ఏ కష్టమొచ్చినా పట్టించుకునే దిక్కులేదయ్యా..

People fires on Chandrababu about Govt schemes implementation infront of YS Jagan - Sakshi

ప్రభుత్వ పథకాలన్నీ పాలక పక్షం వారికేనని ఫిర్యాదు 

రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం 

చంద్రబాబు హామీలు నిలుపుకోలేదని మండిపాటు 

ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన 

అందరి కష్టాలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జననేత  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  బతుకు భారమై పొట్ట చేత పట్టుకుని వలస పోయామని కొందరు.. గూడు కట్టిన దైన్యంతో జీవనాన్ని సాగిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదని మరికొందరు.. ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న పాలకుల మాటలు నమ్మి మోసపోయామని ఇంకొందరు.. ప్రభుత్వ పథకాలన్నీ పాలకపక్షం వారికే దక్కుతున్నాయని నిరుపేదలు, ఆదివాసీలు.. ఇలా వివిధ వర్గాల వారు నాలుగున్నరేళ్లుగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 290వ రోజు ఆదివారం వైఎస్‌ జగన్‌.. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పారాది నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రామభద్రపురంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రత్యేకించి మహిళలు జననేతకు ఎదురేగి నుదుట తిలకం దిద్ది స్వాగతం పలికారు. హారతి పట్టారు. తమ చంటి బిడ్డల్ని ఎత్తుకొచ్చి జగన్‌ ఆశీర్వాదాలు పొందారు. అవ్వా తాతలు జననేతను ఆశీర్వదించారు. మరోవైపు యాత్ర సాగిన దారి పొడవునా వచ్చి పోయే ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు జగన్‌తో కరచాలనానికి పోటీ పడ్డారు.  

ఇంజిన్లు సరే, కిరోసిన్‌ ఏదీ? 
ఆహార భద్రతా పథకం కింద రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన కిరోసిన్‌ ఆయిల్‌ ఇంజిన్లకు ప్రస్తుతం కష్టకాలం వచ్చిందని విజయనగరం జిల్లాలోని రైతులు అనేక మంది వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆహార పంటలు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ఈ ఇంజిన్లను ఇచ్చారు. తేలికపాటి ఈ ఇంజిన్లు కిరోసిన్‌తో నడిచేవి. అయితే ఇప్పుడు కిరోసిన్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఈ ఇంజిన్ల నిర్వహణకు ప్రైవేటు వ్యాపారుల నుంచి లీటర్‌ కిరోసిన్‌ను రూ.70 పెట్టి కొనుగోలు చేసి నడుపుకోవాల్సి వస్తోందని, కిరోసిన్‌ సరఫరా పునరుద్ధరణ జరిగేలా చూడాలని రామభద్రపురం రైతులు అనేక మంది జగన్‌కు విన్నవించారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తారని, రబీలో ఈ తోటల్ని తడుపుకునేందుకు ఈ ఇంజిన్లే తమకు గతి అని వారు వివరించారు.   

పెద్దగెడ్డ నీరొస్తేనే మాకు పంటలు.. 
పెద్దగెడ్డ రిజర్వాయర్‌ను నాయుడువలస దాకా పొడిగించాలని రామభద్రపురం మండల మహిళా రైతులు కోరారు. సోంపురం గ్రామానికి చెందిన మార్పిన లక్ష్మి నాయకత్వంలో పలువురు రైతులు జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించారు. ప్రస్తుతం పెద్దగెడ్డ నీరు తారాపురం వరకు వస్తోందని, ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో కాలువలను పొడిగించకపోవడంతో వేలాది ఎకరాలు వర్షాధారంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. వర్షాలు లేక ఊళ్లలోని చెరువులు ఎండిపోయాయని, దీంతో వలస పోయి కూలి చేసుకుని బతకాల్సి వస్తోందని వివరించారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టిలో ఉందని, మన ప్రభుత్వం రాగానే పెద్దగెడ్డ కాలువలను పొడిగించి ప్రతి ఎకరాకు నీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

 

ఈ మార్కెట్‌లో దళారులు చెప్పిందే వేదం 
కూరగాయల సాగుకు, మార్కెట్‌కు పేరుగాంచిన రామభద్రపురం మార్కెట్‌లో దళారులు చెప్పిందే బేరం, రాసిందే రేటని ఉద్యాన పంటల రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌కు కూరగాయలు వెళతాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులకు స్థానిక మార్కెట్‌లో ఉండే కొందరు దళారులుగా వ్యవహరిస్తూ కూరగాయల రైతుల కడుపు కొడుతున్నారని వాపోయారు. రామభద్రపురానికి చెందిన చుక్కా సత్యవతి తన గోడు వినిపిస్తూ.. 3 ఎకరాలు కౌలుకు తీసుకుని 55 వేల రూపాయలు ఖర్చు చేసి కూరగాయలు పండిస్తే దళారులు రేటు లేకుండా చేశారని చెప్పింది.  మన ప్రభుత్వం రాగానే దళారీ వ్యవస్థను రద్దు చేస్తామని జగన్‌ ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. 

