమంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. రేవణ్ణ నుంచి ప్రభుత్వాన్ని కాపాడాలని లేని పక్షంలో తాము మద్దతు ఇచ్చేది లేదని పలుసార్లు హెచ్చరించినా.. దళపతులు పట్టించుకోలేదు. మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా సీఎం కుమారస్వామికి రేవణ్ణ గురించి ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో సిద్ధరామయ్య నేతృత్వంలోనే అసమ్మతి వాదులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినట్లు సమాచారం. 

చిక్కుల్లో సీఎం కుమార
ఓవైపు రేవణ్ణను నియంత్రించలేక.. మరోవైపు కాంగ్రెస్‌ నేతలను బుజ్జగించలేక సీఎం కుమారస్వామి ఇరుక్కుపోయారు. రాజీనామా చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కాగా సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెడితే.. అసమ్మతిలోని కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు ఇస్తామని ప్రకటించారు. కానీ జేడీఎస్‌ పెద్దలు ఒప్పుకోవడం లేదు. సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెడితే మద్దతు ఉపసంహరించుకుంటామని మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నఫలంగా సీఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానానికి సవాల్‌ విసిరారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. తాను బుజ్జగించిన మంత్రి ఎంటీబీ నాగరాజు ముంబయి తరలివెళ్లడంతో సీఎం కుమారస్వామి ధైర్యం కోల్పోయారు. 

రామలింగారెడ్డి ఏం చేస్తారో?
సంకీర్ణ ప్రభుత్వాన్ని మనుగడ సాగించాలంటే.. మాజీమంత్రి, బీటీఎం లేఅవుట్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి నిర్ణయం కూడా అవసరం అనిపిస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్‌ పెద్దలు మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ వెళ్లి చర్చించారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు బుజ్జగించే ప్రయత్నం చేశారు. రామలింగారెడ్డి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు కేబినెట్‌ బెర్తు ఖరారు చేయాలని రామలింగారెడ్డి షరతు విధించినట్లు సమాచారం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top