బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతేనా?

Perni Nani Slams Chandrababu Naidu Over False Allegations - Sakshi

సాక్షి, తాడేపల్లి : లాక్‌డౌన్‌కు రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. కరోనా కట్టడికి ప్రజలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడిలో ఏపీ ముందుందన్నారు. ఇలాంటి కష్ట సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ఉంటూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల క్వారంటైన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

చంద్రబాబుకు మానవత్వం లేదని.. మానవీయ కోణం అసలే లేదని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ కేసులు దాస్తుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే పరీక్షలు చేయిస్తామని అన్నారు. వైద్యులు, పోలీసులు, వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు సైనికుల్లా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధకరమని అన్నారు. మండల స్థాయి విలేకర్లకు ఉన్న సామాజిక బాధ్యత చంద్రబాబు లేదని ఎద్దేవా చేశారు. బాబు మనస్తత్వం అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉందన్నారు.

దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకు అలవాటేనని మంత్రి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను రాష్ట్రప్రభుత్వం పంచుతోందని ఆరోపిస్తున్న చంద్రబాబు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతేనా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు జన్‌ధన్‌ ఖాతాల్లో పడతాయని కూడా చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు. తమ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పేదలకు నేరుగా రూ. 1000 అందజేసిందని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బులయితే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top