అన్నదాతకు అండగా..

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు పోటెత్తుతున్న ప్రజలు

పెద్ద ఎత్తునతరలివచ్చిన మహిళలు

ఐదో రోజు విప్పగుంటలో ప్రారంభం

సాయంత్రానికితిమ్మపాలెం చేరుకున్న యాత్ర

13.5 కి.మీ. సాగిన పాదయాత్ర

కాలం కన్నెర్రజేసి, కరువు రక్కసి  పంటను మింగేస్తే...వచ్చిన దిగుబడికీ సరైన మద్దతు ధర ఇవ్వక సర్కారు దగా చేస్తే..‘మాఫీ’ మాయలో పడి అప్పుల ఊబిలో కూరుకుపోతే..ఆదుకునే దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న బడుగు రైతుకుఆయన అనునయం కొండంత ఓదార్పు..‘మంచి కాలం ముందుంది.. మన ప్రభుత్వం వస్తుంది..ప్రతి రైతు జీవితం బాగుంటుందంటున్న’ జననేత మాటలతోరైతుల కళ్లలో ఆనందం నిండింది.‘మా బతుకుల్లో వెలుగులు నింపే మా రాజులా వచ్చావయ్యా..’ అంటూ రైతులు సంతోషంగా  వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సడలని సంకల్పంతో జిల్లాలో 5వ రోజు ప్రజాసంకల్ప యాత్ర సాగించారు. రోజురోజుకూ ప్రజలు యాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జగన్‌ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వంచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలను పట్టించుకోవడం లేదని,  అన్ని వర్గాల వారిని మోసగించారని జనం జగన్‌కు విన్నవిస్తున్నారు. జననేత వారితో మమేకమవుతూ అండగా తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఐదో రోజు విప్పగుంట నుంచి ప్రారంభమైన యాత్ర చౌటపాలెం, లింగంగుంట, మాలపాడు గ్రామాల గుండా సాగింది. పై మూడు గ్రామాల్లో జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తిమ్మపాలెం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. భారీగా హాజరైన రైతులు తమ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా చంద్రబాబు రుణమాఫీ హామీ తుంగలో తొక్కి రైతులను వంచించారని పలువురు రైతులు ఆయన దృష్టికి తెచ్చారు.

కంది రైతు ఓబులేసు కంది సాగు చేస్తే గతంలో ఎకరానికి రూ.20 వేలు మిగిలేదని ఇప్పుడు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పంటలు కోల్డ్‌ స్టోరేజీల్లో దాచుకుందామన్నా పెద్ద మొత్తంలో చార్జీలు విధిస్తున్నారని వాపోయారు. వర్షం లేక 90 శాతం పంటలు ఎండిపోయాయని, వెలిగొండ నీరు వస్తే అన్ని రకాలుగా మేలు జరుగుతుందని రైతులు జగన్‌ దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యలు ఆలకించిన జగన్‌ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, రైతుల మంచి కోరే పార్టీ వైఎస్సార్‌ సీపీ అంటూ భరోసా ఇచ్చారు. రైతులకు నవరత్నాల్లో పెద్దపీట వేశామన్నారు. అందరి ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్‌ ఇవ్వడంతో పాటు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. పశువైద్యాన్ని మెరుగుపరుస్తామని, పెండింగ్‌ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఐదో రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 13.5 కి.మీ. మేర నడిచారు.

జననేతకు సమస్యల ఏకరువు
పార్టీ మారానని 15 ఏళ్లుగా వస్తున్న పెన్షన్‌ను అన్యాయంగా తొలగించారని తవ్వా కొండమ్మ ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
మాలపాడు గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, అధికార పార్టీకి సంబంధించిన నాయకులెవ్వరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
లింగంగుంట ఎస్సీ కాలనీకి చెందిన జి.ఏసు పనిచేస్తూ భవనం నుంచి పడటంతో కాలు విరిగింది. ఆపరేషన్‌ చేయించినా కాలు బాగు కాలేదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు వాపోయారు.
చౌటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన చుండి కోటయ్య రెండు కిడ్నీలు పాడైపోయాయి. డయాలసిస్‌ చేయించటానికి డబ్బులు ఖర్చవుతుందని వైఎస్‌ జగన్‌కు విన్నవించారు.
ప్రజాసంకల్పయాత్రలో చౌటపాలెం వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన పొగాకు, జామాయిల్, కంది రైతులు, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
ప్రస్తుతం 4 శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్స్‌ను 8 శాతంకు పెంచాలని కోరుతూ కందుకూరు ముస్లిం మహిళలు వినతిపత్రం అందజేశారు.
అధికార తెలుగుదేశం ప్రభుత్వ అణచివేతకు గురవుతూ పోలీస్‌ కేసులను సైతం ఎదుర్కొంటూ మద్యం షాపునకు వ్యతిరేకంగా పోరాడుతున్న పొన్నలూరు మండలం మాలపాడు గ్రామ మహిళలు, మంగళవారం ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
వ్యవసాయ బోర్లకు సంబంధించి ఇచ్చే ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసి డీడీలు తీసిన తర్వాత ఇవ్వకుండా విద్యుత్‌ శాఖాధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని డి.నరసింహారావు, మల్లిఖార్జునరెడ్డిలు వైఎస్‌ జగన్‌కు విన్నవించారు.
విద్యార్థులు ఈ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
మా ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్యలు అధికంగా ఉన్నాయని రెండు కిడ్నీలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నామని చౌటపాలేనికి చెందిన మాల్యాద్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.

జగన్‌తో కలిసి నడిచిన బాలినేని, వై.వి.సుబ్బారెడ్డి
ఐదో రోజు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, కొండపి సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, పలువురు ముఖ్య నేతలు వెంట నడిచారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వరికూటి అమృతపాణి, సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఐ.వి.రెడ్డి, ఢాకా పిచ్చిరెడ్డి, కె.వి.రమణారెడ్డి, సిరిగిరి గోపాలరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సత్యనారాయణ, లక్ష్మి నారాయణరెడ్డి, డాక్టర్‌ అశోక్‌రెడ్డి, బొట్లా రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top