జనహితుడు

 people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

జనసంద్రం నడుమ జగన్‌ పాదయాత్ర

రాజన్న బిడ్డ వెంట కదం తొక్కిన పల్లెలు

అడుగడుగునా కష్టాలూ కడగండ్లే

కూలీలు మొదలకుని చేతివృత్తుదారుల వరకు ఇదే పరిస్థితి

జననేత భరోసాతో సాంత్వన పొందుతున్న ప్రజలు

ఉత్తర కాలువ పరిశీలించిన జగన్‌

87వ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో 13.2 కి.మీ సాగిన ప్రజాసంకల్ప యాత్ర

నేడు మహిళలతో ముఖాముఖి

జనహితుని వెంట పల్లెలుకదం తొక్కుతున్నాయి. తమ సంక్షేమం కోరి, కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి వచ్చిన జననేత జగన్‌మోహన్‌ రెడ్డికి పల్లె ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
అడుగడుగునా అఖండ స్వాగతాలు పలికి ఆత్మీయ నేతను అక్కున చేర్చుకుంటున్నారు. రైతు కూలీల నుంచి చేతివృత్తిదారుల వరకూ సమస్యలతో సతమతమవుతున్నామన్నా అంటూ అభిమాన నాయకుడి ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధైర్యం వద్దు. అండగా ఉంటానని భరోసా ఇస్తూ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకొనసాగిస్తున్నారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: అశేష జనవాహిని వెంట రాగా జననేత 87వ రోజు ప్రజాసంకల్పయాత్ర  ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, కొండాపురం మండలాల్లో సాగింది. బుధవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 13.2కి.మీ పాదయాత్ర సాగించి మార్గం మధ్యలో ఉత్తర కాలువను, అనంతరం ఉదయగిరికి చెందిన చేతివృత్తిదారులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. వారి సాధక బాధలను అడిగి తెలు సుకున్నారు.

యాత్ర సాగిందిలా..
బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని జగన్‌మోహన్‌ రెడ్డి  ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. ప్రారంభంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు జననేతను కలిసి కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. శనగపంట కోత మహిళా కూలీలు సుబ్బమ్మ, ఊర్మిళ, బుజ్జమ్మ  మరికొందరు జననేతను కలిశారు. రోజంతా కష్టపడితే రూ.150 కూలీ ఇస్తున్నారన్నా. శనగపంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో మాతోపాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి కృష్ణారెడ్డిపాళెం చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు స్వాగతం పలికారు. అక్కడ షేక్‌ మస్తాన్‌ కలసి తనకు రెండు కిడ్నీలు పాడైపోయాయని, వైద్యానికి నెలకు రూ.10వేలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తంచేశాడు. జాహ్నవి ఆర్గానిక్‌ అరటిపండ్లను జననేతకు ఆప్యాయంగా అందించారు. 

గ్రామశివారులోని గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువను జననేత పరిశీలించారు. అక్కడ రైతు రావుల లక్ష్మీనారాయణ జగన్‌తో మాట్లాడుతూ మీరు వస్తుండడంతో ఇప్పుడే కాలువకు నీరు వదిలారన్నా, ప్రతిఏటా నీటి కష్టాలు తప్పడం లేదని వివరించారు. కృష్ణారెడ్డిపాళెం ప్రధాన సెంటర్‌లో మస్తాన్, అంకమ్మ  వేర్వేరుగా జగన్‌ను కలిసి తమ గ్రామంలో ఫ్లోరైడ్‌ సమస్య అధికంగా ఉండడంతో కిడ్నీ వ్యాధి బారిన పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడే టి.అంకయ్య దివ్యాంగురాలైన తన కుమార్తె అంజలిని తీసుకొచ్చి ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగినా పింఛను ఇవ్వడంలేదని విన్నవించారు. అక్కడ నుంచి కుడముల దిన్నెపాడుకు చేరుకున్న జగన్‌కు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. వరమ్మ, గోపాల్‌ దంపతుల కుమారుడు అంకమ్మరావు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని జననేత వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో జగన్‌ చలించిపోయారు.  అక్కడినుంచి తెల్ల పాడు క్రాస్‌రోడ్డు చేరుకున్న జననేతను రమాదేవి కలసి నర్సారెడ్డిపాళెం–తెల్లపాడు మధ్య బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

చిన్న అన్నలూరు క్రాస్‌ వద్ద స్థానిక మహిళలకు జననేత నవరత్నాల గురించి వివరించారు. కల్లుగీత కార్మికుడు వెంకటేశ్వర్లు జగన్‌ను కలసి చెట్లు ఎక్కడం వల్ల కిడ్నీ, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పాడు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 40 ఏళ్లకే గీత కార్మికులకు పింఛను సౌకర్యం అందజేయాలని కోరారు. అనంతరం ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కర్తం ప్రతాప్‌రెడ్డి, అన్వర్‌బాషా కలిసి సమస్యలను విన్నవించారు. అక్కడనుంచి మావినేనిపాళెం చేరుకున్న జగన్‌ను యూటీఎఫ్‌ నాయకులు వి.మాధవ, కె.భీమేశ్వరరావు, సీహెచ్‌వీ రమణతో పాటు మరికొందరు కలిసి సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని వినతిపత్రం అందజేశారు.  అక్కడ నుంచి జంగాలపల్లి చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడే ఉదయగిరి నుంచి వచ్చిన చేతివృత్తిదారులు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యనేతలు హాజరు
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి,  ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి,  నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, కిలివేటి సంజీ వయ్య, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పార్టీ నేతలు పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్,  తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top