అల్లాడిపోతున్నామయ్యా..

People fires on CM Chandrababu fake promises in front of YS Jagan - Sakshi

ప్రతిపక్ష నేత ఎదుట వాపోయిన అన్నదాతలు

సాగు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన 

బాబు మాటలు నమ్మి మోసపోయామని మండిపాటు 

ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని ఆందోళన 

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు 

సర్కారు తీరుపై ఉద్యోగులు,బడుగు బలహీన వర్గాల జనం ఫిర్యాదు 

మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటామని జననేత భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రుణమాఫీ కాలేదు.. పాత అప్పు పోదు.. కొత్త అప్పు పుట్టదు.. అనువుగాని పరిస్థితుల్లో పంట పండించినా గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నామ’ని పలువురు రైతులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలనలో వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎలా విలవిల్లాడిపోతున్నాయో వివరించారు. ఆయా రంగాలను నమ్ముకుని బతుకుతున్న వారు ఏ రీతిన ఇక్కట్లు పడుతున్నారో ఏకరవుపెట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 287వ రోజు మంగళవారం వైఎస్‌ జగన్‌.. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలుకుతూనే తమ సమస్యలనూ చెప్పుకున్నారు.  

ఎరువులు కొనలేకపోతున్నామయ్యా.. 
ప్రజా సంకల్పయాత్ర బాడంగి చేరుకున్నప్పుడు అల్లుపాల్తేరు గ్రామానికి చెందిన మరడాన రామినాయుడు ఆధ్వర్యంలో పలువురు చిన్న, సన్నకారు రైతులు జగన్‌ను కలిసి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. ఒక్క యూరియా తప్ప మిగతా ఎరువుల ధరలన్నీ చుక్కల్ని అంటుతున్నాయని వాపోయారు. ఈ పరిస్థితుల్లో మీరు ప్రకటించిన వైఎస్సార్‌ రైతు భరోసా వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నామంటూ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఖరీఫ్‌కు ముందే పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇవ్వడం వల్ల చిన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నవరత్నాలతో తమ బతుకులు బాగుపడతాయన్నారు. చంద్రబాబు హామీని నమ్మి తీసుకున్న పంట రుణం మాఫీ అవుతుందన్న భరోసాతో డబ్బు కట్టకపోతే బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా తమకు తెలియకుండానే వేలం వేశారంటూ బొబ్బిలి నియోజకవర్గ రైతులు అనేక మంది జగన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తమకు న్యాయం చేయాలని కోరారు. 

ఆటోవాళ్లను గుర్తించింది జగన్‌ ఒక్కరే.. 
ఆటోవాళ్ల కష్టాలను గుర్తించిన ఏకైక నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆటో డ్రైవర్లు అభినందనలు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఆటోవాలాకు ఏడాదికి పది వేల రూపాయలు ఇస్తామన్న జగన్‌ ప్రకటనపై బాడంగి మండల ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వానపల్లి బలరాం నాయకత్వంలో పెద్దసంఖ్యలో వారు జననేతకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తామంతా జగన్‌కే మద్దతిస్తామని నినాదాలు చేశారు. 

ఈ వేతనంతో ఎలా బతికేది? 
పండగ, పబ్బం అంటూ లేకుండా ఏడాదిలో 364 రోజులు కష్టపడినా తమకు నెలకు ఇస్తున్నది కేవలం రూ.4,500లేనని, ఈ వేతనంతో తామెలా బతకాలంటూ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బంది (కంటింజెంట్‌ వర్కర్స్‌) జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జగన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న వందల్లో మాత్రమే లెక్కలు చూపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు, యువతీ యువకులు టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో రుణాల కోసం పడుతున్న పాట్లను పలువురు నిరుద్యోగులు జగన్‌ దష్టికి తీసుకువచ్చారు.   

వేగావతిపై వంతెన లేక ఎన్ని అగచాట్లో.. 
వేగావతి నదిపై వంతెన నిర్మిస్తామని చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ఇచ్చిన హామీ నేటికీ అమలు కాక అష్టకష్టాలు పడుతున్నామని గొల్లాది గ్రామస్తులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. గొల్లాది– కొత్తపెంట గ్రామాల మధ్య ఉన్న వేగావతి నదిపై బ్రిడ్జి పూర్తి చేస్తే బొబ్బిలికి రాకపోకలు పెరగడమే కాకుండా 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పిల్లలు బడి మానేస్తున్నారని, కూలీలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వాలు హడావిడి చేసినా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. రామభద్రాపురం మండలం కోటశీర్లాం గ్రామ రెవెన్యూ పరిధిలో 8 ఊళ్లలోని 2,500 ఎకరాల మెట్ట, పల్లపు భూములను తాము 50 ఏళ్లుగా సాగు చేసుకుంటుంటే ఇప్పుడు కొందరు స్వార్థపరులు కాజేయాలని చూస్తున్నారని చిన్న, సన్నకారు రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చట్టం చేసేందుకు జగన్‌న్‌ హామీ ఇచ్చారని సంఘం నేతలు సీహెచ్‌ దుర్గాప్రసాద్, వి.నాగేశ్వరరావు, డి.చిన్నాజీ వర్మ తెలిపారు. కాగా, డొంకినవలస వద్ద అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్‌ బాలాజీ, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌.సిద్ధార్థరెడ్డి, నేతలు కమలాకరరెడ్డి, లోకేష్‌రెడ్డిలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ నియోజకవర్గ సమన్వయకర్త శంకరనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన వీరందరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

