ఐటీ సోదాలపై మేం ఎందుకు స్పందించాలి!

Pawan kalyan Sensational Comments On Chandrababu and IT searches - Sakshi

ఢిల్లీలో మాదిరి సీఎం ఆఫీసుపై దాడులు జరిగితే అండగా నిలిచేవారం

హోదా కోసం పోరాడుతుంటే ప్యాకేజీ అంటూ వెనక్కిలాగింది బాబే

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ 

సాక్షి, అమరావతి: ఢిల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పైలాగా రాష్ట్రంలో సీఎం ఆఫీసుపైనో లేదంటే సచివాలయంపైనో ఐటీ సోదాలు జరిగి ఉంటే తాము రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచి ఉండేవాళ్లంగానీ.. ఎవరో పారిశ్రామికవేత్తలపై సోదాలు జరుగుతుంటే అందరూ స్పందించాలన్నట్లు టీడీపీ నేతలు డిమాండ్‌ చేయడం ఏంటని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, మహేందర్‌రెడ్డి, మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్, ముత్తా గోపాలకృష్ణలతో కలిసి శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవాన్ని రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటననూ ఆయనకు అనుకూలంగా ఉండేలా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని జనసేన వెనుకేసుకొస్తోందని ముఖ్యమంత్రీ, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. తన కుటుంబ సభ్యులనే వెనుకేసురాని తాను బీజేపీని ఎందుకు వేనుకేసుకొస్తానంటూ పవన్‌ చెప్పారు. మోదీ, అమిత్‌షాలు తనకేమన్నా బాబాయిలా.. బంధువులా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో తాను గట్టిగా మాట్లాడుతుంటే ప్రత్యేక ప్యాకేజీ అంటూ వెనక్కి లాగింది చంద్రబాబే కాదా అని ప్రశ్నించారు.

బాబువల్లే ప్రజల్లో గందరగోళం 
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రే ఇన్నిసార్లు మాట మార్చడంవల్ల రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎంతో గందరగోళంలో ఉన్నారని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, ఈ నెల 15న రాజమహేంద్రవరంలో జరిగే కవాత్‌లో ఈ అంశంపై ప్రశ్నించబోతున్నట్టు ఆయన తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని చిత్తశుద్ధితో పెట్టింది కాదని.. రాజకీయ అవసరానికి తాను వారికి పనికొచ్చానుగానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తమను గుర్తించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 

నాలుగు రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై స్పష్టత
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీచేసే వివరాలపై 4 రోజుల్లో వెల్లడిస్తానని పవన్‌ చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2019లోనే జరిగితే 23–24 స్థానాల్లో పోటీచేయాలని అనుకున్నామని.. కానీ అనుకోకుండా ముందస్తు ఎన్నికలు వచ్చాయన్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాలో 16–17 తేదీల్లో పర్యటించనున్నట్టు పవన్‌ చెప్పారు. అలాగే, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది ఎన్నికలప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా, శనివారం విజయవాడలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top