భరోసా కల్పించే జగనన్న రావాలి

People fires on Chandrababu corrupt regime at Praja Sankalpa Yatra - Sakshi

     చంద్రబాబు అవినీతి పాలనపై నిప్పులు చెరిగిన జనం 

     హామీలిచ్చి నిండా ముంచారని ఆగ్రహం 

     జననేత నవరత్నాలు భేష్‌.. అంటూ ఆత్మీయ స్వాగతం 

     వడ్రంగి గుడిసెలోకెళ్లి కష్టాలు తెలుసుకున్న మనసున్న నేత 

     రైతన్న, గీతన్నల గోడు విని ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌

     ఊరూరా వెల్లువెత్తిన ప్రజాభిమతం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చంద్రబాబు పాలనలో నాలుగున్నరేళ్లుగా కష్టాలు అనుభవిస్తున్నామని, ఇక ఈ పాలన చాలని.. మార్పు కావాల్సిందేనన్న మాట ప్రతి గడప నుంచీ వినిపించింది. జగనే సారథై రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని అన్ని వర్గాల వారూ ముక్తకంఠంతో నినదించడమూ కనిపించింది. ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 282వ రోజు మంగళవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరికవలస శివారు నుంచి మొదలైంది. కెంగువ గ్రామం వద్ద గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించి.. ముచ్చర్ల, కొండపేట క్రాస్‌ మీదుగా జిన్నాం వరకు సాగింది. జననేత పాదయాత్ర సాగిన ప్రతి పల్లెలోనూ పండుగ వాతావరణం కనిపించింది. ఊరూరా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని, అష్టకష్టాలు పడుతున్నామని గుండె మంటలను తమ నేత ముందుంచారు. సంక్షేమం తెలియని పేదలు.. సంక్షోభంలో ఉన్న రైతన్నలు.. ఉద్యోగం లేక, ఉపాధి మార్గం కన్పించని నైరాశ్యంలో ఉన్న యువత.. జగన్‌ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. రహదారులు లేని పల్లెల గురించి వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఏకరవు పెట్టారు.  
 
జననేత అడుగుతో గుడిసె గుడైంది.. 
వడివడిగా అడుగులేస్తున్న జగన్‌.. ముచ్చర్ల వద్ద గుడిసెలో పని చేస్తున్న వడ్రంగిని చూసి అటు వైపు మళ్లారు. అనూహ్యంగా జననేత తనవైపే వస్తుండటం చూసి.. వడ్రంగి సారంపాటి అప్పారావు ఆనందం పట్టలేక ఎదురెళ్లి స్వాగతించారు. ఎలాగున్నావంటూ జననేత భుజాన చెయ్యేసి అడగడంతో ఆ క్షణం అతనికి మాట రాలేదు. జననేత ఇచ్చిన ధైర్యంతో తన కష్టాలు చెప్పాడు. అటవీ శాఖాధికారులు లంచాలతో పీడిస్తున్నారట. కులవృత్తిని మానేసి కూలి పనికెళ్లే దుస్థితి ఏర్పడిందని బావురుమన్నాడు. ఊళ్లో ఉన్న 15 కుటుంబాలదీ ఇదే పరిస్థితని చెప్పాడు. మీరు సీఎం అవ్వగానే మమ్మల్ని ఆదుకోవాలని వేడుకున్నాడు. జగన్‌ వచ్చి వెళ్లిన తర్వాత ఊరంతా గుంపులు గుంపులుగా ఆ గుడిసెకొచ్చారు. అన్న ఏమన్నాడంటూ అడిగారు. దీనిపై అప్పారావు స్పందిస్తూ ‘జగనన్న రావడంతో నిజంగా ఈ పేదోడి గుడిసె గుడిగా మారింది’ అన్నాడు.  
 
