ఉద్దానాన్ని ఉద్ధరిస్తారట.. నమ్మాలట

People Fires On Chandrababu in Front of YS Jagan - Sakshi

     ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట చంద్రబాబుపై జనం మండిపాటు

     హుద్‌హుద్‌ బాధితులకు ఇప్పటికీ పైసా సాయం చేయలేదు.. 

     ఎక్కడైనా పిట్టల దొర మాటలే

     ఎన్నికలప్పుడు ఏన్నో హామీలిచ్చి నాలుగేళ్లుగా పట్టించుకోలేదు  

     వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను వేధిస్తున్నారు.. పాదయాత్రలో సర్కార్‌పై నిప్పులు చెరిగిన వైనం 

     మాటల సర్కార్‌ పోవాలి...చేతల ప్రభుత్వం రావాలని ఆకాంక్ష 

     అందరి కష్టాలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘తిత్లీ తుపానుతో సర్వనాశనమైన ఉద్దానాన్ని చంద్రబాబు దగ్గరుండి బాగు చేస్తాడంట.. నిద్రాహారాలు మాని పని చేస్తాడంట.. ఈ పిట్టల దొర మాటలు హుద్‌హుద్‌ తుపానొచ్చినప్పుడు కూడా మాకు చెప్పాడు. ఇళ్లు కట్టిస్తానన్నాడు. డబ్బులిచ్చి ఆదుకుంటానన్నాడు. ఇన్నేళ్లయినా మాకు ఏ సాయం చెయ్యలేదు. ఇప్పుడూ అదే మాదిరిగా చెబుతున్నాడు. ఆయన మాటలు నమ్మాలట. మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు’ అంటూ విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన బాధితులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎదుట వాపోయారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ దమననీతిని ఎండగడుతూ వైఎస్‌ జగన్‌ సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 284వ రోజు శనివారం గజపతినగరంలో మొదలై మధుపాడ, భూదేవిపేట క్రాస్, కొత్తరోడ్డు జంక్షన్, గుడివాడ క్రాస్, మానాపురం, మానాపురం సంత, కోమటిపల్లి వరకు సాగింది. అడుగడుగునా చంద్రబాబు మోసపు మాటలపై జనాగ్రహం వెల్లువెత్తింది. తుపాను సాయమే కాదు.. ఏదడిగినా పార్టీలతో ముడి పెడుతున్నారని, పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు. తమ నేతను గెలిపించుకున్నాకే ఏదైనా మేలు జరుగుతుందని జగన్‌పై విశ్వాసం చూపారు. కష్టం తెలిసిన నేతొచ్చాడంటూ పల్లె జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులిచ్చి ఘనంగా స్వాగతించారు. ఊళ్లకు ఊళ్లే తరలివచ్చి ఆయన అడుగులో అడుగులేశాయి. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో అనుభవిస్తున్న నరకాన్ని జననేత ఎదుట చెప్పుకుని జనం ఆవేదన వ్యక్తం చేశారు. హుద్‌హుద్‌ తుపాను బాధితులకు సర్కారు నుంచి ఏ సాయమూ అందలేదన్నారు. ఊరూరా జన్మభూమి కమిటీలు పేదల రక్తం తాగుతున్నాయని బావురుమన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరని స్థితిలో దగాపడ్డ పేదల గుండె చప్పుడు పాదయాత్రలో ప్రతిధ్వనించింది.  

నిరుద్యోగ భృతి ఓ నాటకం 
నిరుద్యోగ భృతి పేరుతో సర్కారు చేస్తున్న మోసంపై యువత నిప్పులు చెరిగింది. పురిటిపెంట గ్రామానికి చెందిన రాంబారిక రామకృష్ణ స్వీయ అనుభవాన్ని జగన్‌కు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అతని భార్య భృతికి అర్హురాలంటూ ఓ ధృవపత్రమిచ్చారట. బ్యాంకుకెళ్లి డబ్బులు తీసుకోవచ్చని చెప్పారట. బ్యాంకు ఖాతాలో నేటికీ ఒక్కపైసా పడలేదని చెప్పాడు. అధికారులను అడిగితే సాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాబు మోసానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? అని ప్రశ్నించాడు. ‘ఊరూరా నిరుద్యోగ యువతకు ఇదే తరహా మోసం.. మీరే ఏదైనా చేయాలి. మీ వెంటే నడుస్తాం..’ అంటూ జగన్‌ను కలిసిన ప్రతి నిరుద్యోగి చెప్పాడు.  

పల్లెకు ‘పచ్చ’ కామెర్లు.. 
జన్మభూమి కమిటీల దోపిడి, దౌర్జన్యాన్ని జనం ఏకరవు పెట్టారు. జననేత ముందు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నాలుగేళ్లుగా రేషన్‌ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగిన మరుపల్లి గ్రామానికి చెందిన రొంగలి సంధ్య మాటల్లో ఆగ్రహం, ఆవేదన కన్పించాయి. ఆఖరుకు పేదవాడి ప్రాణాలపైనా అధికార పార్టీ వాళ్లకు ఏమాత్రం కనికరం లేదని బంగారమ్మపేటకు చెందిన బాధితుడు కె తౌడు చెప్పుకొచ్చాడు. ఆరేళ్ల కొడుక్కి తలసేమియా వస్తే సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించడానికి వైఎస్సార్‌సీపీలో ఉండటమే అనర్హతగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలిస్తానన్న మీ భరోసాతోనైనా వీళ్లకు సిగ్గు రావడం లేదని జననేతతో అన్నాడు. సబ్సిడీ లోను అడిగితే పార్టీ మారాలంటున్నారని తెర్లాపు రాము అనే వ్యక్తి తెలిపాడు. ప్రాణం పోయినా వైఎస్సార్‌ బాట వీడేదే లేదన్నాడు.   

