బాబుతో లాలూచీ.. జగన్‌తో పేచీ!

Perni Nani Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

ఇదేనా పవనిజం? ∙వైఎస్‌ జగన్‌ను విమర్శించడమే రాజకీయమా? 

దొంగ దీక్షకు చంద్రబాబు రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం 

ఇవేవీ ఆయనకు కనిపించడం లేదా?

చంద్రబాబు, పవన్‌ వైఖరిపై మంత్రి పేర్ని నాని మండిపాటు 

సాక్షి, అమరావతి: చంద్రబాబుతో లాలూచీ పడటం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పేచీ పెట్టుకోవడమే పవనిజమా అని పవన్‌కళ్యాణ్‌పై రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా విమర్శించడమే ఆయనకు తెలిసిన రాజకీయమన్నారు. చంద్రబాబు రాసిచ్చిన పలుకులే ఆయన నోటి వెంట వస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ను వ్యతిరేకించడమే పవన్‌కళ్యాణ్‌ సిద్ధాంతమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపకుండా ప్రతిపక్షాన్ని తిట్టారని, ఇప్పుడేమో ప్రతిపక్షాన్ని ఒక్క మాట కూడా అనకుండా, అధికార పార్టీని విమర్శిస్తున్నారని తెలిపారు. జగన్‌పై కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరిని ప్రశ్నించలేకపోయారని పవన్‌ విమర్శించడాన్ని ఆక్షేపించారు. మరి కుటుంబపరమైన కేసులు తప్ప ఏ కేసుల్లేని పవన్‌ ఎవరిని ప్రశ్నించారని, రాష్ట్రానికి ఏం సాధించారనినిలదీశారు.  

జగన్‌ సంక్షేమం కన్పించడం లేదా? 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన కొద్దికాలంలోనే చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను పవన్‌కళ్యాణ్‌ గుర్తించకపోవడం దారుణమన్నారు. ఉద్దానం పేరుతో చంద్రబాబుతో కలిసి డ్రామాలాడిన ఆయన.. జగన్‌ నేతృత్వంలో కిడ్నీ పేషెంట్ల కోసం అక్కడ ఆసుపత్రులు ఏర్పాటుచేస్తే ఎందుకు అభినందించడంలేదన్నారు. ఇకనైనా లాలూచీ రాజకీయాలు మానుకోవాలని పవన్‌కు పేర్ని నాని హితవు పలికారు. మరోవైపు.. ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బాబు రాజకీయ జీవితం మొత్తం పచ్చి మోసమేనన్నారు.

2014లో మోదీ కాళ్లు పట్టుకుని, ఆయన బొమ్మ పెట్టుకుని ఓట్లు పొందిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో తిరగబడి అభాసుపాలయ్యారని.. తిరిగి ఇప్పుడు తప్పయిపోయిందని, ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి తప్పుచేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి ఎద్దేవా చేశారు. తన మనుషులను బీజేపీలో చేర్పించి చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. సుజనాచౌదరి బీజేపీలో మీ కోవర్టు కాదా అని ప్రశ్నిం చారు. తాను బంగారు బాతు వంటి రాజధానిని నిరి్మస్తే, జగన్‌ అడ్డుకుంటున్నారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. హైకోర్టు జడ్జి మాత్రం రాజధాని ఎక్కడని ప్రశ్నిస్తున్నారని నాని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top