కడుపు కొడుతున్నారన్నా..

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

టీడీపీ దౌర్జన్యాలపై బాధితుల ఆవేదన

పేదలపై కక్ష సాధింపు చర్యలా అంటూ  వైఎస్‌ జగన్‌ విస్మయం

పక్షవాతం వచ్చినా పింఛను ఇవ్వడం లేదని ఏకరువు

ఉపాధి పనుల్లోనూ కక్ష సాధింపు

అండగా ఉంటానని భరోసా ఇచ్చిన జననేత

మానవత్వం లేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపు

సాక్షి, అమరావతిబ్యూరో :  ‘వైఎస్సార్‌ సీపీ అభిమానులమని మమ్మల్ని ఉపాధి పనులకు రానీయడం లేదు. ఊర్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్నా కనికరించడం లేదు’ అని చంటి,  సముద్రవేణి, నిర్మల, గౌరమ్మ అనే మహిళలు వాపోయారు. ‘తన భర్త చనిపోయి రెండేళ్లు అయినా చంద్రన్న బీమా ఇవ్వడం లేదు’ అని బి.కోటమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాలుగేళ్లు కిందట కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లుకు  ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు’ అని వెంకాయమ్మ, శశిరేఖ, కనకరత్నం తమ బాధ చెప్పుకున్నారు. ఇలా రాజకీయ కక్షలతో టీడీపీ ప్రభుత్వం తమను వేధిస్తోందని ... పేదలమని కూడా చూడకుండా తమ కడుపు కొడుతోందని మహిళలు కన్నీరుమున్నీరయ్యారు.  ప్రజాసంకల్ప  యాత్ర చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము పడుతున్న బాధలను ఏకరవుపెట్టారు. పేదలపై ఇంతటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అని వై.ఎస్‌.జగన్‌ విస్తుపోయారు. వారందరికీ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

రాజన్న బిడ్డకు ఆప్యాయంగా స్వాగతం....
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నూజివీడు నియోజవర్గంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన్ని కలుసుకున్నారు. రాజన్న బిడ్డ వచ్చాడంటూ ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారిలో మహిళలు, వృద్ధులు ఎక్కువుగా ఉండటం గమనార్హం. యువత ఉత్సాహంగా జై జై నినాదాలు చేస్తూ పాదయాత్ర ఆసాంతం పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తున్న వై.ఎస్‌.జగన్‌ను కలుసుకున్న పేదలు, మహిళలు తమ బాధలు వెళ్లబోసుకున్నారు.

కాలూ, చెయ్యి పనిచేయకున్నాపింఛను ఇవ్వడం లేదు....
టీడీపీ ప్రభుత్వం రాకముందు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను కట్టుకుంటే నాలుగేళ్లుగా బిల్లులు ఇవ్వడమే లేదని ఈదర గ్రామానికి చెందిన వెంకాయమ్మ, కనకరత్నం జననేత దృష్టికి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క కొత్త ఇల్లు ఇవ్వలేదు...గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వడం లేదా అని వై.ఎస్‌.జగన్‌ ఆశ్చర్యపోయారు. పేదలకు పెట్టాలంటే ఈ ప్రభుత్వానికి చేతలురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి బిల్లులు మంజూరయ్యేలా అధికారులతో మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పనిచేయకున్నా సరే పింఛన్‌ ఇవ్వడం లేదని దొండపాటి రమేష్‌ తన దీనస్థితిని వివరించారు. పేదలను ఆదుకోలేని దుర్మార్గపు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు. రమేష్‌ను ఆదుకుంటామని వై.ఎస్‌.జగన్‌ భరోసా ఇచ్చారు.

వైఎస్సార్‌ సీపీ అభిమానులమని పనులకు రానీయడం లేదు...
తన భర్త పోయి నాలుగేళ్లు అయినా చంద్రన్న బీమా కింద పరిహారం ఇవ్వలేదని ఈదర గ్రామానికి చెందిన కోటమ్మ వాపోయారు. అసలు చంద్రన్న బీమా పేరుతో ప్రభుత్వం డబ్బా కొట్టుకోవడం తప్పా పేదలను ఆదుకున్నది లేకుండా పోయిందని వై.ఎస్‌.జగన్‌ విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానులమని తమను ఉపాధి పనులను కూడా రానివ్వడం లేదని ఈదర గ్రామానికి చెందిన చంటి,  సుమద్రవేణి, కొండూరు నిర్మల, గౌరమ్మ వై.ఎస్‌.జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము వలస పోవాల్సిందేనని తెలిపారు. కూలీలపై కూడా కక్ష సాధింపు చర్యలు ఏమిటని వైఎస్‌ జగన్‌ ఆశ్చర్యపోయారు. మానవత్వం ఏమాత్రం లేని  టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెపాలని  సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజకీయాలతో నిమిత్తం లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

చిన్నారులకు నామకరణం....
ఈదర గ్రామంలో ముగ్గురు దంపతులు  తమ పిల్లలకు పేరు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో వారికి రాజశేఖర్, విజయమ్మ, మైథిలీ అని ఆయన పేర్లు పెట్టారు.

3.90 కి.మీ. పాదయాత్ర
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 7.30 గంటలకు అగిరిపల్లి మండలం శోభనాపురం క్రాస్‌ వద్ద పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి ఈదర, కొత్త ఈదరలలో పాదయాత్ర కొనసాగింది. హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉన్నందున పాదయాత్రను ఒక పూటలో ముగించారు. గురువారం మొత్తం 3.90 కి.మీ. పాదయాత్ర నిర్వహించిన అనంతరం వై.ఎస్‌.జగన్‌ నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు పయమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top