అందరిదీ ఒకటే గమ్యం! 

People are attracted towards YSRCP - Sakshi

రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు 

వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్న  ప్రజాప్రతినిధులు, సీనియర్లు, తటస్థులు 

అన్ని ప్రాంతాలు, సామాజికవర్గాల నుంచి వెల్లువెత్తుతున్న సానుకూలత 

ప్రజానాడిని గుర్తించే వైఎస్‌ జగన్‌కు          జైకొడుతున్న నేతలు 

పండుగ వాతావరణాన్ని తలపించేలా భారీగా చేరికలు  

వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పునకు ఇదే సంకేతమని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ

ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నకొద్దీ రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాభీష్టం స్పష్టమవుతుండడంతో సీనియర్‌ రాజకీయ నేతలతో పాటు తటస్థులు తమ భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. తమ తమ జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ పట్టున్న సీనియర్లు.. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నవారు.. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఉత్సాహవంతులూ.. ఇలా అందరి గమ్యస్థానం వైఎస్సార్‌ కాంగ్రెస్సే కావడం గమనార్హం. దాంతో పండుగ వాతావరణాన్ని తలపించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సామాజికవర్గాల నుంచీ పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి.

ప్రజాభిప్రాయానికి అనుకూలంగా సమీకరణలు 
దాదాపు ఐదేళ్లుగా అన్ని రంగాల్లో పూర్తి వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటం నాయకులను ప్రభావితం చేస్తోంది. రాజధాని నిర్మాణంలో అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతోపాటు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీలో చంద్రబాబు సర్కార్‌ మోసపూరిత వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ రాజీపడటంతో ప్రగతి పడకేసిందని అన్ని వర్గాలు గుర్తించాయి. మరోవైపు.. సీఎం, మంత్రి లోకేశ్‌తోపాటు ఇతర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుండటంపై కూడా ఆ పార్టీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. మరోవైపు.. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నీరాజనాలు పలకడంతోపాటు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభించింది. అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట తాము అమలుచేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వాటిని జగన్‌ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. వీటిపట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో పలు జాతీయ చానల్స్‌ సర్వేలు చేయగా.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందనేది  వెల్లడైంది. దాంతో చంద్రబాబు అప్రమత్తమై హడావుడిగా కాపీకొట్టి ప్రకటించిన తాయిలాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి.  

అందరి దారీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్సే 
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతుండడంతో అందుకనుగుణంగానే సమీకరణాలు వేగం పుంజుకుంటున్నాయి. అన్ని ప్రాంతాలు.. అన్ని సామాజికవర్గాల నేతలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వారిలో సీనియర్‌ నేతలు, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నవారు, తొలిసారి రాజకీయాల్లో ప్రవేశిస్తున్న తటస్థులూ ఉండటం గమనార్హం.  ఉదాహరణకు.. 
- కృష్ణా జిల్లాలో గుర్తింపు ఉండి, బలమైన సామాజికవర్గానికి చెంది.. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్‌ నేత దాసరి జైరమేష్, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే బాలవర్థనరావు ప్రజాభీష్టాన్ని గుర్తించి వైఎస్సార్‌సీపీలో చేరారు.  
సీఎం చంద్రబాబు సమీప బంధువు, జూ.ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావు కూడా చేరారు.  
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సైతం వైఎస్సార్‌సీపీకి జైకొట్టారు. ఇదే జిల్లాలో గుర్తింపు ఉన్న పారిశ్రామికవేత్త, ప్రముఖ సీడ్స్‌ వ్యాపారి పోచా బ్రహ్మానందరెడ్డి తన రాజకీయ రంగప్రవేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌నే వేదికగా చేసుకున్నారు. ప్రముఖ దళిత పారిశ్రామికవేత్త మధుసూదనరావు సైతం వైఎస్సార్‌ జెండా పట్టుకున్నారు.  
రాష్ట్రంలో రాజకీయంగా గుర్తింపు ఉన్న దగ్గుబాటి కుటుంబ వారసుడు దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు.  
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాల సమాఖ్య కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు తన కుమారుడు భరత్‌తో కలసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌నే ఎంపిక చేసుకున్నారు. భరత్‌ ప్రస్తుతం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా క్రియాశీలంగా ఉన్నారు.  
అదే విధంగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ప్రభావితులై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు.  
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీమంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్‌ పార్టీలో చేరారు.  తాజాగా మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్, ప్రముఖ సినీ నటుడు అలీ, రాజమండ్రిలో ఏపీ ఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామసుబ్రహ్మణంలు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. 

పదవులు వదులుకుని మరీ.. 
అధికార పార్టీలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం తమ పదవులను వదలుకుని మరీ వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు.  
- రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి టీడీపీకీ,  పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.  
ప్రకాశం జిల్లా చీరాల నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్‌ జగన్‌కే జైకొట్టారు. సీఎం చంద్రబాబు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ ఆయన ఖాతరు చేయకుండా టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.  
విశాఖ జిల్లా అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా  అమలాపురం ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు ప్రజాభీష్టానికి అనుగుణంగా టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వచ్చారు.  
తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జగన్‌కు జైకొట్టారు.  
ఎన్నికల ముందు ఇంత పెద్దస్థాయిలో ప్రజాప్రతినిధులు, సీనియర్లు, తటస్థులు ప్రతిపక్ష పార్టీ లో చేరడం ఇదే తొలిసారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రజాతీర్పు ఉండనుందన్న స్పష్టమైన సంకేతాలతోనే రాజకీయ నేతలు ప్రభావితమవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.  
 – సాక్షి, అమరావతి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top