ఆబాలగోపాలం మురిసే..

 People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

ఆబాలగోపాలం మురిసింది.పల్లెసీమల్లో ఉత్సాహం ఉప్పొంగింది. వైఎస్సార్‌ సీపీ అధినేతవై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఐదో రోజు ‘గోపాల’పురం నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. అడుగడుగునా జననేత ప్రజలతోమమేకమవుతూ ముందుకు సాగారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల కష్టాలు తెలుసుకుని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరి బంధువునని నిరూపించారు.   

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి , ఏలూరు:  వైఎస్‌ జగన్‌.. ఈ పేరు వింటేనే జనంలో నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. ఆయన పల్లెకు వస్తున్నారని తెలియగానే జనం పనులు పక్కనబెట్టి రోడ్లపైకి వస్తున్నారు. మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తనయుడిని కళ్లారా చూడాలని, ఆయనతో మాట్లాడాలని తెగ ఆరాటపడుతున్నారు.  తమ భవిష్యత్తుకు బాటలు వేసే నేతను కలిసేందుకు, గోడు చెప్పుకునేందుకు పోటీపడుతున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన  ప్రజాసంకల్ప పాదయాత్రకు గ్రామాల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. అడుగడుగునా.. జననేతకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రోడ్లపైకి చేరి తమ అభిమాన నేత కోసం నిరీక్షిస్తున్నారు. ఆయనను చూడగానే చేతులూపుతూ.. ఈలలు వేస్తూ.. కేరింతలు కొడుతూ.. నీవెంటే మేముంటామని సంఘీభావం తెలుపుతున్నారు. చిన్నారులు, యువకులైతే జగనన్నతో సెల్ఫీలు, కరచాలనం కోసం పోటీపడుతున్నారు. ఆయనతో కలిసి కొద్దిసేపు నడిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.   

యాత్ర సాగిందిలా..
దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుంచి గురువారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఉదయం 8.35 గంటలకు ప్రారంభమైన  యాత్ర రాజాపంగిడిగూడెం మీదుగా కొనసాగింది. రోడ్ల వెంబడి ప్రజలు బారులుతీరి జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేతపై పూలవర్షం కురిపించారు. డప్పులు, తీన్‌మార్‌ వాయిద్యాల నడుమ యువత నృత్యాలు చేస్తూ జగనన్నకు ఆహ్వానం పలికారు. బైక్‌ ర్యాలీలతో హోరెత్తించారు.  కాబోయే సీఎం జగన్‌ అన్న అంటూ నినాదాలు చేశారు.  మహిళలు జగన్‌ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. తమ కష్టాలు చెప్పుకుని జగన్‌ నుంచి భరోసా పొందారు.

అడుగడుగునా వినతుల వెల్లువ
పాదయాత్రలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలు సావధానంగా విన్నారు. తన వద్దకు వచ్చిన ప్రతిఒక్కరికీ భరోసా ఇచ్చారు. రాజాపండిగిగూడెం పరిసరప్రాంతాల్లో చాలామంది తమ ఆరోగ్య సమస్యలను జగన్‌కు విన్నవించారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ ప్రాంత రైతులు కోరారు. అరకొర జీతాలతో అవస్థలు పడుతున్నామని ఆశావర్కర్లు గోడు వెళ్లబోసుకున్నారు. రామసింగవరం కొత్తగూడెం గ్రామాల్లో 1800 ఎకరాల్లోని మెట్ట భూములను మూడు తరాలుగా సాగుచేసుకుంటున్నామని, ఇప్పుడు ఆ భూములను అటవీశాఖకు చెందినవిగా చూపి కొందరు లాక్కోవాలనిచూస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు జననేతకు విన్నవించారు.

తమను రెగ్యులర్‌ చేయాలని 108 కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌ను కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నామనే కారణంగా పంగిడిగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు 20 రోజుల క్రితం తన భర్తను అన్యాయంగా చితక్కొట్టారని  ఈపూరు భవాని పంగిడిగూడెం వద్ద వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. ఇలా చాలామంది టీడీపీ పాలనలో పడుతున్న బాధలు, కష్టాలను, టీడీపీ నేతల అరాచకాలను  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో తామెవ్వరం ఆనందంగా లేమనీ, మన ప్రభుత్వం వచ్చాక మీరైనా మా కష్టాలన్నీ తీర్చాలని వేడుకున్నారు.

తరలివచ్చిన పార్టీశ్రేణులు
పాదయాత్రకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ జిల్లా పరిశీలకుడు, ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు,  ఎమ్మెల్సీ ఆళ్లనాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషన్‌రాజు, గోపాలపురం కన్వీనర్‌ తలారి వెంకట్రావు దెందులూరు కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, పోలవరం కన్వీనర్‌ తెల్లం బాలరాజు, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌ వంకా రవీంద్ర,  మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళీరామకృష్ణ, పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర నాయకులు రాజీవ్‌కృష్ణ, కమ్మ శివరామకృష్ణ, ఆనందప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, రెండు జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.జగన్‌తో కొద్దిసేపు నడిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top