తాగేందుకు నీళ్లు లేవు.. సాగుకు సాయం లేదు 
పెదకాడ గ్రామ మహిళలు చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. తాగునీటి కోసం కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్‌ను కలిసి ఊరికొచ్చిన ఆపద గురించి చెప్పారు. రక్షిత మంచి నీటి ట్యాంకు ఎప్పుడో పూర్తయిందట. చిన్నా చితక పనులే మిగిలి ఉన్నాయని, నాలుగున్నరేళ్లు వీటి గురించే పట్టించుకోలేదని తెలిపారు. వేసవిలో దాహార్తి గురించి చెప్పారు. బిందెడు నీటి కోసం పరుగులు పెడుతున్నామని, చెలమల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన దయనీయ స్థితిని వివరించారు. రాష్ట్రంలో అసలు పాలన ఉందా? అంటూ ప్రశ్నించారు. సాగునీరు అందని వైనాన్ని మధుపాడ గ్రామస్తులు తమ నేత దృష్టికి తెచ్చారు. ఆండ్ర రిజర్వాయర్‌ నుంచి పంట పొలాలకు నీరందడం లేదని, దీంతో తాము ఆర్థికంగా చితికిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పైపులు లీకవుతున్నాయని, మరమ్మతులు చేసే దిక్కే లేదని చెప్పారు. మీరొచ్చాక మా కష్టాలు తీర్చాలని కోరారు. రుణమాఫీ అందని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, రైతులు, పింఛన్లు.. రేషన్‌కార్డులు రానివారు జననేత ఎదుట కష్టాలు చెప్పుకున్నారు. అందరి ఆవేదనలు, కష్టాలు ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.   

వైఎస్సార్‌సీపీ వాళ్లంటూ రేషన్‌ కార్డు ఇవ్వట్లేదన్నా.. 
అన్నా.. మాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. నా భర్త స్వామినాయుడితో కలిసి నేను 2014 నుంచి రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నాం. ఏటా దరఖాస్తు తీసుకుంటున్నారు తప్ప రేషన్‌ కార్డు మంజూరు చేయడం లేదు. జన్మభూమి కమిటీలు మా రేషన్‌కార్డు దరఖాస్తును పక్కన పడేస్తున్నాయి. ఎవరిని అడిగినా అదిగో ఇదిగో అంటున్నారు తప్ప రేషన్‌ కార్డు ఇవ్వట్లేదు. అధికారులు సైతం వారినే కలవమంటున్నారు. దీనంతటికీ కారణం మేము వైఎస్సార్‌సీపీకి చెందిన వారమని ఇతరులు చెప్పగా తెలుసుకున్నాం. 
– రొంగలి సంధ్య, మరుపల్లి, గజపతినగరం మండలం 

సాక్షర భారత్‌ సిబ్బందిని మీరే ఆదుకోవాలన్నా..  
అన్నా.. సాక్షర భారత్‌ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. అదేగనక జరిగితే మేమంతా రోడ్డున పడడం ఖాయం. విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో సాక్షర భారత్‌ సమన్వయకర్తలు, నలుగురు జిల్లా సమన్వయకర్తలు, 920 పంచాయతీలకు 1800 మంది వీసీఓలు 2010 నుంచి ప్రత్యేక కమిటీల ద్వారా నియమితులమై పని చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేయాలని చూస్తోంది. ఇలాగైతే మేమంతా ఇబ్బందులు పడతాం. మమ్మల్ని మీరే ఆదుకోవాలి.  
    – సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు 

సీఎం యువ నేస్తం అంతా బూటకం  
ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి మీరు అర్హులయ్యారు.. మీ ఖాతాలో ప్రతి నెలా నిరుద్యోగ భృతి జమ అవుతుందని చెప్పారు. రోజూ ఆశతో చూసుకుంటున్నా ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. నా భార్య రాంబారిక దాలమ్మ 2015లో బీఏ పూర్తి చేసి నిరుద్యోగిగా ఉంది. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామంటే సెప్టెంబర్‌ నెలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాం. భృతికి అర్హురాలే అంటూ మా ఎమ్మెల్యే కే.ఏ నాయుడు మాకు లేఖ అందించారు. రెండు రోజుల్లో ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పారు కానీ అది జరగలేదు. కాల్‌ సెంటర్‌ 1100కు ఫోన్‌ చేస్తే మీ బ్యాంకు ఖాతా నంబరు సరిలేదని చెప్పారు. ఖాతా నంబరు సరిగానే ఉందని ధ్రువీకరించినా ఎవ్వరూ స్పందించడం లేదు. ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న నాటకం. మీరు అధికారంలోకి వస్తేనే మా లాంటి వారి కష్టాలు తీరుతాయని జగనన్నకు చెప్పా. 
    – రాంబారిక రామకృష్ణ, పురిటిపెంట 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top