రాజన్న రాజ్యస్థాపనే లక్ష్యంగా..

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

అన్నదాతలను నీవే గట్టెంక్కించాలయ్యా

అడుగడుగునా కష్టాల కడగండ్లే

కలిగిరి బహిరంగ సభలో ఉద్వేగంగా ప్రసంగించిన జననేత

హోదా ప్రకటించకుంటే ఏప్రిల్‌ 6న వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీల రాజీనామా

హోదా ప్రకటించేవరకూ పోరాటం ఆగదని స్పష్టీకరణ

ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర

86వ రోజు 13.5కి.మీ సాగిన ప్రజాసంకల్పయాత్ర

అన్నదాత మొదలుకుని ఆశా వర్కర్ల వరకు అందరూ సమస్యలవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి ఒక్కరికీ జననేత సాంత్వన చేకూర్చి మనోధైర్యం నింపుతూ అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ  ప్రజాసంకల్పయాత్ర కొనసాగించారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చేందుకు మేమంతా మీ వెంట నడుస్తామని అన్ని వర్గాల ప్రజలు జననేత  అడుగులో అడుగేస్తున్నారు. పల్లెపల్లెలో అపూర్వ స్వాగ తం పలుకుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర86వ రోజైన మంగళవారం ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో  కొనసాగింది. జననేత 13.5 కి.మీ యాత్ర సాగించారు. కలిగిరి మండల కేంద్రంలో జరిగిన బహిరంగసభ జనసంద్రంగా మారింది. సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన చేశారు. మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 6వరకు జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడతారని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాజీనామా చేస్తారని ప్రకటించారు. దీంతో ప్రజలనుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. 

పాదయాత్ర సాగిందిలా..
మంగళవారం ఉదయం 8గంటలకు కలిగిరి మండలం పెద్దకొండూరు నుంచి జననేత ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. ఈసందర్భంగా అక్కడ పల్లాల పెద్దకొండారెడ్డి అనే రైతు జననేతను కలిసి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టు ద్వారా వింజమూరు గ్రామానికి మంచి నీటి వసతి కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. దుత్తలూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే పొగాకు రైతు జననేతతో మాట్లాడుతూ తమ పరిస్థితి దయనీయంగా ఉందని, గిట్టు బాటు ధరలేదని, కనీసం బ్యారెన్‌ లైసెన్సును తిరిగి అప్పగిస్తే సరైన పరిహారం ఇవ్వడం లేదన్నా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి పెద్దపాడు చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు జననేతను కలిసేందుకు పోటీపడ్డారు. అక్కడ నుంచి వీరారెడ్డిపాళెం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉపాధి హామీ కూలీలకు సక్రమంగా కూలీలు చెల్లించడం లేదని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని  సి.కోటిరెడ్డి జననేత దృష్టికి తీసుకొచ్చారు. దివ్యాంగురాలు కృష్ణవేణి జననేతను కలిసి తాను పింఛన్‌ కోసం 10సార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని తెలిపారు. అనంతరం పోలంపాడు చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు.  అక్కడ రైతు కల్లూరి చంద్రమౌళి జననేతను కలిసి తన గోడును వినిపించారు.

ఇక్కడి బ్యాంకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ జతచేయకపోవడం వల్ల బ్యాంకుల్లోని ఖాతాలన్నింటికి రుణమాఫీ అర్హత రాలేదని 4వేల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎస్సీ కాలనీ వద్ద దివ్యాంగురాలు చెంచమ్మ కలిసి పింఛను ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వి.దర్గాబాబు మాట్లాడుతూ 2016–17 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 32 మినీ డెయిరీలు జిల్లాకు మంజూరయ్యాయని అయితే ఒక్కటి కూడా క్షేత్రస్థాయికి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నా.. అంటూ తెలియజేశారు. ఆవుల నారాయణమ్మ అనే మహిళ కలసి రాజన్న రాజ్యాన్ని నీవే తీసుకురావాలయ్యా అంటూ నిండు మనస్సుతో దీవించింది. కలిగిరి శివారు పెద్దచెరువు అలుగు వద్ద జననేతను వాసుపల్లి మదన్‌మోహన్‌రెడ్డి కలిశారు. అకారణంగా తనను ఫీల్డ్‌ అసిస్టెంట్‌  ఉద్యోగం నుంచి తొలగించారని గోడు వెళ్లబోసుకున్నాడు. ప్రైవేటు హాస్పిటల్స్‌ నిర్వాహకులు పెద్దరెడ్డి జగదీష్, జ్యోతిరెడ్డి జననేతను కలిసి 25 పడకల ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్వతరెడ్డి కొండారెడ్డి, రవి నేతృత్వంలో ఉపాధ్యాయులు పలువురు కలిసి సీపీఎస్‌ రద్దుచేయాలని విన్నవిం చారు. అక్కడ నుంచి కలిగిరి చేరుకున్న జగన్‌కు ప్రజలు నీరాజనం పలికారు. అక్కడ నిర్వహించిన బహిరంగసభలో జగన్‌ ప్రసంగించారు.

ముఖ్యనేతలు హాజరు
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి,  ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి,  నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్, నగరి ఎమ్మెల్యే రోజా, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్పయాత్ర కోఆర్డి నేటర్‌ తలశిల రఘురాం, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,  గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి,  పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పార్టీ నేతలు ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top