జననేత వెంటే జనం

people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

జనహోరు నడుమ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర

అడుగడుగునా కడగండ్లతో కూడిన వినతులే

సంగం బస్టాండు సెంటర్‌లో బహిరంగసభ

75 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేసిన పార్టీ జెండా ఆవిష్కరణ

ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతోన్న ప్రజాసంకల్పయాత్ర

14.6 కిమీ సాగిన యాత్ర

నేడు హసనాపురంలో ముస్లింలతో ఆత్మీయ సదస్సు

సాక్షిప్రతినిధి, నెల్లూరు: జననేత వెంట జనసైన్యం అడుగులు వేస్తోంది. జనం..జనం ప్రభంజనమై ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పల్లెల్లో ఆత్మీయ స్వాగతాలు.. మంగళ హారతులు ఓవైపు, పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల ఊబిలో చిక్కుకుని జీవనం సాగిస్తున్న ప్రజలు ఇంకోవైపు, ఎక్కడ చూసినా వినతులే. ఇళ్ల స్థలాలు మొదలుకుని పింఛన్ల వరకు ఏ ఒక్కటి సక్రమంగా అందలేదని నిత్యం కలిసే బాధితులు కోకొల్లలు. అందరినీ ఓదార్చి అండగా నేనున్నానని భరోసా ఇస్తూ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారు. మంగళవారం ఆత్మకూరు నియోజకవర్గం అన్నారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర సంగం చెక్‌పోస్టు సెంటర్‌ సమీపంలో ముగిసింది. మొత్తం 14.6 కి.మీ జననేత పాదయాత్ర కొనసాగించారు. సంగం బస్టాండు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. చెక్‌పోస్టు సెంటర్‌లో 75 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.

యాత్ర సాగిందిలా..
మంగళవారం ఉదయం 8గంటలకు అన్నారెడ్డిపాలెం క్రాస్‌రోడ్డు వద్ద జననేత జగన్‌మోహన్‌ రెడ్డి అశేష జనసమూహం మధ్య పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి సంగం బైపాస్‌ చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మంగళహారతులు ఇచ్చి మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా దువ్వూరు వెంకటమ్మ అనే మహిళ జననేతను కలిసి తన కుమారుడు సుబ్రమణ్యంకు గుండెజబ్బు ఉందని ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేసింది. అక్కడే మర్రిపాడు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌ తన కుమార్తె నిహారిక కాలేయ వ్యాధితో బాధపడుతోందని ఆపరేషనుకు రూ. 30లక్షలు ఖర్చవుతుందని ఆస్పత్రి వారు కొంత భరిస్తామని చెప్పారని, నిరుపేదలైన తమకు స్థోమత లేక ప్రభుత్వానికి అనేక అర్జీలు పెట్టుకున్నా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి సిద్ధిపురం చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడ కొల్లి విజయమ్మ అనే మహిళా రైతు ధాన్యం రైతుల పరిస్థితి బాగాలేదని ఇప్పుడే పుట్టి ధాన్యం ధర రూ.15వేలు ఉందని, రానున్న రోజుల్లో ఇంకా తగ్గితే కనీసం కూలి కూడా గిట్టుబాటు కాదని జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

రెండో తరగతి విద్యార్థిని టి.యశ్వంతి తమ పాఠశాలలో టీచర్లు లేరు సార్‌ అంటూ విన్నవించింది. కోట నీరజ అనే మహిళ జగన్‌ను కలిసి తన భర్త మరణించి పదినెలలు గడుస్తున్నా వితంతు పింఛను మంజూరు చేయాలేదన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సిద్ధిపురం గ్రామంలో వరుసగా వినతులు వెల్లువెత్తాయి. గ్రామానికి చెందిన ఎస్సీలు నూతనంగా నిర్మించిన పోలేరమ్మ దేవస్థానంలోకి ప్రవేశం కల్పించలేదని జననేత దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే జెడ్పీటీసీ సభ్యుడు దేవసాయంను జననేత పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన దేవసాయం జననేత రాక నేపథ్యంలో తన భార్య వరమ్మతో కలిసి అక్కడకు వచ్చారు. అక్కడే మహిళలు సంది సుగుణమ్మ, శాంతమ్మ కలిసి పొదుపు రుణాలు ఇవ్వడంలేదని విన్నవించారు. విజిత అనే మహిళ కలిసి అటవీశాఖ ద్వారా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా స్కూల్‌లో స్వీపర్‌గా చేరాననీ, 11నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేసింది. దళిత కాలనీకి చెందిన మహిళలు ఎన్టీఆర్‌ గృహకల్ప మంజూరు చేయలేదని విన్నవించారు. పి.వకుళ అనే మహిళ మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో ఆరునెలల కిం దట తన ఇల్లు కాలిపోతే ఇంతవరకూ ఒక్కరూపాయి పరిహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తంచేసింది.

అక్కడ నుంచి వెంగారెడ్డిపాలెం క్రాస్‌రోడ్డు చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అక్కడ దండకేశవ మాట్లాడుతూ సోమశిల ముంపు బాధితులైన తమకు ఇంతవరకూ ఉద్యోగాలు కల్పించలేదని విన్నవించారు. అక్కడ నుంచి బయలుదేరిన జగన్‌మోహన్‌ రెడ్డిని ఆత్మకూరుకు చెందిన విద్యార్ధి నేత ముజ్జు నేతృత్వంలో విద్యార్ధులు కలిసి ప్రత్యేక హోదా సమస్యపై విన్నవించారు. పల్లెపాళెం చేరుకున్న జననేతను పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన అనిల్‌కుమార్, గిరిబాబుగౌడ్‌ కలిసి మాజీ స్థానిక ప్రజాప్రతినిధులకు పింఛను సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని జగన్‌ను కోరారు.  అనంతరం సింహపురి స్వర్ణకార కార్మిక పరస్పర సహకార సంఘం సభ్యులు కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఆశావర్కర్లు కలిసి కనీస వేతనం రూ.ఆరువేలు ఇవ్వాలని విన్నవించారు. సంగం వారధి సెంటర్‌ చేరుకున్న జగన్‌కు మహిళలు నీరాజనాలు పలికారు. అక్కడ నుంచి సంగం బస్టాండు సెంటర్‌కు చేరుకున్న జననేత ప్రజలనుద్దేశించి బహిరంగసభలో ప్రసంగించారు. ఆత్మకూరు, జమూరు, కలిగిరి ప్రాంత వాసులు సాగు, తాగునీటి ఇబ్బందులు అధికమయ్యాయని, పెన్నా డెల్టా ఆధునికీకరణ పనులు గత నాలుగేళ్లుగా ముందుకు కదలకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం అక్కడ నుంచి సంగం ప్రధాన రహదారి మీదుగా సంగం చెక్‌పోస్టు సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ 75 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు.

హాజరైన ముఖ్య నేతలు
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి,  నెల్లూరు, తిరుపతి పార్లమెం ట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థనరెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీíపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కావలి ఎమ్మె ల్యే  రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్ప యాత్ర కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగమురళి, నాయకులు       ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top