ఎటుచూసినా సమస్యలే 
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఇప్పటికీ రాలేదని ఇట్లామామిడిపల్లి గ్రామస్తులు జగన్‌కు నివేదించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లమని చెప్పి పింఛన్లు ఇవ్వడం లేదని పారాది గ్రామానికి చెందిన సువ్వాడ సత్యం, శిష్టు సీతారామపురానికి చెందిన పాల్వంచ రాములు వాపోయారు. తమ ఓట్లు తొలగిస్తున్నారని రామభద్రపురంలోని గొల్లవీధి, అగురు వీధి ప్రజలు ఫిర్యాదు చేశారు. దాణా, పశువుల కొనుగోలుకు సబ్సిడీ ఇప్పించాలని పాడి రైతులు కోరారు.  

 

గిరిజన గ్రామాలకు రోడ్లేవీ? 
గిరిజనాభివృద్ధికి పెద్ద ఎత్తున పాటు పడుతున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అది కనిపించడం లేదని విజయనగరం జిల్లా గిరిజన సంఘాల నేతలు ఆరోపించారు. పతివాడ చంద్రశేఖర్‌ నాయకత్వంలో పలువురు గిరిజనులు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ప్రాంతంలోని గిరిజన గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవుపెట్టారు. రామభద్రపురం మండలం జిన్నివలస నుంచి ఏడు గిరిజన గ్రామాలకు రోడ్డు, ఇతర మౌలిక వసతులు లేవని చెప్పారు. వర్షాకాలం వస్తే ఊళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వీలుండదని, ఎవరైనా అనారోగ్యం పాలైతే పట్టించుకునే నాథుడు కూడా ఉండడని ఆవేదన వ్యక్తం చేశారు.  జగన్‌ను చూసేందుకే కొండమామిడి గ్రామం నుంచి పారాదికి వచ్చానని శెట్టి సింహాచలం అనే వృద్ధురాలు చెబుతూ.. బిడ్డా.. నువ్వు (జగన్‌) రావాలి.. మాకు మేలు చేయాలంటూ ఆశీర్వదించారు. 

నా బిడ్డను బతికించండి సార్‌.. 
పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఆ దివంగత నేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం నిర్వీర్యం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేటకు చెందిన నిరుపేద దంపతులు శ్రావణ సంధ్య, ప్రసాద్‌కు పెద్ద కష్టమే వచ్చింది. వారి నాలుగు నెలల చిన్నారికి మెదడులో నీరు చేరి ఎదుగుదల ఆగిపోయింది. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆపరేషనే శరణ్యమని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద ఈ ఆపరేషన్‌ చేయలేమని ఆస్పత్రుల వాళ్లు తేల్చి చెప్పడంతో కన్నీరు మున్నీరు కావడం ఈ దంపతుల వంతయింది. తమ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టమని జననేతను వేడుకున్నారు. దీంతో జగన్‌ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని చలించిపోయారు. ఏమైంది ఈ ప్రభుత్వానికి? నిరుపేదల్ని ఆదుకోవడానికి కూడా చేతులు రాలేని దుస్థితిలో ఈపాలకులు ఉన్నారా? అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ దంపతులకు ధైర్యం చెప్పారు. అసలు ఈ వ్యాధి ఏమిటో, ఆరోగ్య శ్రీ ఎందుకు వర్తించదో, ఆపరేషన్‌ వివరాలేమిటో పూర్తిగా కనుక్కుని తనకు చెప్పండని తన వ్యక్తిగత సహాయకులను ఆదేశించారు. జగన్‌ భరోసాతో తాము ధైర్యంగా తిరిగి వెళుతున్నామని, తమ బిడ్డ తప్పక బతుకుతుందన్న ఆశ తమలో కలిగిందని ఆ దంపతులు మీడియాకు చెప్పారు.