రుణం రాకుండా ఎమ్మెల్యేనే  అడ్డుకున్నారు..
బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన బొట్ల కృష్ణ పుట్టు అంధుడు. ఇతను 2015లో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరైంది. అయితే ఆ తర్వాతే పరిస్థితి మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేత పార్టీ ఫిరాయించాడు. దీంతో ఆ పార్టీ వాళ్లకు రుణాలు రాకుండా పోయాయి. జన్మభూమి కమిటీలు పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలకు రుణాలు, పింఛన్లు చివరకు రేషన్‌ కూడా రాకుండా చేస్తున్నాయి. మా ఓట్లతో గెలిచి అమ్ముడుపోయిన వ్యక్తే ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నాడంటూ కృష్ణ తల్లిదండ్రులతో పాటు పలువురు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 
విజయనగరం జిల్లా లక్ష్మీపురం క్రాస్‌ – బాడంగి రోడ్డులో దివ్యాంగుడి సమస్యలను వింటున్న వైఎస్‌ జగన్‌ విజయనగరం జిల్లా లక్ష్మీపురం క్రాస్‌ – బాడంగి రోడ్డులో దివ్యాంగుడి సమస్యలను వింటున్న వైఎస్‌ జగన్‌ 

ఒక్క అవకాశం ఇప్పించండి.. 
రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికేతరులుగా మారిన ఉపాధ్యాయులకు మానవతా దృష్టితో స్వరాష్ట్రంలోని సొంత జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్థానికేతర ఉపాధ్యాయుల సంఘం కోరింది. ప్రజా సంకల్పయాత్ర చిన భీమవరం క్రాస్‌ దాటిన తర్వాత పెద్ద సంఖ్యలో వచ్చిన వారు జగన్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. రాష్ట్ర విభజనకు ముందు అన్‌ రిజర్వ్‌డ్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన తాము విభజన తర్వాత సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులమయ్యామని, దీనివల్ల రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్‌ సౌకర్యం కూడా కోల్పోతున్నామని చెప్పారు. తమతో పాటు తమ పిల్లలు కూడా చాలా నష్టపోతారని వివరించారు. అంతర్‌ రాష్ట్ర బదిలీలు రాష్ట్ర స్థాయి ఉద్యోగులకే తప్ప మిగిలిన వాళ్లకు (జిల్లా, జోనల్, మల్టీజోనల్‌) వర్తించవని, దీంతో జిల్లా కేడర్‌కు చెందిన తమ లాంటి వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విన్నవించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటువంటి వాళ్లం 645 మందిమి (తెలంగాణ నుంచి ఆంధ్రాకు 445, ఆంధ్రా నుంచి తెలంగాణకు 200 మంది) ఉన్నామని, తమకు అంతర్రాష్ట్ర బదిలీకి ఒక్క అవకాశం ఇప్పించాలని కోరారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ ఈ వ్యవహారమై గతంలో తాను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పని సరిగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చినట్టు సంఘం నేతలు ఎం.మోహనరావు, ఎస్‌.రామునాయుడు, వి.సూర్యనారాయణ, ఆనంద్, బి.రామకృష్ణ తదితరులు చెప్పారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం లేదన్నా.. 
అన్నా.. నా పేరు అభిరామ్‌రెడ్డి. విజయనగరం నుంచి వచ్చాను. నేను రైఫిల్‌ షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాను. స్కూల్‌ గేమ్స్, రాష్త్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించాను. నేను ఉపయోగిస్తున్న వెపన్‌ ఖరీదు రూ.2 లక్షలు. అసోసియేషన్‌ ద్వారా క్రీడా పరికరాలను అందివ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి తెలియజేశాను. అయినా టీడీపీ ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమాన్ని పక్కన పెట్టింది. తమిళనాడులో నాతోటి క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఆర్థికంగా నాలాంటి క్రీడాకారులను ఆదుకుంటే మరింత ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తానన్నా..   
– కె.అభిరామ్‌రెడ్డి  

బంగారు గాజులు వేలం వేశారన్నా.. 
2014 ఎన్నికలప్పుడు వ్యవసాయ రుణాలన్నింటినీ భేషరతుగా మాఫీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది. మేము 2012లో డొంకినవలస ఐఓబిలో 50 గ్రాముల బంగారం గాజులు కుదువపెట్టి మా అన్నయ్య తెంటు అప్పలస్వామి పేరుమీద రూ.80 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాము. టీడీపీ అధికారంలోకి వచ్చింది. రుణ మాఫీ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశాం. కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. బ్యాంకర్లు మాకు ఎటువంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే బంగారం గాజులు వేలం వేశారు. వేలం పాట పూర్తయ్యాక మీ గాజులు వేలం వేశామని ఫోన్‌ చేసి చెప్పారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండని అధికారులు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. బాబు మాటలు నమ్మి మోసపోయామన్నా.    
– తెంటు రామినాయుడు, పిన్నలవలస 

జగనన్నతో అన్న ప్రాసన చేయించాలని.. 
మా అబ్బాయి ప్రణవ ప్రగ్నేశ్వర్‌కు జగనన్న చేతుల మీదుగా అన్న ప్రాసన చేయించాలని నాలుగు నెలలుగా ఎదురు చూశాం. మా మండలం దత్తిరాజేరులో పాదయాత్ర జరిగినప్పటికీ అక్కడ కలిసే అవకాశం రాలేదు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి జగనన్న చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని జరిపించాం. మాకు చాలా సంతోషంగా ఉంది. జగనన్న సీఎం అయితే అందరి జీవితాల్లో వెలుగు వస్తుంది.  
– రౌతు సింహాద్రి, లక్ష్మిదేవి దంపతులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top