చంద్రబాబు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌

Peddireddy Ramchandrareddy Slams Chandrababu Naidu - Sakshi

135 సీట్లతో జగన్‌ సీఎం కావడం తథ్యం

ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోండి

నేతలు, కార్యకర్తల సమావేశాల్లో పెద్దిరెడ్డి

వరదయ్యపాళెం : రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు అంతిమ ఘడియలొచ్చాయని, టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో 135 సీట్లతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరికొన్ని సంస్థలు చేపట్టిన సర్వేల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం కోసం మంగళవారం నియోజకవర్గంలోని నారాయణవనం, కేవీబీ పురం, పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశాల్లో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నాయకులు అభివృద్ధి మరచి ప్రజల సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఫలితంగా ప్రజలు ప్రభుత్వం పట్ల విసిగి వేశారిపోయారని చెప్పారు. ముఖ్యమంత్రి సైతం టీడీపీ నాయకులు ప్రభుత్వ ధనం దోచుకునేందుకు వీలుగా అవసరమైన పథకాలు రూపొం దించి అమలు చేశారే తప్ప నిజమైన అభివృద్ధి పథకాలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ అనేక దుర్మార్గాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సత్యవేడు అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఐక్యంగా ఆదిమూలాన్ని గెలుపించుకుంటామని నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్యనేతలు, మండల కన్వీనర్లు హామీ ఇచ్చారు.

ఇద్దరు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక..  
టీడీపీ నుంచి పిచ్చాటూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముద్దుకృష్ణమరాజు, బీజేపీ సత్యవేడు మండల అధ్యక్షుడు నెల్లూరు వెంకటేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

బీసీలకు అండగా వైఎస్సార్‌సీపీ :ఎమ్మెల్యే నారాయణస్వామి
రాష్ట్రంలో 41 మంది బీసీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా, నలుగురిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చరిత్ర సృష్టిం చారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలిపారు. బీసీ డిక్లరేషన్‌ ద్వారా బీసీలకు ప్రథమ పీట వేశారని ఆయన తెలిపారు. బీసీల పార్టీగా చెప్పుకునే చంద్రబాబు వారికి మేలైన కార్యక్రమాలు ఒక్కటీ చేపట్టలేదన్నారు. సామాన్య కుటుంబం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ఆదిమూలం గెలుపునకు బీసీలు అండగా నిలవాలని ఆయన కోరారు. పార్టీ సీనియర్‌ నేతలు సుదర్శన్‌ రెడ్డి, ఏవీఎం బాలాజీ రెడ్డి, బీరేంద్ర వర్మ, మునిశేఖర్‌ రెడ్డి, బొప్పన వెంకటకృష్ణయ్య, కేవీ భాస్కర్‌ నాయుడు, జేబీఆర్‌ మునిరత్నం, చిందేపల్లి మధుసూధన్‌ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు సొరకాయులు (నారాయణవనం), గవర్ల కృష్ణయ్య (కేవీబీపురం), హరిశ్చంద్రారెడ్డి (పిచ్చాటూరు), సుశీల్‌కుమార్‌ రెడ్డి (సత్యవేడు), నాయుడు దయాకర్‌ రెడ్డి (వరదయ్యపాళెం), విద్యానాథరెడ్డి (బీఎన్‌ కండ్రిగ) తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top