ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల వ్యూహం

PM Narendra Modi Coming With A Masterplan For Loksabha Elections - Sakshi

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికలు, కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతిపక్షాలు మంచి ఊపుమీదున్నాయి. అందరూ ఏకమై 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఓడించడమే అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం మహాకూటమి ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి స్పష్టమైన ప్లాన్‌ ఇంకా సిద్ధం కావాల్సివుంది. ఈలోగా ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్‌ తదితర పార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.

ప్రతిపక్షాల కూటమిని ఎదుర్కొనేందుకు బీజేపీ సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో ఓ అద్భుత అవకాశం ఆ పార్టీ తలుపు తట్టింది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లకు చెందిన 140 మంది చెరకు రైతులు జూన్‌లో ప్రధానమంత్రిని కలసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇదే అదనుగా తీసుకున్న బీజేపీ వరికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 200 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పార్టీ మెసేజ్‌ను ప్రతి రాష్ట్రానికి చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ మేరకు వరుసగా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వంలో ఎన్నికల హడావుడి మొదలైనట్లు అర్థం అవుతుంది. దేశవ్యాప్తంగా రైతు ర్యాలీలను నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువ కావాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ నెల 11న పంజాబ్‌లోని ముక్త్‌సర్‌లో ర్యాలీని బీజేపీ నిర్వహించింది. ఈ ర్యాలీకి హాజరైన ప్రధాని మోదీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.

70 ఏళ్ల పాటు రైతుల ఓటు బ్యాంకుతో రాజ్యం ఏలిన కాంగ్రెస్‌ పార్టీ ఒక కుటుంబ అభివృద్ధికి మాత్రమే పాటు పడిందంటూ ఆరోపించారు. ఈ నెల 21వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో బీజేపీ భారీ ర్యాలీని చేపట్టనుంది. అనంతరం ఒడిశా, కర్ణాటకల్లో సైతం ర్యాలీలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, ప్రత్యేకంగా రైతుల కోసం తెచ్చిన పథకాల గురించి ఈ ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు సమాచారం.

ప్రపంచంలో అతిపెద్ద శామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ ప్లాంటును నోయిడాలో ప్రారంభించిన మోదీ అక్కడినుంచే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని సైతం ఆరంభించారు. ఈ నెల 14, 15 తేదీల్లో యూపీలోని ఆజాంఘర్‌, వారణాసి, మీర్జాపూర్‌లలో మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 29న లక్నో స్మార్ట్ సిటీ కార్యక్రమానికి కూడా మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో మహాకూటమిని లక్ష్యంగా చేసుకుని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తారని తెలిసింది.

వచ్చే ఫిబ్రవరిలోగా దేశవ్యాప్తంగా 50 ర్యాలీలకు మోదీ హాజరవుతారని సమాచారం. ఒ‍క్కో ర్యాలీలో రెండు నుంచి మూడు లోక్‌సభ స్థానాలను కవర్‌ చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికల జరిగే రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌లలో ప్రచారం కోసం అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మోదీ ప్రత్యేక పర్యటనలు చేస్తారని తెలిసింది. కేవలం మోదీకే పరిమితం కాకుండా పార్టీ సీనియర్‌ నాయకులు సైతం దేశవ్యాప్తంగా పర్యటిస్తారని సమాచారం. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీలు కూడా ర్యాలీలు నిర్వహిస్తారని తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top