సంకల్ప‘బలం’

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

జగనన్నతో కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో..

ఆయనను కలిసేందుకు ఎండలో గంటల తరబడి నిరీక్షణ

అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైఎస్‌ జగన్‌

12వ రోజు 8.1 కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప పాదయాత్ర

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు కోనసీమలో మంచి స్పందన లభిస్తోంది. గ్రామ గ్రామాన ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఆయనతో మాట్లాడేందుకు, కష్టాలు, సమస్యలు చెప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సమస్యలు చెప్పుకుంటూ కొందరు సేదతీరుతుండగా, మరికొందరు సెల్ఫీలు దిగి సంబరపడుతున్నారు. జగన్‌ను చూడాలని మిద్దెలు, మేడలు ఎక్కుతున్నారు. పంటకాలువ ఆవలి వైపున నిరీక్షిస్తున్న వారికి జననేత అభివాదం చేయగానే ప్రత్యభివాదం చేస్తూ అక్కచెల్లెమ్మలు తమ ఆప్యాయతను పంచుతున్నారు. అందరి సమస్యలు వింటూ, వినతులు స్వీకరిస్తూ వారికి స్పష్టమైన హామీలు ఇస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. 

12వ రోజు యాత్ర సాగిందిలా...
జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర 12వ రోజు ఆదివారం రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 8.1 కిలోమీటర్ల మేర సాగింది. ఉదయం రాజోలు నియోజకవర్గం ములికిపల్లి వద్ద ప్రారంభమైన పాదయాత్ర కడలి, వేగివారిపాలెం, పి.గన్నవరం నియోజకవర్గంలోని గెద్దాడ, మొగలికుదురు, జగ్గన్నపేట, రాజోలు నియోజకవర్గంలోని తాటిపాక సెంటర్‌ మీదుగా సాగింది. తాటిపాకలో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత 3.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర నగరం గ్రామం వరకు కొనసాగింది. ప్రతి గ్రామంలో జననేతకు అక్కచెల్లెమ్మలు హారతులిచ్చి స్వాగతం పలికారు. కడలి గ్రామంలో కొబ్బరి బొండాలపై వైఎస్సార్‌సీపీ జెండా మూడు రంగులు ముద్రించి జగన్‌కు వినూత్నంగా స్వాగతం పలికారు. విజయీభవ అంటూ అవ్వాతాతలు దీవించారు.  పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులకు వైఎస్‌ జగన్‌తో అక్షరభ్యాసం చేయించుకుని మురిసిపోయారు. వైఎస్‌ కుటుంబంపై ఉన్న అభిమానంతో తమ బిడ్డకు జగన్‌పాల్‌ అని పేరు పెట్టుకున్న సుమశ్రీ జగన్‌తో అక్షరాలు దిద్దించుకుని ఆనందం వ్యక్తం చేసింది. కడలి గ్రామానికి చెందిన వనిత, ఆనందరాజు దంపతులు తమ రాజశేఖర్‌ అని పేరు పెట్టించుకున్నారు.

పాదయాత్రలో వైఎస్సార్‌ సీపీ నేతలు
పాదయాత్రలో వైఎస్సార్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, అనంత ఉదయ్‌భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, రాష్ట్ర కాపునాడు యూత్‌ అధ్యక్షుడు గంధం గోపాల్, రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, లీగల్‌ సెల్‌ కార్యదర్శి మంగెన సింహాద్రి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంపన బుగ్గిరాజు, బీసీ విభాగం రాష్ట్ర సభ్యుడు బొమ్మిడి వెంకటేష్, అమలాపురం పార్లమెంటరీ యువజన విభాగం అధ్యక్షుడు కసిరెడ్డి ఆంజనేయులు, కార్యదర్శి కోరం సూర్యభాస్కర్, యువజన విభాగం నేతలు కంచర్ల శేఖర్, తాటి శివ, జక్కంపూడి వాసు, గుర్రం గౌతమ్, పోలుకిరణ్‌మోహన్‌రెడ్డి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ రాజోలు నేతలు కెఎస్‌ఎన్‌ రాజు, బండారు కాశీ తదితరులు పాల్గొన్నారు.

వెల్లువలా ప్రజా సమస్యలు
పాదయాత్రికుడికి అడుగడుగునా సమస్యలు, ఫిర్యాదులు, వినతులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండిపెడుతున్నామని, లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నా ఇవ్వడంలేదని భోజన పథకం నిర్వాహకురాలు మలికిపల్లిలో వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. కోనసీమ రైలు ఆలైన్‌మెంట్‌ పలుమార్లు మార్చి తమ ఇళ్లపై నుంచి వేస్తామంటున్నారని పలు గ్రామాల బాధితులు వాపోయారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా నెలకు రూ. 3వేలు జీతమే ఇస్తున్నారని పంచాయతీ కాంట్రాక్టు సిబ్బంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న సీఆర్‌పీలు తమబాధలు చెప్పుకున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో ఉదాసీనత కనబరుస్తున్నారని, దీనికి పరిష్కారం చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడమేనంటూ దళితసంఘాలు వినతిపత్రం ఇచ్చాయి. చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, కొబ్బరి ఒలుపు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కొబ్బరి ఒలుపు కార్మికుల వద్దకు వెళ్లిన వైఎస్‌ జగన్‌ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే జన్మభూమి కమిటీకి చెప్పిరండంటున్నారని ములికిపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు పితాని ఏసుబాబు వాపోయారు.

పదేళ్ల కిత్రం వరికంకు తగిలి కన్ను పోయిందని, అయినా పింఛను ఇవ్వడంలేదని అడపా వెంకటరత్నం వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకుంది. ప్రమాదంలో దెబ్బతిన్న కాలికి శస్త్రచికిత్స అవసరమువుతుందని డాక్టర్లు చెబుతున్నారని, పేదవాడినైన తనను ఆదుకోవాలని కాట్రేనిపాడుకు చెందిన పాల ప్రసాద్‌వర్మ విన్నవించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఆదుకోవాలంటూ ఏగువారిపాలెం గ్రామానికి చెందిన చుట్టుకుళ్ల కాశీవిశ్వనాథం విన్నవించారు. గుండె శస్త్ర చికిత్స వైఎస్సార్‌ హయాంలో హైదరాబాద్‌ నిమ్స్‌లో ఉచితంగా చేయించుకున్నానని, ప్రస్తుతం గుండెలో చిల్లు ఉందని, వైద్యానికి సహాయం చేయాలని అంతర్వేదిపాలేనికి చెందిన పెట్టా సత్యకుమారి కోరింది. గ్యాస్‌ లీకవుతున్నా పట్టించుకోవడంలేదని, అనుక్షణం భయంతో బతుకుతున్నామని నగరం గ్రామానికి చెందిన కుడుపూడి అరుణ
కుమారి వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసింది. 2014 నగరంలో జరిగిన బ్లో అవుట్‌లోని బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన 18 హామీలు పూర్తిగా అమలు చేయలేదని బాధితులు ఫిర్యాదు చేశారు. ఫించన్, రేషన్‌కార్డులు ఇవ్వడంలేదని, వేతనాలు పెంచాలని ఆశావర్కర్లు, సిఫార్సుతెస్తేనే ఉద్యోగం ఇస్తామంటున్నారని. ఇళ్లు ఇప్పించాలని... ఇలా దారిపొడువునా వందల సంఖ్యలో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top