ఈ అరాచకాలు భరించలేమన్నా..

People fires on Chandrababu fake promises in front of YS Jagan - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన ప్రజలు

చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి..ఒక్కటీ అమలు చేయలేదు 

ఉద్యోగాలు పర్మినెంట్‌ చేస్తామని చెప్పి..ఇప్పుడు ఏకంగా తీసేస్తున్నారు 

ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేస్తున్నారు 

పింఛన్లు కట్‌.. రేషన్‌ బియ్యం కట్‌..  

మీరొస్తేనే న్యాయం జరుగుతుందని ఆకాంక్ష 

అడుగడుగునా సమస్యలు ఏకరువు 

అందరి సమస్యలు విని ధైర్యం చెప్పిన జననేత 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాడు ఇంటింటికీ ఉద్యోగాలన్నాడు.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇప్పుడేమో ఉద్యోగం ఊసే ఎత్తడం లేదు. ఎన్నికలొస్తున్నాయని వడబోసి వడబోసి ఊరికొకరికి భృతి అంటున్నాడు.. నాడు అవ్వా తాతలకు పెద్దకొడుకునన్నాడు.. ఇప్పుడు ఉన్న పింఛన్లు కూడా పీకేస్తున్నాడు. నాడు అందరికీ రేషన్‌ ఇస్తామన్నాడు.. ఇప్పుడేమో వేలి ముద్రలు పడలేదని కోత వేస్తున్నాడు.. జీవాలకు పెద్ద సాయం చేస్తామన్నాడు.. ఇప్పుడేమో ఇచ్చే రుణాలు కూడా ఆపేశాడు.. చివరకు మూడు నెలలకు ఒకసారి వేసే టీకాలు కూడా వేయడం లేదు’ అని వివిధ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఈ అరాచకాలు, మోసాలు ఇక భరించలేమని.. మళ్లీ రాజన్న పాలన కోసం నిన్ను గెలిపించుకుంటామన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఆదివారం సాగిన ప్రజా సంకల్పయాత్రలో ఊరూరా కనిపించిన దశ్యాలివి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 285వ రోజు ఆదివారం ఉదయం కోమటిపల్లి నుంచి ప్రారంభమైంది. తాడెందొరవలస క్రాస్, కుంటినవలస క్రాస్, మరడాం, షికారుగంజి క్రాస్, కె. కొత్తవలస క్రాస్‌ మీదుగా ఎస్‌ బూర్జవలస వరకు సాగింది. దారిపొడవునా ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజానీకాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ అందరికీ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ జగన్‌ ముందుకు సాగారు. మధ్యమధ్యలో చిరుజల్లులు పలకరించినా, కారుమబ్బులు కమ్మి.. ఉరుములు మెరుపులు మెరుస్తున్నా జననేతను కలుసుకునేందుకు స్థానికులు, ముఖ్యంగా మహిళలు బారులు తీరడం గమనార్హం. దారిన వచ్చిపోయే బస్సులు, ఇతర వాహనాల్లో ఉన్న వారు జననేతతో కరచాలనానికి పోటీపడ్డారు.   

మా ఊళ్ల పేర్లకు తగ్గట్టే మావన్నీ వలసలే... 
ప్రజా సంకల్పయాత్ర కుంటివలస క్రాస్‌ చేరినప్పుడు ఆ గ్రామానికి చెందిన మహిళలు కలిసి తమ ఊళ్ల పేర్లకు తగ్గట్టే తాము పొట్టచేతబట్టుకుని వలస పోవాల్సి వస్తోందని జగన్‌ ఎదుట వాపోయారు. తమ పిల్లలకు, పురుషులకు ఉన్న ఊళ్లలోనే ఉపాధి చూపించే మార్గం చూడాలని కోరారు. పింఛన్లు ఇవ్వడం లేదని, ఉండేందుకు ఇళ్లు లేక పాకల్లో జీవిస్తున్నామని వాపోయారు. లోన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని వాపోయారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే స్థానికంగా ఉపాధి కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు.  

వైఎస్సార్‌సీపీలో టీడీపీ మైనారిటీ సెల్‌ నేతల చేరిక 
నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనపై విసుగు చెందిన టీడీపీ మైనార్టీ సెల్‌కు చెందిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం వీరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్లారు.  పార్టీలో చేరాలనుకుంటున్నట్లు తమ అభిమతాన్ని వెల్లడించిన అనంతరం వైఎస్‌ జగన్‌ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.  విజయవాడ పట్టణ టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌ అహ్మద్, ఉపాధ్యక్షుడు షేక్‌ ఇబ్రహీం, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎస్‌వి రాబిన్, కార్యదర్శులు మున్వర్‌ఖాన్, షేక్‌ అజీజ్, ఇతర నేతలు షేక్‌ రహీం, షేక్‌ భాషా, మహ్మద్‌ ఫరూఖ్, షేక్‌ సయ్యద్‌ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.     

మీ హామీతో పాడి పరిశ్రమకు కొత్తకళ 
చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన పాడిపరిశ్రమకు తమరు అధికారంలోకి రాగానే కొత్త జీవకళ తీసుకురావాలని పలువురు రైతులు ప్రత్యేకించి మహిళలు జననేతను కోరారు. గడిసాం గ్రామానికి చెందిన ప్రసాద్‌ అనే పాడిరైతు నాయకత్వంలో పలువురు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. రైతు నుంచి ఆవు పాలు లీటర్‌ రూ.25కు కొని రూ.48కి వినియోగదారులకు విక్రయిస్తున్నారని వివరించారు. రైతులకు ఇస్తున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో లీటర్‌కు రూ.4 బోనస్‌ ఇస్తామని తమరు (జగన్‌) చేసిన ప్రకటన పాడి పరిశ్రమ కొత్తకళ సంతరించుకునేలా చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు.  

