అడుగులో అడుగేస్తూ.. కేరింతలు కొడుతూ..

People Support To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

జిల్లాలోకి అడుగిడిన ప్రజా సంకల్ప యాత్ర

జన సంద్రమైన రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి

పలుమార్లు ఊగిన భారీ బ్రిడ్జి

ప్రజల నడకను ఆపుతూ కొనసాగించిన పోలీసులు

కొద్దిసేపు ఆందోళనకు  గురైన మహిళలు, పెద్దలు

ధైర్యం చెప్పిన సహచరులు, నేతలు

కేరింతలు, జగన్‌  నామస్మరణతో మార్మోగిన బ్రిడ్జి

ప్రసంగంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన జనవాహిని

గోదావరికి ముందుగానే వరద వచ్చిందా.. అన్న చందంగా కొవ్వూరు–రాజమహేంద్రవరం మధ్య అఖండ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైల్‌ బ్రిడ్జిపై జనం పోటెత్తారు. గోదావరి వరదనుతలపించేలా బ్రిడ్జిపై జన ప్రవాహం కదిలింది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకు 4.1 కిలోమీటర్లపొడవున్న బ్రిడ్జిపై ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. భారీ సంఖ్యలో పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు బ్రిడ్జిపై వైఎస్‌ జగన్‌తో అడుగు కలపడంతో బ్రిడ్జి ఊగిపోయింది. బ్రిడ్జి ఊగుతున్నా.. లెక్క చేయని యువత కేరింతలు కొడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినామస్మరణతో బ్రిడ్జిపై ఉత్సాహంగాజన నేత వెంట కదిలింది.

సాక్షి,తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం సాయంత్రం జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉదయం గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు తన విడిది ప్రాంతమైన టీటీడీ కల్యాణ మండపం నుంచి బయలుదేరారు. అప్పటి వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం నిరీక్షించిన యువత, మహిళలు ఆయన్ను చూడగానే కేరింతలు కొట్టారు. రోడ్డు కం రైల్‌ బ్రిడ్జి నుంచి రాజమహేంద్రవరం వైపునకు పాదయాత్ర కొనసాగింది.

బ్రిడ్జి ఊగింది.. యువత పులకించింది..
కొవ్వూరు వైపు నుంచి పాదయాత్ర బ్రిడ్జిపైకి కొద్దిదూరం రాగానే బ్రిడ్జి ఊగింది. మహిళలు, పెద్దలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ప్రజలు మరింతగా బ్రిడ్జిపైకి రాకుండా కొద్దిసేపు బ్రిడ్జి ప్రారంభంలో నిలువరించి వదిలారు. మధ్య మధ్యలో బ్రిడ్జి ఊగుతుండడంతో పోలీసులు నడిచే వారిని బ్రిడ్జిపై ఎక్కడికక్కడ నిలువరించారు. పెద్దలు, మహిళలు ఎక్కడికక్కడ నిలిచినా.. యువత నడక ఆపకుండా కొనసాగించింది. మహిళలు, పిల్లలు ఆందోళన చెందుతుండగా యాత్ర వెనుక జన సమూహంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధైర్యం చెప్పారు. బ్రిడ్జిపై రైళ్లు పోతున్నా ఊగుతుంటుందని వివరించారు. వైబ్రేటెడ్‌ బ్రిడ్జి గురించి తెలిసిన యువత ఎక్కడికక్కడ తోటివారికి వివరిస్తూ ముందుకు సాగారు. 

వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు, పోలీసుల వాహనాలు ఊగాయి. ఆ దృశ్యాలను యువకులు తమ ఫోన్లలో బందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టారు. కొంత మంది యువకులు బ్రిడ్జి జాయింట్ల వద్ద ఊగుతున్న వైనాన్ని ఫోన్లలో బంధించారు. ప్రారంభంలో ఒకటి రెండుసార్లు ఆందోళన చెందిన ప్రజలు తర్వాత కూడా పలుమార్లు బ్రిడ్జి ఊగినా లెక్కచేయకపోగా మరింత ఉత్సాహంతో నడక సాగించారు. ‘జగన్‌ దెబ్బ.. బ్రిడ్జి అబ్బ’.. ‘బ్రిడ్జి ఊగింది.. బాబు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి..’ ‘కాబోయి సీఎం జగన్‌’.. అని నినాదాలు చేస్తూ యువత కేరింతలు కొట్టింది. భారీ సంఖ్యలో బ్రిడ్జిపైకి జనం రావడంతో కిక్కిరిసింది. నడకలో ఒకరి కాలు ఒకరికి తాకుకునేలా పాదయాత్ర సాగింది. ఫలితంగా బ్రిడ్జిపై భారీ సంఖ్యలో తెగిపోయిన చెప్పులు దర్శనమిచ్చాయి.  బ్రిడ్జిపై గంటా 45 నిమిషాల పాటు పాదయాత్ర సాగింది.

జగన్‌ ప్రసంగంతో కేరింతలు కొట్టిన యువత
కోటిపల్లి బస్‌స్టాండ్‌ ప్రాంతంలోని పాల్‌చౌక్‌ వద్ద బహిరంగ సభకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి 5 గంటలకు తన ప్రసంగం ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధులు ప్రసంగించిన ప్రాంతంలో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ 65 నిమిషాల పాటు మాట్లాడారు. పోలవరం, అమరావతి నిర్మాణాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, జిల్లాలో రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గాల్లో స్థానిక నేతలు సాగిస్తున్న దోపిడీని ఎండగట్టిన ప్రతిసారి యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు తీరును జగన్‌ ఎండగట్టారు.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోసం చేసేందుకు కిలో బంగారం, బోనస్‌గా బెంజికారు కూడా ఇస్తామంటారని జగన్‌ చెప్పిన సమయంలో నమ్మబోమంటూ ప్రజలు చేతులూపారు. అంతటితో ఆగకుండా ఓ మనిషిని పంపి మూడు వేల రూపాయలు చేతిలో పెడతారంటూ జగన్‌ చెప్పిన సమయంలో (కొద్దిసేపు ఆగారు) యువత ఈలలు వేస్తూ సభ ప్రాంగణాన్ని హోరెత్తించింది. అది మన జేబుల్లో నుంచి దోచిన డబ్బే... మూడు వేలు కాదు ఐదు వేల రూపాయలు కావాలని గుంజండని జగన్‌ చెప్పడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండని చెప్పడంతో అశేషజనవాహిని చేతులు పైకి ఎత్తి తమ ఆమోదం తెలిపింది.

అబద్ధాలు, మోసపూరిత హామీలతో నడిచే రాజకీయ వ్యవస్థను మన మందరం మారుద్దామంటూ, అందుకు మీ అందరి మద్దతు కావాలని చెబుతూ, అశేష జనవాహినికి అభివాదం చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం పాదయాత్ర ఆల్‌కట్‌తోట ప్రాంతంలో సాగింది. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని 20, 19, 18, 17 డివిజన్ల నుంచి పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. ఐఎల్‌టీడీ జంక్షన్‌ సమీపంలోని గ్లోరిడిన్‌ చర్చి ప్రాంతంలోని రాత్రి బస ప్రదేశానికి చేరుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top