టీడీపీకి జనసేన మద్దతు లేకుంటే జగనే సీఎం అయ్యేవారు

Pawan kalyan Sensational Comments On TDP Leaders Robbery - Sakshi

     డబ్బే ప్రధానంగా చంద్రబాబు పాలన

     టీడీపీ నాయకులు వేల కోట్లు దోచుకుతింటున్నారు

     అమరావతి మాదిరిగానే పోలవరం రైతులకూ బాండ్లు ఇవ్వాలి

     జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ 

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): గత ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్లయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేవారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను, తప్పు చేశానని బాధపడుతున్నానన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సౌభాగ్య సెంటర్‌ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు. 

రోడ్లెలా ఉన్నాయో చూస్తే తెలుస్తోంది..
సీఎం కొడుకు లోకేష్‌ రాష్ట్రంలో 14వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారని, అయితే జంగారెడ్డిగూడెం నుంచి ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ట్రాఫిక్‌ లేని సమయంలో 14 కిలోమీటర్లు వెళ్లేందుకు తనకు 40 నిమిషాలు పట్టిందని, దీన్నిబట్టి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందని పవన్‌ అన్నారు. చింతలపూడి పథకంలో రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదని తప్పుపట్టారు. టీడీపీ నాయకులకైతే ఎకరానికి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నారని, పేదల భూములకు రూ.10 లక్షలనుంచి రూ.12 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చింతలపూడిలో 42 ఎకరాల అటవీ భూమిని దెందులూరు ఎమ్మెల్యే కబ్జా చేశారన్నారు. బుట్టాయగూడెంలో 400 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించారని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆ అప్పు మీ అబ్బాయి కడతారా?
సేంద్రీయ వ్యవసాయానికి అమెరికా వెళ్లి రూ.వేల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబు ఆ అప్పును ఎవరు తీరుస్తారో చెప్పాలని పవన్‌ అంటూ.. మీ అబ్బాయి కడతారా? అని ప్రశ్నించారు. అమరావతిలో రైతులకు బాండ్లు ఇచ్చినట్టుగానే పోలవరం రైతులకూ బాండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యం తినడానికి పనికి రావని, సారా కాయడానికి, మొలాసిస్‌ తయారు చేయడానికి పనికొస్తాయన్నారు. టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసినా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఓట్లను టీడీపీ తొలగించిందని, వీటిలో 19 లక్షల ఓట్లు జనసేన పార్టీకి చెందినవేనన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు తన కార్యకర్తల్లా వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతల సుజాత జనసేన అండతో గెలిచిన విషయం మరచిపోరాదని, జనసేన ఫ్లెక్సీలు పెట్టకుండా ఆమె అడ్డుకోవడం సరికాదని అన్నారు. జంగారెడ్డిగూడెం టౌన్‌హాల్‌లో గతంలో మంచి కార్యక్రమాలు జరిగేవని, దాన్ని పేకాట క్లబ్‌గా మార్చిన ఘనత టీడీపీదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top