మళ్లీ వచ్చి ఏం చేస్తావ్‌?

Pawan kalyan Sensational Comments On Chandrababu and Lokesh - Sakshi

     సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్‌ ధ్వజం

     ఎన్నికల హామీలు ఒక్కటీ అమలు చేయలేదు 

     లోకేశ్‌కు ఏం తెలుసని మంత్రిని చేశారు..? 

     పంచాయతీ రాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు  

     జన్మభూమి కమిటీలా.. దోపిడీ కమిటీలా? 

     దోపిడీలు చేస్తే ఐటీ సోదాలు చేయరా? 

     ప్రజలకు పోలవరం నిర్వాసితుల కష్టాలను చూపండి

     రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు తొలగించారు

సాక్షి, రాజమహేంద్రవరం: గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయని మీరు మళ్లీ వచ్చి ఏం చేస్తారు? అంటూ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ‘మళ్లీ మీరే రావాలి’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి టీడీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. కవాతు పేరుతో పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ శ్రేణులతో కలసి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద  కాటన్‌ బ్యారేజీపై సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధవళేశ్వరంలో బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతి నిర్మూలన కోసమే కవాతు నిర్వహించామని చెప్పారు. స్కాములు, దోపిడీలు చేస్తే ఐటీ దాడులు చేయరా? వ్యాపారాలు చేసే రాజకీయ నాయకులపై ఐటీ దాడులు చేస్తే తామెందుకు స్పందించాలని ధ్వజమెత్తారు. లోకేశ్‌కు ఏం తెలుసని మంత్రిని చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేని లోకేశ్‌ను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా చేశారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలు గూండాయిజం కమిటీల్లా దోపిడీ చేస్తున్నాయని, పంచాయతీ రాజ్‌ వ్యవస్థను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.

2012లో కాకినాడ సెజ్‌లో ఏరువాక చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు.. తర్వాత రైతులను జైల్లో పెట్టించారని మండిపడ్డారు. సెజ్‌లోని కేవీ రావుకు కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలున్నాయని ఆరోపించారు. కృష్టా జిల్లా నుంచి బస్సులపై జనాలను తీసుకొచ్చి పోలవరం చూపిస్తున్నారని, ఆ పక్కనే నిర్వాసితుల కష్టాలను కూడా చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, గిరిజన సంస్కృతిని నాశనం చేస్తేనే ప్రజా పోరాటాలు వస్తాయని, నక్సలైట్లు తయారవుతారని చెప్పారు. బీజేపీ అంటే జగన్, పవన్‌ అంటున్నారని, బీజేపీపై తానే పోరాటం చేశానని చెప్పారు. పాచిపోయిన లడ్డూలని తాను చెబితే వాటిని వేడి చేసుకుని చంద్రబాబు తిన్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఇతర కులాల వారికి నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. తాము అధికారంలోకి వస్తే 9వ షెడ్యూల్‌లో కాపు రిజర్వేషన్ల అంశం చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. నిజానికి రిజర్వేషన్లు లేని వ్యవస్థ రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు తొలగించారని పవన్‌ ఆరోపించారు.  

సర్పంచులు చేయాల్సిన పని సచివాలయం నుంచా? 
గ్రామాల్లో విద్యుత్‌ లైట్లు వెలుగుతున్నాయో లేదో సచివాలయం నుంచి సీఎం చూడాల్సిన అవసరం లేదని పంచాయతీ సర్పంచులు చేయాల్సిన పనిని చేయనిస్తే చాలని పవన్‌ అన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే రూ. 3,600 కోట్లు నష్టపోతున్నామని పేర్కొన్నారు. ‘‘2014 ఎన్నికల్లో చంద్రబాబు, నరేంద్రమోదీ ఎన్నో హామీలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు 2 కోట్ల ఉద్యోగాలన్నారు. కాకినాడ సెజ్‌లోనే 50 వేల ఉద్యోగాలని చెప్పారు. కానీ 500 కూడా రాలేదు. జీలకర్రలో కర్ర, నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండవో బాబు జాబులో జాబు ఉండదని ఓ పెద్దాయన చెప్పారు. రుణాలు మాఫీ కాలేదు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వడంలేదు. చంద్రన్న పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకున్నా రావడంలేదు. నువ్వే మళ్లీ రావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ వచ్చి ఏం చేస్తారు’’ అని పవన్‌ ప్రశ్నించారు. పాలనలో అనుభవం ఉందని 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని పవన్‌ చెప్పారు. మంచి పాలన అడిగితే స్కాముల, దోపిడీ ఇచ్చారని మండిపడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టుపట్టుకుని కొడితే చంద్రబాబు ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. 2014లో చంద్రబాబుకు గెలుస్తామనే నమ్మకం లేదని, గెలవకపోతే తర్వాత కూడా కలిసి పనిచేయాలని అడిగారని వెల్లడించారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవన్నారు.

సీఎం పార్టీ పెట్టలేదు.. నేను పెట్టాను...  
ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి ఎంత మొత్తం పెట్టుబడులు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హమీ ఇచ్చారు. అసంఘటి కార్మికులకు మద్దతుగా ఉంటామన్నారు. జనసేన పార్టీ ఎదగకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టలేదని, తాను పార్టీ పెట్టానని చెప్పారు. జగన్‌ అంటే తనకేమీ కోపం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వంతోపాటు, ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top