జననేతకు జనహారతులు

 people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

జగన్‌మోహన్‌రెడ్డి రాకతో పులకించిన పల్లెలు

మేళ తాళాలు, మంగళవాయిద్యాలతో అడుగడుగునా అపూర్వ స్వాగతాలు

మనుబోలుపాడు, బోడగుడిపాడుల్లో  వైఎస్‌ఆర్‌ విగ్రహాలు, పార్టీ జెండాల ఆవిష్కరణ

బోడగుడిపాడు బహిరంగ సభలో ప్రసంగం

83వ రోజు కావలి నియోజకవర్గంలో కొనసాగిన ప్రజాసంకల్పయాత్ర

జనోత్సాహం ఉప్పొంగింది. పల్లె రాదారులన్నీ బారులు తీరాయి. ఎటుచూసినా జనసంద్రమే.పల్లె ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు.గ్రామాల్లోని మహిళలు మంగళ హారతులిచ్చి అడుగడుగునా అభిమానాన్ని చాటుకున్నారు. అశేషజనవాహిని మధ్య ప్రజాసంకల్పయాత్రలో జననేత అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: అశేష జనవాహిని వెంట రాగా 83వ రోజు శనివారం జననేత ప్రజాసంకల్పయాత్ర కావలి నియోజకవర్గంలో కొనసాగింది. కావలి నేతలు దుండిగం గ్రామంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య జగన్‌మోహన్‌రెడ్డికి సాదర స్వాగతం పలికారు. మొత్తం 15.5కి.మీ యాత్ర కొనసాగింది. మనుబోలుపాడు, బోడగుడిపాడుల్లో దివంగత మహానేత వైఎస్‌ ఆర్‌ విగ్రహావిష్కరణలతో పాటు పార్టీ జెండాలను జననేత ఎగురవేశారు. అనంతరం బోడగుడిపాడులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని జననేత ఎండగట్టారు.

యాత్ర సాగిందిలా..
ఉదయం 8గంటలకు దుండిగం క్రాస్‌ వద్ద ప్రజాసంకల్ప యాత్రను జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. అక్కడి నుంచి దుండిగం గ్రామ చెరువు సెంటర్‌ చేరుకున్న జననేతకు కావలి నియోజవకర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. యాత్ర ముందుభాగాన వివిధ రకాల కళాకారుల బృం దాలు, పార్టీ శ్రేణులు దివంగత వైఎస్‌ఆర్‌ విగ్రహాలతో పాదయాత్రలో నడిచాయి. ఈసందర్భంగా జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడ పాడిరైతు టి.శ్రీనివాసనాయుడు జననేతను కలిసి పశుగ్రాసం లేక పాడి గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం అక్కడే రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షులు వి.వెంకటేశ్వర్లునాయుడు కలిసి రేషన్‌డీలర్లకు కమీషన్‌ కాకుండా గౌరవవేతనం ఇస్తే తమ జీవితాలు మెరుగుపడుతాయని విన్నవించారు. అనంతరం దుండిగం శివారుల్లో గొర్రెల పెంపకందార్లు అభిమాన నేతను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు జననేత వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి మనుబోలుపాడు చేరుకున్న జననేతకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఈసందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన  వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు.

పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అక్కడ దివ్యాంగురాలు కె.బుజ్జమ్మతో జననేత ప్రత్యేకంగా మాట్లాడారు. ‘అన్నా మీరు సీఎం అయి మాకు అండగా ఉండాలి’ అని ఆమె కోరారు. ఈసందర్భంగా గ్రామస్తులు జగన్‌కు  వైఎస్‌ఆర్‌ చిత్రపటాన్ని బహూకరించారు. వృద్ధురాలు వసుపల్లి వనమ్మ తనకు మూడేళ్లుగా పింఛను రావడం లేదని, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. అక్కడే రైతులు కె. శ్రీనివాసరెడ్డి, చేజర్ల మోహన్‌రెడ్డి, చేజర్ల ప్రభాకర్‌రెడ్డి  ఉత్తరకాలువ 15కి.మీ వెడల్పు తక్కువగా ఉండడంతో మనుబోలుపాడు, రంగసముద్రం, దుండిగం గ్రామాలకు నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కె. ప్రవీణ్‌కుమార్‌ జననేతను కలిసి మాదిగ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన జి.గంగయ్య తనకు పేదల ఇళ్లు ఇవ్వకుండా అధికారపార్టీనేతలు ఇబ్బందులు పెడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామశివార్లులో డా క్యుమెంట్‌ రైటర్లు నాగరాజుతో పాటు పలువురు కలిసి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల వల్ల ఉపాధి కోల్పోతున్నామని మీరే న్యాయం చేయాలని కోరారు.

మనుబోలు పాడు శివారుల్లో ముస్లింలు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం  పులి వెందుల ప్రవీణ్‌కుమార్‌ కలిసి తనకు ప్రమాదంలో చేయిపోయిందని పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం అణగారిపాలెం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం ప్రజలు సర్పంచ్‌ నరసింహం నేతృత్వంలో జననేతను కలిసి సోమశిల నీరురాకపోవడంతో తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి బోడిగుడిపాడు జంక్షన్‌ చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడ రజక, శంబన్‌ కులసంఘాల నేతలు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం గ్రామ ప్రధాన సెంటర్‌ చేరుకొని మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని, పార్టీ జెండాలను జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో జననేత ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అక్కడ నుంచి అశేష జనసంద్రం మధ్య బోడగుడిపాడు శివారుకు చేరుకున్నారు.

ముఖ్యనేతలు హాజరు
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థనరెడ్డి, కిలివేటి సంజీవయ్య, అత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ పి. అనిల్‌ కుమార్‌ యాదవ్, పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, ఆదిముళ్ల సురేష్, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్పయాత్ర కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నేతలు పేర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పి.రూప్‌ కుమార్‌ యాదవ్, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top