 

పేదల పేరుతో దోపిడీ 
పేదలకు ఇస్తామని చెప్పి రైతుల నుంచి కొనుగోలు చేసిన 11 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు తమ సొంతానికి వాడుకుంటున్నారు. 300 మందికి పైగా పేదలకు పట్టాలు ఇస్తామని చెప్పి రైతుల నుంచి 19 ఏళ్ల క్రితం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబు కొనుగోలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఆ భూమిని కేటాయించకపోవటం అన్యాయం. ఈ విషయంపై ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారు. మా గ్రామం ఇట్లా మామిడిపల్లి పరిధిలో నిర్వహిస్తున్న మైనింగ్‌ తవ్వకాల్లో నిబంధనలు పాటించకపోవటంతో సమీప గ్రామం బంకుడువలసకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స్థానిక టీడీపీ నాయకులు, మైనింగ్‌ అధికారులు కుమ్మక్కయ్యారు. గ్రామ సర్పంచ్‌కు నెలకు రూ.25 వేలు మమూళ్లు ముట్టజెప్పుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఆ 11 ఎకరాల భూమిని పేదలకు కేటాయించాలి. అక్రమ మైనింగ్‌ తవ్వకాలను ఆపేయాలని జగనన్నను కోరాను.    
– మామిడి వెంకటరమణ 

క్రీడలకు ప్రాధాన్యం లేదన్నా.. 
అన్నా.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. విజయనగరం జిల్లాకు చెందిన 120 మంది సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు వేర్వేరు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అయితే ఈ క్రీడకు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో మాత్రమే స్పాన్సర్స్‌ ఉన్నారు. దీంతో మిగతా జిల్లాలో ఈ క్రీడ వెనుకబడిపోతోంది. మీరు అధికారంలోకి రాగానే జిల్లాకు ఒక సాఫ్ట్‌బాల్‌ క్రీడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.  
– సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులు, కోచ్‌లు 

వికలాంగుడినైనా కక్ష కట్టి పింఛన్‌ ఇవ్వడం లేదన్నా.. 
ఏడాదిన్నర క్రితం బొబ్బిలి మండలం పారాది వద్ద ప్రమాదంలో నా కుడి కాలు విరిగిపోయింది. కాలును పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఒక కాలుతోనే నడుస్తున్నా. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిననే సాకుతో ఇంత వరకు నాకు పింఛన్‌ మంజూరు చెయ్యలేదు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి సాలైపోయింది. ఈ ప్రభుత్వంలో అర్హులకు పింఛన్‌లు అందడం లేదు. నా బాధను జగనన్నకు చెప్పాను. మన ప్రభుత్వం రాగానే రూ.3 వేలు పింఛన్‌ ఇస్తానని చెప్పారు. సంతోషంగా ఉంది.  
– పాలవలస రాము, శిష్టు సీతారాంపురం, రామభధ్రపురం మండలం    

గాంధీ దారుశిల్ప కళా ఆశ్రమానికి స్థలం ఇప్పించండి 
జననేతను కోరిన స్వాతంత్య్ర సమరయోధుడు కందుకూరు గంగరాజు  
విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో నడుస్తున్న గాంధీ దారుశిల్ప కళా ఆశ్రమానికి స్థలం కేటాయించాలని స్వాతంత్య్ర సమరయోధుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తెలంగాణలోని ఖమ్మం జిల్లా చిన్నబీరపల్లికి చెందిన కందుకూరు గంగరాజు (95) ఆదివారం వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, షర్మిలమ్మల పాదయాత్రలో పాల్గొన్నానని చెప్పారు.  ఆశ్రమానికి స్థలం కేటాయించాలని అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కోరామని, ఆయన జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారని తెలిపారు. ఆ తర్వాత మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోవడం, కలెక్టర్‌ బదిలీ కావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు. విశ్వబ్రాహ్మణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వృత్తిని నేర్పేందుకు అవసరమైన 500 గజాల స్థలం విజయవాడలో కానీ, గుంటూరు ప్రాంతంలోకానీ ఇప్పించేలా చూడాలని కోరారు.

వైఎస్సార్‌సీపీలోకి విశాఖ కాంగ్రెస్‌ నేత 
విశాఖపట్టణం పట్టణ కాంగ్రెస్‌ మాజీ కార్యదర్శి, న్యాయవాది ఐ.వరలక్ష్మి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం పాదయాత్ర శిబిరం వద్ద  వైఎస్‌ జగన్‌.. ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలో వచ్చిన ఆమె.. జీవీఎంసీ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఐ.ఎల్‌.నరశింహం కుమార్తె. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరానని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top