పవన్‌ ఎవర్ని ప్రశ్నించారు?

Perni Nani Slams Pawan Kalyan And ChandraBabu Naidu - Sakshi

అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీని విమర్శించి, అధికారంలో ఉన్నప్పుడూ తమనే విమర్శించడాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పనిగా పెట్టుకున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.  గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తమను విమర్శించి, ఇప్పుడు కూడా అధికార పక్షాన్నే విమర్శిస్తారా అంటూ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో లాలూచీ, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డితో పేచీనే పవన్‌ విధానంగా కనబడుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘అసలు పవన్‌ ఎవర్ని ప్రశ్నించారు. కేవలం సీఎం జగన్‌ను మాత్రమే  ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన్నే ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అధికార పార్టీనే ప్రశ్నిస్తున్నారు’అని విమర్శించారు.

‘పవన్‌కి కేసుల్లేవ్ కదా.. బీజేపీ, టీడీపీ తో ఏం సాధించారు.. మేమిచ్చిన జీవో 486 కోసం మోదీకి చెప్తానన్న పవన్.. అప్పుడెందుకు రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని దగ్గరకెళ్లలేదు. ఎన్నికల ముందు జనసేన పార్టీ సీట్లు కూడా చంద్రబాబే ఇచ్చారు. కెఏ పాల్ అమాయకుడు కాబట్టి ఐలపురం హోటల్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. పవన్ తెలివైన వారు కాబట్టి టీడీపీతో అమెరికాలో సెటిల్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ప్రచారం చేయలేదని చంద్రబాబే చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పవన్ దాని కోసం ఎందుకు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌ను వ్యతిరేకించడమే పవనిజంగా ఉంది’అని నాని ధ్వజమెత్తారు.

ఇక రోజూ ధర్మ సూక్తులు చెప్పే చంద్రబాబు ఢిల్లీలో ఒక్క రోజు దీక్షకు రూ.10 కోట్లు ఖర్చు చేయడాన్ని నాని మరోసారి గుర్తు చేశారు. జీవో 215 జారీ చేసి మరీ  రూ.కోటి 25 లక్షలు రైళ్ల కోసం, మిగిలిన డబ్బులు వారి దుబారా కోసం ఖర్చు చేశారన్నారు. ‘రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నిర్లజ్జగా ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు. టీటీడీ నిధులను కూడా దీక్షల కోసం ఖర్చు చేశారు. సొమ్ము ప్రజలది... సోకు టీడీపీది అన్నట్టుగా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వంలో భాగస్వాములుగా 4 ఏళ్ళు కొనసాగి చివర్లో డ్రామా వేశారు. మళ్ళీ ఇప్పుడు మోదీతో పెట్టుకుని తప్పు చేస్తున్నారు. చంద్రబాబు నిత్యం చేసేవి తప్పులే.(ఇక్కడ చదవండి: ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?)

ఇప్పుడు తండ్రి, కొడుకులు అమిత్ షా కి సాగిలా పడి లవ్ లెటర్లు రాస్తున్నారు. ఇంత నీచమయిన రాజకీయం ఎవ్వరు చెయ్యరు. బంగారు బాతు లాంటి రాజధాని నిర్మాణం చేసారంటున్నారు.ఇంకోవైపు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ టీ కూడా దొరకదని అన్నట్టు పత్రికల్లో వచ్చింది. మరి చంద్రబాబు కట్టిన బంగారు బాతు ఎక్కడ..? చంద్రబాబు సుప్రీమ్ కోర్టు కి భవనాలన్ని పూర్తి చేస్తామని అఫిడవిట్ ఇచ్చారు. అందుకే హైకోర్టు విభజించారు. మరి ఎందుకు చంద్రబాబు కోర్టు భవనాలు కట్టలేదు..?. రాజధాని లో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు ఆయన అనుచరులు లక్ష కోట్లు దోచుకున్నారు.తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకి 12 వేలు పెట్టి దోచుకున్నారు. రైతుల దగ్గర భయపెట్టి భూములు తీసుకుని అనుచరుల కు అప్పగించారు’ అని పేర్ని నాని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top