లోకేశ్‌ అవినీతి.. బాబు పాలనపై పవన్‌ నిప్పులు!

Pawan Kalyan slams Chandrababu in Guntur meeting - Sakshi

శేఖర్‌రెడ్డి కేసులో లోకేశ్‌ ఇరుక్కున్నాడా?

అందుకే మోదీకి మీరు భయపడుతున్నారు

మీ పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు

చంద్రబాబు పూర్తిగా విఫలయ్యారు

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు

జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌

సాక్షి, గుంటూరు : టీడీపీకి మిత్రపక్షంగా ఉండి.. గత నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తాజాగా పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం సర్కారుపై ధ్వజమెత్తడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు సర్కారు దుష్పరిపాలన, ఆయన తనయుడు లోకేశ్‌ విచ్చలవిడి అవినీతి, టీడీపీ నేతల అరాచకాలను ఘాటుగా విమర్శిస్తూ.. పవన్‌ వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్‌ చేస్తున్న అవినీతి చంద్రబాబుకు కనిపించడం లేదా? అని నిలదీశారు. లోకేశ్‌ అవినీతి మీ దృష్టికి వచ్చిందా? రాలేదా? అని బాబును ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ మనవడు ఏం చేస్తున్నాడు? లోకేశ్‌ అవినీతిని చూసి.. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందని పవన్‌ అన్నారు.

ఐటీ దాడుల్లో దొరికిపోయిన టీడీపీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి కేసులో లోకేశ్‌ పేరు వినిపించిందని, లోకేశ్‌ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లివచ్చారని, ప్రధాని మోదీకి ఆయన భయపడుతున్నారని ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. టీడీపీ నేతల అవినీతిపైనా పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇసుక మాఫియా మొదలు కనకదుర్గమ్మ గుడి వద్ద పార్కింగ్‌ వరకు అన్నింటిలోనూ టీడీపీ నేతల దోపిడీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పవన్‌ కూడా అండగా ఉండరు.. 2019 ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కొనేందుకు అవినీతికి పాల్పడుతున్నామని టీడీపీ నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారని, వచ్చే ఎన్నికల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ. 25 కోట్లు అప్పుడే సిద్ధం చేసి పెట్టామని టీడీపీ నేతలు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంతి తింటారు.. లోకేశ్‌ అవినీతికి అవధులే లేకుండా పోయాయని విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపిందని, ఆయన పాలనలో ఏ ఒక్కరినీ సంతృప్తి పరచలేదని అన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏమీ చేయలేదని, పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక నుంచి ఆయన తప్పులను రోజూ ఎండగడతామని, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నందుకు రోజూ నిలదీస్తామని హెచ్చరించారు. భూదేవి లాంటి ఇసుకను తవ్వి అవినీతికి పాల్పడితే.. భూమి తన లోపలికి లాగేసుకుంటుందని అన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు తాకట్టు పెట్టారు? అర్ధరాత్రి చీకటి ఒప్పందం చేసుకొని ప్యాకేజీని చంద్రబాబు ఒప్పుకున్నారా? అని నిలదీశారు. ఇలాంటి చంద్రబాబు సర్కారకు వచ్చే ఎన్నికల్లో తాను అండగా ఉండబోనని చెప్పారు.

ఇసుక మాఫియాను అడ్డుకుంటే ఎమ్మార్వో నీరజాక్షిపై దాడి చేస్తారా? మహిళ అధికారిపై దాడి చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కొమ్ములు ఉన్నాయా? అని పవన్‌ మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేకు చట్టం వర్తించదా?.. మీరు ఏం చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగపూర్‌లో ఇదే విధంగా దాడి జరిగితే.. తోలు ఊడేలా కొట్టేవారని పవన్‌ పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top