ఆయనే ఓ నమ్మకం 
జనం గుండెల నిండా జగనే. పాదయాత్రలో ఆయన్ను కలిసిన ప్రతి ఒక్కరి నుంచి వినిపించిన మాటిది. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోకుండా మోసం చేసిందని, జగన్‌ ఏకంగా కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని ఆ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తం చేశారు. ముచ్చర్ల వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ జగన్‌కు సాదర స్వాగతం పలికారు. ముస్లిం మైనార్టీలు కూడా ఇదే రీతిలో స్పందించారు. ముస్లింల సంక్షేమం కోసం జననేత ఎంతగానో పరితపిస్తున్నారన్నారు. ‘వంచక పాలన ఇక వద్దు’ అన్నది గీతన్న మాట. నేతన్న ఆవేదన. రైతన్న ఆక్రోశం. వయోవృద్ధుల మనోభావం. పాదయాత్రలో జగన్‌ను కలిసిన ప్రతి వ్యక్తి టీడీపీ సర్కార్‌ దగా చేసిందని చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయలేదని గీత కార్మికులు జగన్‌ వద్ద వాపోయారు. గీత కార్మిక సొసైటీలకు ఐదెకరాల భూమి ఇస్తానన్న మాట నీటి మూటైందన్నారు. హుద్‌హుద్‌ తుపానులో నష్టపోయిన గీతన్నకు రూ.10 వేల సాయం చేస్తానని మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని చెప్పుకొచ్చారు. వలసబాట పట్టే దుస్థితి వచ్చిందని, ఇక బాబు మోసాలు సాగవని మత్స్యకారులు చెప్పుకున్నారు. ఆఖరుకు చిన్నారుల్లోనూ చంద్రబాబు పాలనపై కసి, ద్వేషం కనిపించింది. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వివరించారు. పింఛన్లు రాని వారు, ఆరోగ్యశ్రీ వర్తించని వారు, రైతులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు టీడీపీ ప్రభుత్వ పని తీరును ఎండగట్టారు. విద్యా సంస్థలకు దసరా సెలవులివ్వడంతో తొలి రోజే విద్యార్థులు పెద్ద సంఖ్యలో జగన్‌ పాదయాత్ర వైపు అడుగులేశారు. ‘అన్నా.. అన్నా.. ఒక్క ఫొటో దిగుతానన్నా..’ అంటూ జగన్‌ భద్రతా సిబ్బందిని బతిమిలాడుకుని రోప్‌లోకి వెళ్లారు. జననేతను కలిశాక ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడం ఊరూరా కనిపించింది.  

డబ్బులివ్వకుండానే ఇచ్చేసినట్లు కాగితం  
అన్నా.. నేను కిరోసిన్, డీజిల్‌ ఇంజిన్లు మరమ్మతు పనులు చేసుకుని వచ్చే డబ్బులతో జీవిస్తున్నా. ఇప్పుడా పనులు కూడా లేవు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇద్దరు ఆడపిల్లల పథకంలో పేరు నమోదు చేయించాను. బంగారు తల్లి పథకం పేరిట గజపతినగరం మండల కేంద్రంలో నా కుమార్తె బూడి ఝాన్సీ పేరున అకౌంట్‌ ప్రారంభించాం. 2016లో ప్రారంభించిన ఈ అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. కానీ మా పేరున రూ.2,500 జమ చేసినట్టు కాగితమిచ్చారు. ఇంతకంటే ఘోరముంటుందా? నేటికీ మా పాప అకౌంట్‌లో డబ్బులు పడలేదు. రెండేళ్లపాటు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. మన ప్రభుత్వం రాగానే మాలాంటోళ్లకు న్యాయం చేయాలన్నా.     
– డి.పాపినాయుడు, కెంగువ  

మా బడికి ప్రహరీ లేక బయటివారు మద్యం తాగుతున్నారు 
అన్నా.. మాది జిన్నాం. మా ఊళ్లోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాం. మా పాఠశాలలో కంప్యూటర్‌ విద్య లేదు. మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో లేవు. తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రహరీ కూడా లేకపోవడంతో పాఠశాలకు రక్షణ లేదు. దీంతో పాఠశాల మైదానంలోకి బయటి వారు వచ్చి మద్యం తాగుతున్నారు. ప్రహరీ, వాచ్‌మన్‌ లేకపోవడం వల్లే ఈ దుస్థితి. అన్నా.. మీరు సీఎం కావాలి.. మా పాఠశాల పరిస్థితి మార్చాలి.  
– సమస్య వివరించి జననేతతో సెల్ఫీ దిగుతున్న విద్యార్థినులు కె.దేవిక, కె.కృష్ణవేణి, జి.శ్యామల 

కలప కోసం లంచాలివ్వలేకపోతున్నాం.. 
మంచాలు, దివాన్‌కాట్‌లు తయారు చేయడానికి అవసరమైన కలప ధర పెరిగిపోవడంతో వండ్రంగి పని చేయలేకపోతున్నాం. కలప తెచ్చేటప్పుడు అటవీ శాఖ అధికారులు ఎక్కడబడితే అక్కడ అడ్డుకొని లంచాలు వసూలు చేస్తున్నారు. మేం వారికి లంచాలు ఇవ్వలేక మా కులవృత్తికే స్వస్తి చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే చాలా మంది పొలం పనులు చేసుకుని బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి రుణాలు రావడం లేదు. మీరే మమ్మల్ని ఆదుకోవాలన్నా. 
– సారంపాటి అప్పారావు, కడలి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, ముచ్చెర్ల 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top