జోరు వానలోనూ.. జన హోరు 

People from different communities says their problems with YS Jagan - Sakshi

వర్షం పడుతున్నా లెక్కచేయక వైఎస్‌ జగన్‌ వెన్నంటిన జనం 

జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడిన మహిళలు 

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు 

అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు ఇవ్వడం లేదని వాపోయిన వృద్ధులు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఎర్రటి ఎండ.. ఆ పై జోరు వర్షం.. రెండింటినీ జనం లెక్క చేయలేదు.. జగనన్న అడుగులో అడుగేస్తూ నడవడమే లక్ష్యంగా వెన్నంటారు. జై జగన్‌ నినాదాలతో ప్రజా సంకల్ప యాత్రలో హోరెత్తించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం 263వ రోజు పాదయాత్రను విశాఖ జిల్లా దువ్వపాలెం జంక్షన్‌ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం భోజన విరామం శిబిరానికి చేరుకునే వరకు ఎర్రటి ఎండ నిప్పులు కురిపించింది. ఈ మధ్యలో జననేత ఒక్కో గ్రామం దాటుకుంటూ వస్తుండగా దారికిరువైపులా పెద్ద ఎత్తున జనం గుమికూడి నీరాజనాలు పలికారు. పలు చోట్ల రహదారిపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. డబ్బంద క్రాస్, ఎస్సార్‌ పురం కాలనీ వద్ద జగన్‌ను చూసి సంఘీభావం ప్రకటించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు ఉదయం శిబిరం వద్ద యాత్ర ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు నుంచే పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకుని జననేత కోసం వేచి ఉన్నారు. 
 
వర్షంలోనూ అడుగులో అడుగు 
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం శిబిరం నుంచి జగన్‌ బయట అడుగు పెట్టగానే వర్షం మొదలైంది. క్రమంగా అది పెద్దదైనా ఆయన తడుస్తూనే నడక కొనసాగించారు. జోరు వానలోనూ జన హోరు తగ్గక పోవడం విశేషం. తడుస్తూనే జగన్‌తో కలిసి నడవడానికి పోటీపడ్డారు. ఆయనతో కరచాలనం చేయాలని, మాట కలపాలని ఉవ్విళ్లూరారు బొంతువాని పాలెం, శొంట్యాం, దిబ్బడిపాలెం, గుమ్మడి వానిపాలెం మీదుగా యాత్ర సాగింది. ఆదివారం సెలవు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం భారీగా తరలి వచ్చి జగన్‌ను చూడటం కోసం నిరీక్షించారు. కాపుల అభ్యున్నతి కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్న జననేత హామీ పట్ల ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు ప్లకార్డులు పట్టుకుని జగన్‌ వెంట కాసేపు నడిచారు. జగన్‌ సీఎం అయితేనే తమతో పాటు అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన కాపు నాయకుడు బండ్రెడ్డి రామజోగి వైఎస్సార్‌సీపీలో చేరారు.  
 
కష్టాలు.. కడగండ్లు.. ఆవేదనలు.. 
పెందుర్తి – భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్‌ యాత్ర సాగుతున్నపుడు అంతర్జాతీయ బాక్సింగ్‌ క్రీడాకారణి బగ్గు మౌనిక ఆయన్ను కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు స్పాన్సర్‌షిప్‌ కావాలని విజ్ఞప్తి చేసింది. విశాఖ ఉక్కు కార్మాగారానికి ఖనిజం కొరత ఉందని సత్తరువు జంక్షన్‌ వద్ద ప్లాంటు ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీతో పాటు ఒడిశా, జార్ఖండ్‌లోని గనులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ మార్కెటింగ్, ఫైనాన్స్‌ కార్యాలయాల కోసం రాజధాని పరిధిలో ఒక ఎకరం కేటాయించడంతో పాటు విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో మార్కెట్‌ యార్డుల కోసం పది ఎకరాల చొప్పున కేటాయించేలా చూడాలని వారు కోరారు. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జననేతకు తమ సమస్యలు చెప్పుకున్నారు. తమకు అర్హతలున్నా పింఛన్లు రావడం లేదని అవ్వా తాతలు వాపోయారు. పింఛన్లు రాకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డు పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. విద్యార్థులు, రైతులు, దివ్యాంగులు, నిరుద్యోగులు, రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. నాలుగున్నరేళ్లుగా అన్నీ కష్టాలేనని వాపోయారు. మీరొస్తేనే న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  

జననేతకు కాపుల కృతజ్ఞతలు 
కాపుల అభ్యున్నతి కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్న జననేత హామీ పట్ల ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాపు, బలిజ, తెలగకు చెందిన నేతలు ఆ మేరకు ప్లకార్డులు పట్టుకుని జోరు వానలో జగన్‌ వెంట నడిచారు. అధికార టీడీపీ  నాలుగున్నరేళ్లుగా కాపులను నిలువునా మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సీఎం అయితేనే తమతో పాటు అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన కాపు నాయకుడు బండ్రెడ్డి రామజోగి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు 
విశాఖలో ఏర్పాటు చేయాల్సిన సిడాక్, బయోటెక్నాలజీ ఇంక్యుబేషన్‌ సెంటర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీస్, ఫార్మాస్యూటికల్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖకు కేటాయించిన ఎయిమ్స్‌ను సైతం ఇక్కడకు రాకుండా తరలిస్తున్నారు. 
– వైఎస్‌ జగన్‌తో ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లు 

సాగు భూములను కబ్జా చేశారు 
‘అన్నా.. మా గ్రామం ఆనందపురం మండలం కుసులువాడలోని సర్వే నెం 247లో 51 ఎకరాల భూమిని 56 కుటుంబాలకు ఇందిరప్రభ పథకం కింద పంపిణీ చేశారు. ఈ భూమిలో 22 సంవత్సరాల నుంచి మామిడి, జీడి తోటలు సాగు చేసుకుంటున్నాం. కొందరు భూ బకాసురులు ఈ భూములపై కన్నేసి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి సాగు చేసుకుంటున్న వారిని రాత్రికి రాత్రే తరిమేశారు. జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేదు. సంచార జాతులకు చెందిన వారమైన మాకు ఈ భూములకు డీ ఫారం పట్టాలు ఇప్పించేలా చూడండి.     
– తుపాకుల అప్పారావు, దాసరి కులస్తుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు

మా అబ్బాయికి మాటొచ్చిందన్నా.. 
అన్నా.. మా అబ్బాయి ఆశీష్‌ వర్మకు పుట్టుకతోనే మూగ, చెవుడు. ఆపరేషన్‌ చేయించే స్థోమత మాకు లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 2011లో మా అబ్బాయికి హైదరాబాద్‌లో శస్త్రచికిత్స (కాక్లియర్‌ ఇంప్లాంట్‌) జరిగింది. రూ.7 లక్షలను ప్రభుత్వమే భరించింది. మహానేత పుణ్యమా అని మా అబ్బాయికి మాటలు వచ్చాయి. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పడానికే మీ వద్దకు వచ్చాం. 
– జగన్‌తో యు.శివాజి దంపతులు, చినముషిడివాడ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top