మా బతుకుల్లో తీపి లేదయ్యా..

People Huge Welcome to the YS Jagan At Konaseema - Sakshi

మా కంటే వ్యాపారులకే ఎక్కువ లాభం వస్తోంది.. 

నిత్యం పొగతో రోగాల పాలవుతున్నాం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట పూతరేకుల తయారీదారుల ఆవేదన 

మన ప్రభుత్వం రాగానే తీపి కబురు చెబుతామని జననేత భరోసా 

పాదయాత్రకు కోనసీమలో జనం వెల్లువ 

పూలబాటపై నడిపించిన అభిమానం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికారంలోకి రాగానే పూతరేకులు తయారు చేసే వారికి తీపి కబురు చెబుతామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 189వ రోజు గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం వద్ద రోడ్డు పక్కన పూతరేకులు తయారు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. ‘అవ్వా బాగున్నావా?’ అంటూ మారిశెట్టి మంగ అనే అవ్వను పలకరించారు. పూతరేకుల తయారీకి ఉపయోగిస్తున్న కుండ వద్ద కూర్చొని వివరాలు తెలుసుకున్నారు. అప్పుడే తయారైన ఓ పూత రేకును రుచి చూశారు. అనంతరం వాటి తయారీ దారులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. ‘ఒక్క పూతలో ఒక్కో పూతరేకు చుడతారు.

ఒక్కో రేకును మేము రూపాయి పావలా నుంచి రూపాయిన్నర వరకు అమ్ముతాం. వ్యాపారులు వాటిలో కాస్త జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాపప్పు, నెయ్యి, బెల్లం లేదా చక్కెర కలిపి రేకును చుడతారు. ఏయే పదార్థాలతో రేకును చుట్టారనేదాన్ని బట్టి ఒక్కొక్కటి రూ.8 నుంచి రూ.10 వరకు అమ్ముతారు. మేము తయారు చేస్తున్న పూతరేకులు తియ్యగా ఉంటున్నా మా బతుకుల్లో మాత్రం తియ్యదనం కరువైంది’ అని మారిశెట్టి ప్రశాంతి, మారిశెట్టి మంగ, మాధవరాజులు జగన్‌ ఎదుట వాపోయారు. పొయ్యిల వద్ద నిత్యం కూర్చొని పూతరేకులు తయారు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కూడా వస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం నుంచి తమకు ఏ సాయం అందడం లేదని, మీరు వచ్చాక తమను ఆదుకోవాలని కోరారు. ఆత్రేయపురం, చుట్టుపక్కల గ్రామాలతో కలిపి సుమారు 3 వేల కుటుంబాలు పూతరేకుల తయారీతో జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. కాలిన పూతరేకును చేత్తో తీస్తున్న మంగమ్మ అవ్వను చూసి.. ‘అవ్వా.. ఎలాగంటే అలా తియ్యమాక, చేతులు కాల్తాయి..’ అంటూ జాగ్రత్తలు చెప్పారు. మనందరి ప్రభుత్వం రాగానే మీకందరికీ తీపి కబురు చెబుతామని భరోసా ఇచ్చి ముందుకు సాగారు.
 
పూల బాటతో ఘన స్వాగతం 
కోనసీమ పల్లెల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. గురువారం పేరవరం గ్రామం నుంచి బయలుదేరిన జగన్‌కు వడ్డిపర్రు క్రాస్, వెలిచేరు, పులిదిండి, ఉచ్చిలి, ఆత్రేయపురంలో ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. వెలిచేరులో 200 మీటర్ల పొడవున రోడ్డుపై ఆ ప్రాంతంలోని రక రకాల పూలతో తివాచీ మాదిరిగా పరిచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జననేతను ఆ పూల బాటపై నడిపిస్తూ వెంట అడుగులేశారు. గోదావరి కాలువపై ఓ గట్టు మీద యాత్ర సాగుతుంటే ఆవలి గట్టుపై నుంచి అక్కడి గ్రామాల ప్రజలు చేతులూపుతూ అభివాదం చేస్తూ సందడి చేశారు. యాత్ర సాగుతున్నంత సేపూ దిగువ కాలువలో నవరత్నాల కటౌట్లను అమర్చిన పడవలు కనువిందు చేశాయి. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జగన్‌తో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. అరటి, కొబ్బరి, వరి రైతులు తమ పనులను పక్కన బెట్టి జగన్‌ను చూడటానికి వచ్చారు. దివ్యాంగులు, రైతులు, కల్లుగీత కార్మికులు, సీపీఎస్‌ ఉద్యోగులు, విశ్వకర్మ సంఘం వారు జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను విన్నవించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పెద్దింటి మంజుల, స్థానిక మైనారిటీ నేత షరీఫ్‌.. 50 మంది అనుచరులు, ఆత్రేయపురం ఎంపీపీ(టీడీపీ) సోదరుడు వాకలపూడి సుబ్బారావులు టీడీపీకి రాజీనామా చేసి జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.   

