జై జగన్‌.. జై కిసాన్‌..

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

ప్రజాదీవెనే బలంగా..జన సంక్షేమమే ధ్యేయంగా..మండుటెండలోనూ ఉక్కు సంకల్పంతో ముందుకు కదులుతున్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర జిల్లాలో మూడోరోజుమంగళవారం ఉత్సాహంగా సాగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారిసమస్యలు వింటూ.. జననేత వడివడిగా అడుగులేశారు. సాయంత్రందెందులూరులో రైతులతో ఆత్మీయ
సమ్మేళనం నిర్వహించారు.సేద్యానికి సాయం ప్రకటించారు.కర్షకులకు భరోసా ఇచ్చారు. రైతుసంక్షేమానికి ‘సంకల్ప’ం చెప్పారు.జై జగన్‌.. జై కిసాన్‌.. అనే సరికొత్త నినాదానికి శ్రీకారం చుట్టారు. 

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు : ప్రజా సంక్షేమమే పరమావధిగా వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజామోదంతో సాగిపోతోంది.  మంగళవారం దెందులూరు నియోజకవర్గంలో యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. అడుగడుగునా ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ ఇలాకా అయిన దెందులూరు నియోజకవర్గంలో అడుగడుగునా ప్రజలు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి హారతులు పట్టారు. జై జగన్‌ అంటూ నినదించారు. జగన్‌ పాదయాత్రగా  గ్రామాల నుంచీ వెళ్తుంటే.. ఇళ్లలో నుంచి ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువత, బాలికలతోపాటు వృద్ధులు జగన్‌ను చూసేందుకు ఆయనతో మాట్లాడేందుకు ఉవ్విళ్లూరారు. యువకులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు.  రోడ్లకు ఇరువైపులా బారులు తీరి జననేతకు చేతులూపుతూ సంఘీభావం తెలిపారు. జగనన్న రాకకోసం మండుటెండలోనూ గంటల తరబడి వేచిచూశారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ముందుకు వచ్చి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వల్ల ఇబ్బందులు పడుతున్నామని జననేత వద్ద ఏకరువు పెట్టారు. 

యాత్ర సాగిందిలా..
ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం ఉదయం 8.40 గంటలకు పాలగూడెం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కొమడవోలు, కొవ్వలి గ్రామాల మీదుగా ముందుకు కదిలారు. దెందులూరు శివారు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.  రైతును రాజును చేసేందుకు దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి శ్రమిస్తే.. ప్రస్తుత టీడీపీ హయాంలో రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ రైతులు వ్యవసాయం దండగ అనే దారుణ స్థితికి రావటంపై వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన చెందారు. తన తండ్రి హయాంలో రైతుల సంక్షేమానికి ఏవిధంగా ప్రాధాన్యం ఇచ్చారో అదే రీతిలో తానూ రైతన్నలు తలెత్తుకునేలా చేస్తానని భరోసా కల్పించారు. ఐదు ప్రత్యేక పథకాల ద్వారా రైతుల కళ్లలో ఆనందాన్ని నింపుతానని హామీ ఇచ్చారు. జై జగన్‌.. జై కిసాన్‌.. అనే సరికొత్త నినాదానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తే.. తాను మాత్రం ఎంతమంది ఇళ్లలో తన ఫొటో పెట్టుకుంటారు, ఎంత మంది గుండెల్లో తనను పెట్టుకుంటారనే ఆలోచనతో పనిచేస్తానని భరోసా ఇచ్చారు.

అడుగడుగునా జనహారతులు
యాత్రలో దారి పొడవునా జన హృదయ నేత   వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు హారతులు ఇచ్చారు. ఆయనను తమ సొంత సోదరుడిలా భావించి ఆశీర్వదించారు. పాలగూడెం గ్రామం నుంచి మొదలు పెడితే కొమడవోలు, కొవ్వలి, దెందులూరు గ్రామాల వరకూ యువత మోటారు సైకిల్‌ ర్యాలీలతో హోరెత్తించారు. వృద్ధులు, మహిళలు, యువతులు తమ అభిమాన నేతను చూసిన ఆనందంలో నృత్యాలు చేశారు. భవిష్యత్తు నేత జగనేనని.. ఆయన వల్లే తమ కష్టాలు తీరతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో పార్టీ శ్రేణులు
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంట పాదయాత్రలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనా«థ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్లనాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్, ఏలూరు కన్వీనర్‌ మధ్యాహ్నపు ఈశ్వరి, దెందులూరు కన్వీనర్‌ కొఠారు అబ్బాయ చౌదరి, తాడేపల్లిగూడెం కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ,  పోలవరం కన్వీనర్‌ తెల్లం బాలరాజు, తణుకు కన్వీనర్‌  కారుమూరి నాగేశ్వరరావు, చింతలపూడి కన్వీనర్‌ వీఆర్‌ ఎలీజా, ఉంగుటూరు కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళీ రామకృష్ణ, పాతపాటి సర్రాజు, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి,  ఇతర అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. కొద్దిసేపు జననేతతో కలిసి నడిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top