సాగు నీరు ఇప్పించండయ్యా..
తోటపల్లి నుంచి సాగు నీరు వచ్చేలా చేసి తమ మండలాన్ని కరవు నుంచి కాపాడాలని దత్తిరాజేరు మండల ప్రజలు వైఎస్‌ జగన్‌ను కోరారు. సాలూరు చంపావతి నుంచి వచ్చే నీటిని భూసాయి వలస, శిర్లాం వద్ద ఆపి తమను ఇక్కట్ల పాలుచేస్తున్నారని ఆరోపించారు. మెంటాడ మండలం పోరాం గ్రామం బోడిమెట్ట వద్ద మినీ రిజర్వాయర్‌ను నిర్మిస్తే అందరికీ నీళ్లు వస్తాయని, మీరు అధికారంలోకి రాగానే ఆ పని చేయాలని రైతులు కోరారు. పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నుంచి నీరు ఇప్పించి పాచలవలస గ్రామాన్ని కాపాడాలని ఆ ఊరి రైతులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. సర్వశిక్ష అభియాన్‌ పథకంలో 17 ఏళ్లుగా పని చేస్తున్నా ఇంతవరకు పర్మినెంట్‌ చేయలేదని ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యను అందిస్తున్న టీచర్లు వాపోయారు. సుదీర్ఘ అనుభవం, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని సహిత విద్య రిసోర్స్‌ ఉపాధ్యాయులు (ఐఇఆర్‌టీ), స్కూల్‌ అసిస్టెంట్లు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను లాగేసుకుంటున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల గోడు పట్టించుకోవాలని కర్రిపైడమ్మ అనే మహిళ కోరారు.  

డీఎస్సీ పేరిట ఎన్నిసార్లు మోసం చేస్తారు? 
రాష్ట్ర విభజన నేపథ్యంలో టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పి చంద్రబాబు పదేపదే మోసం చేస్తున్నాడని డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ పేరిట నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారని, ఇప్పటికే నలుగురైదుగురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని జగన్‌కు వివరించారు. తొలుత 20 వేల పోస్టులని చెప్పి.. ఇప్పుడు పంచపాండవులు మంచపు కోళ్ల మాదిరిగా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించిన చందంగా 5 వేలకు కుదించారన్నారు. వాటికి కూడా ఇంతవరకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ రాయడానికి అవసరమైన శిక్షణ తీసుకోవడానికి కృష్ణా జిల్లా అవనిగడ్డలో అభ్యర్థులు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. పరిష్కరించదగినవి అక్కడికక్కడే పరిష్కరిస్తూ మిగతా వాటిని పరిశీలించి తగు న్యాయం చేయండని తన సిబ్బందిని ఆదేశించారు.

రైతులకు కడగండ్లే.. 
అన్నా.. పాచిపెంట పెద్దగెడ్డ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా రామభద్రపురం మండలం నర్సాపురం గ్రామం వరకు సాగునీరు వస్తుంది. ఆ నీరు పాచిలవలస వరకు వచ్చేలా చేస్తే 3 వేల మంది రైతులకు చెందిన 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నా. తెలుగుదేశం ప్రభుత్వం పెద్దగెడ్డ కాలువను పాచిలవలస వరకు తీసుకువస్తామని చాలా సార్లు హామీ ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. ప్రతిసారి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నారే తప్ప రైతులకు మేలు చేయడం లేదు. రాజశేఖరరెడ్డి గారు రైతులకు ఎంతో ఉపయోగ పడే ప్రాజెక్టులను నిర్మించారు. మళ్లీ ఆ పాలన రావాలంటే మీరు ముఖ్యమంత్రి కావాలి.    
– సుమల వెంకటప్పలనాయుడు, ఇతర రైతులు 

జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని చేయలేదు 
దత్తిరాజేరు మండలం పరిధిలోని 12 గ్రామాల్లో పెద్దదైన మరడాం గ్రామంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఇక్కడి నుంచి వందలాది మంది విద్యార్థులు గజపతినగరం, విజయనగరం ప్రాంతాల్లోని కళాశాలలకు కష్టంగా వెళ్లాల్సి వస్తోంది. మరడాంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని జగనన్నను కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు.  
– జి.గౌరి, మరడాం, దత్తిరాజేరు మండలం 

సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లను రోడ్డున పడేశారన్నా.. 
సాక్షర భారతి కోఆర్డినేటర్లను చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడేసింది. అనేక సర్వేల పేరుతో మాతో బండచాకిరీ చేయించుకుని నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. మండల వ్యాప్తంగా 70 మంది కోఆర్డినేటర్లను జూన్‌ 14న తొలగించినట్లు తెలిపారు. వాస్తవానికి మార్చి31న మమ్మల్ని తొలగించినట్టు కేంద్రం నుంచి సమాచారం ఉన్నప్పటికీ మా చేత నవ నిర్మాణ దీక్షలకు, సాధికార సర్వే, స్వచ్ఛ భారత్, జన్‌ధన్‌ యోజన పథకం ప్రచారానికి వాడుకున్నాక ఇంటికి పంపారు. విజయవాడలో ధర్నా చేస్తే అక్టోబర్‌ 2వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ, దాన్ని నిలుపుకోలేదు. మీరే మాకు న్యాయం చేయాలి.     
– సాక్షర భారత్‌ కో ఆర్డినేటర్లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top