జన నీరాజనం..

People Support jagan In Praja sankalpa yatra - Sakshi

దిగ్విజయంగా సాగుతోన్న ప్రజాసంకల్ప యాత్ర

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజాసంకల్పయాత్ర పదోరోజు (మొత్తంగా 35వ రోజు) రాప్తాడు మండలం గంగులకుంట శివార్ల నుంచి మొదలైంది. ఉదయం 8.30గంటలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడక మొదలుపెట్టారు.   చిన్నపిల్లలు, మహిళలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.  తమ అభిమాన నేత వస్తున్నారని కందుకూరు వాసులు రోడ్లపై ముగ్గులు వేసి, బంతిపూలు పరిచారు.   కాలేజీలు, పాఠశాలలకు విద్యార్థులు డుమ్మా కొట్టారు. చుట్టపక్కల గ్రామాల నుంచి బంధువులు తరలివచ్చారు. మహిళలు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి పట్టారు.   మహేశ్వరి అనే మహిళ వచ్చి  నాలుగేళ్లుగా ఒక్క పశువును కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జగన్‌ నడుస్తుంటే మిద్దెలపై నుంచి పూలవర్షం కురిపించారు. జంగాలపల్లికి చెందిన జయలక్ష్మి అనే వృద్ధురాలు తమ తోటలో పండిన దానిమ్మను తీసుకొచ్చి జగన్‌కు ఇచ్చారు.

‘నువ్వు సల్లంగా ఉండాలి నాయనా... దేవుడు నీకు మంచే చేస్తాడు’ అంటూ చెమర్చిన కళ్లతో ఆశీర్వదించారు.   కొడిమికాలనీ వాసులు భారీ గజమాలతో జగన్‌ను సత్కరించారు. తర్వాత ఆదర్శ రైతులు వచ్చి  చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను తొలగించి వీధినపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్కేయూ విద్యార్థులు ప్రత్యేకహోదాపై చేపట్టిన చలోఢిల్లీకి మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరారు.     దారిపొడవునా పార్టీ కార్యకర్తలు, యువకులను రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పరిచయం చేశారు. మధ్యాహ్నం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గాన్ని దాటి ధర్మవరం నియోజకవర్గ పరిధిలోకి చేరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జగన్‌కు స్వాగతం పలికారు. చిగిచెర్ల సమీపం వరకూ యాత్ర కొనసాగింది.

పదో రోజు పాదయాత్రలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి, రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, నదీమ్‌ అహ్మద్, యువజన, ట్రేడ్‌యూనియన్, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, ఆదినారాయణరెడ్డి, రాజారాం పార్టీనేతలు చవ్వారాజశేఖరరెడ్డి, గంగుల భానుమతి, మద్దెల చెరువు సుధీర్‌రెడ్డి,  విద్యార్థి విభాగం నేత నరేంద్రరెడ్డి, యూపీ నాగిరెడ్డి, మహిళా విభాగం నేతలు కృష్ణవేణి, శ్రీదేవి, దేవి, షమీమ్, రాప్తాడు, అనంతపురం రూరల్‌ మండల కన్వీనర్లు రామాజంనేయులు, నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు,

ఆత్మీయ స్వాగతం..
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కాలినడకన ధర్మవరం నియోజకవర్గంలో అడుగిడిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను స్థానికులు సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామం వద్ద జగన్‌ను ఆహ్వానించారు. రాప్తాడు మండలం గంగులకుంట నుంచి కందుకూరు మీదుగా ధర్మవరం నియోజకవర్గం చిగిచెర్ల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బసవద్దకు ఉదయం 12 గంటలకు ఆయన చేరుకున్నారు. అనంతరం బెంగళూరు బయలుదేరి వెళ్లారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top