నాలుగేళ్లుగా అన్నీ కష్టాలే

People sharing there problems to the YSRCP Cheaf YS Jagan at padayatra - Sakshi

పాదయాత్రలో ప్రతిపక్షనేత జగన్‌ ఎదుట వాపోయిన జనం 

మీ వల్లే న్యాయం జరుగుతుంది.. మీ వెంటే ఉంటామని జననేతతో స్పష్టీకరణ 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తనని నాకు చంద్రన్న బీమాను ఇవ్వలేదన్నా.. అయినా నేనేమీ భయపడనన్నా.. మీరొచ్చిన తర్వాత మాత్రం వాళ్లకు (టీడీపీ) కూడా బీమా సహా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి భేష్‌ అనిపించుకోవాలన్నా.’
– ఓ మహిళ అభ్యర్థన

‘సార్‌.. 30 ఏళ్ల నాడు కట్టుకున్న మరుగుదొడ్లకు ఇప్పుడు బిల్లులు చేస్తున్నారు సార్‌. మేము మరుగుదొడ్లు కట్టుకుంటామంటే మాత్రం డబ్బులివ్వడం లేదు.. ఆ మధ్య గాలీవానకు మా కొంప కూలిపోతే నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఎందుకని అడిగితే మీరు మా పార్టీ కాదుగా అంటున్నారు.’
– ఓ వృద్ధుని ఆవేదన

‘భాయి సాబ్‌.. నాన్నగారు ఉన్నప్పుడు శ్రీకాళహస్తిలో పేద ముస్లిం సోదరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జన్మభూమి కమిటీల వాళ్లు కుయుక్తులు పన్ని మమ్మల్ని ఇళ్లు కట్టుకోనివ్వకుండా చికాకులు పెడుతున్నారు. మీరే ఆదుకోవాలి సాబ్‌.’
– ముస్లిం మహిళలు

ఒకటా రెండా.. వందలాది ఫిర్యాదులు.. వేలాది మందిలో గూడుకట్టుకున్న ఆవేదన ఎగిసిపడుతోంది.. తమ కష్టాలు వినే నాయకుడొచ్చాడని తెలియగానే వారిలో కొండంత ధైర్యం వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల వారు అనుభవిస్తున్న కష్టాలు చెప్పుకుని జననేత పాదయాత్రలో దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు ఊరట పొందుతున్నారు. జన్మభూమి కమిటీల ఆగడాలకు అంతే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలన ఇక చాలని, మీ వల్లే న్యాయం జరుగుతుందని, మీ వెంటే నడుస్తామని జగన్‌కు చెబుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 66వ రోజు శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సాగించారు. మచ్చుకు పైన పేర్కొన్న  ఫిర్యాదులూ శనివారం నాటి పాదయాత్రలో అందినవే. ఓర్పుగా ఫిర్యాదులు స్వీకరిస్తూ, విన్నపాలు వింటూ ప్రజలతో మమేకం అవుతూ.. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని జగన్‌ భరోసా ఇచ్చారు. పాదయాత్ర సాగిన గ్రామాలన్నింటిలోనూ జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. కొత్తవీరాపురం మొదలు వెంకటాపురం క్రాస్, కుమ్మరమెట్ట,, మోదుగుపాలెం క్రాస్, అగ్రహారం, కోబాక, అంజిమేడు క్రాస్, ఏర్పేడు, మేర్లపాక క్రాస్, మేర్లపాక హరిజన వాడ, చిందేపల్లి వరకు దారి పొడవునా జనంతో మమేకమయ్యారు. తాను ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.

ముస్లింలను ఆదుకున్నది ఆ పెద్దాయనే..
పాదయాత్ర అంజిమేడు క్రాస్‌ దాటిన తర్వాత రేణిగుంట, శ్రీకాళహస్తిల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన ముస్లింలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని జగన్‌కు విన్నవించారు.  ఆ పెద్దాయన (వైఎస్సార్‌) కల్పించిన 4 శాతం రిజర్వేషన్లతో వేలాది మంది ముస్లిం పిల్లలు లబ్ధి పొందారని, మళ్లీ మీరు (జగన్‌) వచ్చి మాకు మేలు చేయాలని ఆకాంక్షించారు. ముస్లింలకు తప్పకుండా మేలు చేసేలా చూస్తానని భరోసా ఇస్తూ త్వరలో మంచిరోజులు వస్తాయని జగన్‌ చెప్పారు. ఏర్పేడు వద్ద వందలాది మంది యువకులు జగన్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. చంద్రబాబు తమకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేయడంతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మాట నమ్మి మోసపోయా మని వాపోయారు. ఈసారి మార్పే ధ్యేయంగా పని చేస్తామని, నమ్మించి నట్టేట ముంచిన వారికి గుణపాఠం చెబుతామని శపథం చేశారు. 

రైతు కష్టం పగోడికి కూడా వద్దు..
మేర్లపాక క్రాస్‌ వద్ద కొందరు రైతులు వరి పంట పనలతో వచ్చి జననేత జగన్‌ను కలిశారు. ఆరుగాలం కష్టపడి పండించినా లాభం మాట అటుంచి కనీసం గిట్టుబాటు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా (రైతుల) కష్టాలు పగవాడికి కూడా రాకూడదని చెప్పారు. ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామానికి చెందిన రైతు ప్రతినిధి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ఎకరానికి రూ.30 వేలు ఖర్చు చేసి పంట సాగుచేస్తే సగటు దిగుబడి 30 బస్తాలు వచ్చిందనుకుంటే 75 కిలోల బస్తాను రూ.1150కి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యాన్ని కనీసం రూ.2200కు అయినా కొనుగోలు చేసినప్పుడే తమకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు. కనీస మద్దతు ధరను పెంచేలా చర్యలు చేపట్టాలని జగన్‌కు సూచించారు. దీనికి జగన్‌ స్పందిస్తూ తనకు రైతుల కష్టాలు తెలుసునని, తప్పకుండా వారికి మేలు చేసేలా చర్యలు చేపట్టడంతో పాటు ముందే కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధరకు వ్యాపారులు కొనకపోతే ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. తమ సమస్యలను వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ప్రణాళి కలో చేర్చాలని పలువురు న్యాయ వాదులు జగన్‌కు విన్నవించారు. న్యాయవాదుల డెత్‌ బెనిఫిట్‌ ఫండ్‌ను రూ.6 లక్షల వరకు పెంచే విషయాన్ని పరిశీలించాలని, జూనియర్‌ న్యాయవాదులకు స్టయిఫండ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల స్టయిఫండ్‌ను రూ.3 వేల వరకు పెంచాలని కోరారు. 

చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్న జననేత
గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. చలి జ్వరంతో బాధ పడుతున్నట్టు ప్రకటించారు. విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించి నప్పటికీ జగన్‌ తోసిపుచ్చారు. ఆదివారం యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాళహస్తి పెళ్లిమండపం కూడలిలో బహిరంగ సభ జరుగుతుందని జగన్‌ స్పష్టం చేసినట్టు వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top