వేతనమడిగితే యాతన.. 
వెట్టి చాకిరీ.. భద్రత కరువు
జగన్‌ ఎదుట యానిమేటర్ల ఆవేదన 

సాక్షి ప్రతినిధి, కాకినాడ:  ‘ఏళ్ల తరబడి చాకిరీ చేయించుకుంటున్నారు. జీతం సక్రమంగా ఇవ్వడం లేదు. పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఉద్యోగ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. గట్టిగా అడిగితే ఉన్న ఉద్యోగం ఊడగొడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఆదుకోవాలన్నా..’ అంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట యానిమేటర్లు గోడు వెళ్లబోసుకున్నారు. ఆత్రేయపురంలో గురువారం వారు జగన్‌కు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సుమారు 25 వేల మంది యానిమేటర్లం పని చేస్తున్నాం. తొలుత రూ.150, అనంతరం రూ.300, తర్వాత రూ.800 కమీషన్‌ పద్ధతిపై పనిచేయించుకున్నారు. 20 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాం. అభయ హస్తం, చంద్రన్న బీమా, మొబైల్‌ బుక్‌ కీపింగ్, ఉన్నతి, సీఐఎఫ్, ఎస్సీ, ఎస్టీ నిధులు, స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు.. తదితర అన్ని రకాల పనులు మాతోనే చేయిస్తున్నారు. తొలుత మాకు డీఆర్‌డీఏ ద్వారా వేతనాలు చెల్లించేవారు. అనంతరం మండల పరిషత్‌ అధికారుల ద్వారా చెల్లించారు. 2006 నుంచి మండల సమాఖ్యల ద్వారా రూ.1000 చొప్పున ఇచ్చేవారు. 2013 మే 30న ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్‌ తీర్మానం తర్వాత 2013 జూన్, జూలై నెలలకు సంబంధించి రూ.2000 చొప్పున వేతనం ఇచ్చారు. అప్పట్నుంచి ఈ రోజు వరకూ వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా దినదిన గండంగా బతుకుతున్నాం. గతంలో రూ.5 లక్షల బీమా ఉండింది. ఇప్పుడదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం సాధికారత మిత్రల పేరుతో మాకు ప్రత్యామ్నాయంగా కొందరిని జన్మభూమి కమిటీల ద్వారా నియమించుకుని మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. ఉద్యమిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని వాపోయారు.  

యానిమేటర్ల డిమాండ్లు.. 
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. 
- ఏళ్ల తరబడి ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఠి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఠి గుర్తింపు కార్డులిస్తూ రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. ఠి విధుల్లో పని వేళలు నిర్దేశించాలి. 

మాపై కక్ష సాధిస్తున్నారు  
20 సంవత్సరాల నుంచి యానిమేటర్‌గా పని చేస్తున్నా. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొంది ఆయన పట్ల అభిమానం పెంచుకున్నాం. దీంతో టీడీపీ నేతలు మాపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి మానసికంగా హింసకు గురి చేస్తున్నారు. 30 సంఘాలకు యానిమేటరుగా వ్యవహరిస్తున్న నన్ను పక్కన పెట్టి 20 సంఘాలు తగ్గించి వారికి అనుకూలంగా ఉన్న మరో మహిళకు బాధ్యతలు అప్పగించారు. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.      
– కాదా లక్ష్మి, అనపర్తి మండలం. 

ఏళ్ల తరబడి జీతాలివ్వకపోతే ఎలా? 
ఏళ్ల తరబడి జీతభత్యాలు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలన్నీ మా ద్వారానే అమలు చేయిస్తూ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. నెల నెలా జీతం రాకపోతే పేదలమైన మేము ఎలా బతకాలి? చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మా సమస్యలపై స్పందించి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.  
– కె.నాగమణి,తూర్పుగోదావరి జిల్లా యానిమేటర్ల సంఘం అధ్యక్షురాలు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top