స్పష్టమైన విధానం.. సరైన దిశ 

PM Modi talk With IANS After 75 Days Ruling Govt - Sakshi

75 రోజుల పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలను అమలు చేసిందని, స్పష్టమైన విధానం, సరైన దిశ ఉండటం వల్లే ఇది సాధ్యపడిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి 75 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడారు. ‘బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలను వేగవంతంగా అమలు చేసింది. ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విధానం, సరైన ఉద్దేశం వల్లే ఇది సాధ్యపడింది. ఈ 75 రోజుల్లో చాలా మార్పులు సంభవించాయి.

చిన్నారులకు భద్రత నుంచి చంద్రయాన్‌–2 వరకు, అవినీతిపై పోరు నుంచి ముస్లిం మహిళకు రక్షగా ఉండే ట్రిపుల్‌ తలాక్‌ చట్టం వరకు, కశ్మీర్‌ నుంచి రైతు సంక్షేమం వరకు ఇలా.. ప్రజల తరఫున పనిచేయాలనుకునే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఏం చేయగలదో అంతకంటే ఎక్కువే చేసి చూపించాం’ అని పేర్కొన్నారు. ‘ప్రజల జీవితావసరం నీరు. అందుకే దేశంలో నీటి సరఫరా, నీటి సంరక్షణ విధానాలను పటిష్టం చేసి, అమలు చేసేందుకు ప్రత్యేకంగా జల్‌శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. 1952 తర్వాత 17వ లోక్‌సభ సమావేశాలు అత్యంత ఫలవంతంగా సాగి చరిత్ర సృష్టించాయి. ఈ సమావేశాల్లోనే వ్యాపారులు, రైతులకు పింఛన్లు అందించే బిల్లు, వైద్య రంగం సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లు, దివాలా కోడ్, కార్మిక చట్టాల సంస్కరణల బిల్లుతోపాటు ఎంతో కీలకమైన కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లులు సభ ఆమోదం పొందాయి. అదే సమయంలో అనేక వివాదాలు తలెత్తాయి. ప్రభుత్వం అన్నిటినీ పరిష్కరించింది’ అని ప్రధాని మోదీ తెలిపారు.

విదేశాంగ శాఖను మార్చేశారు ! 
విదేశాంగ శాఖ రూపురేఖలను సుష్మా స్వరాజ్‌ మార్చేశారని మోదీ కొనియాడారు. నిబంధనలు ఉన్న ప్రొటోకాల్‌ స్థాయి నుంచి ప్రజల పిలుపునకు స్పందించే కార్యాలయంలా ఆ శాఖను మార్చారన్నారు. పార్టీ నేతలతో కలసి మంగళవారం ఆయన సుష్మాకు  నివాళులర్పించారు. 2014లో ఐక్యరాజ్యసమితి సభలో ప్రసంగించాల్సిన ముందు రోజు ఆమెతో మాట్లాడానని, రేపటి ప్రసంగం ఎక్కడ అని అమె అడిగారని తెలిపారు. తను ప్రసంగాలు రాసుకోననగా, అందుకు సుష్మా ‘అది కుదరదు, భారత్‌ గురించి మీరు చెప్పాల్సిందే. మీకు నచ్చినట్లు మాట్లాడటానికి లేదు’ అన్నారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఎంత గొప్ప వక్తలైనా కొన్ని చోట్ల చూసి చదవాల్సిందేనని ఆమె తెలిపారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top