దుమ్ము రేగిందని ముఖాముఖి రద్దు!

Pawan Kalyan second day tour in Ananthapur - Sakshi

     పవన్‌ తీరుపై రైతులు, గ్రామస్తుల విమర్శలు 

     చీనీ తోటలోకి వెళ్లి కాసేపటికే కారెక్కిన పవన్‌ 

     పొలం వద్దకు రైతులు రావటంతో అసహనం 

     మృతి చెందిన నేత ఫొటోకు కారు వద్దే పరామర్శ 

     ‘అనంత’లో రెండో రోజు కొనసాగిన పర్యటన

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అనంతపురం పర్యటన సందర్భంగా దుమ్ము రేగడంతో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. అనంతపురంలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ రెండో రోజైన సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 4.30 వరకూ తాను బస చేసిన శ్రీ7 కన్వెన్షన్‌ సెంటర్‌లోనే ఉన్నారు. అనంతరం సాయంత్రం సమయంలో అనంతపురం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామానికి చేరుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన రైతులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉండగా 4.45 గంటలకు కారులో గ్రామానికి చేరుకుని వాహనం దిగి ఓ చీనీ తోటలోకి వెళ్లారు. ఇదే సమయంలో పవన్‌ను చూసేందుకు గ్రామస్తులు వచ్చారు. ఇంతలో పొలంలో దుమ్ము లేవడంతో వేగంగా అడుగులేస్తూ వచ్చి తిరిగి కారులో కూర్చున్నారు. చేతులతో తల కొట్టుకొంటూ అసహనం ప్రదర్శించారు. కొంతమంది  ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్లు కనిపించడంతో వారితో మాట్లాడి తాను బస చేసిన ప్రాంతానికి  తిరుగు పయనమయ్యారు. ఎంతసేపటికీ పవన్‌ ముఖాముఖి వేదిక వద్దకు రాకపోవడంతో విసుగు చెందిన రైతులు, గ్రామస్తులు ఆరా తీశారు. దుమ్ము రేగుతోందని పవన్‌ వెళ్లిపోయారని తెలియడంతో అంతా నిష్టూరమాడుతూ వెనుదిరిగారు. ‘దుమ్ము భరించలేనోడు ఏం నాయకుడు..? ఎలా రాజకీయం చేస్తారు..?’ అంటూ చర్చించుకున్నారు. 

తిరుపతయ్య ఫొటోకో దండం..! 
పవన్‌ పర్యటించాల్సిన నారాయణపురం గ్రామంలో రాయలసీమ బలిజసంఘం మాజీ అధ్యక్షుడు తిరుపతయ్య ఇటీవల చనిపోయారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాలని బలిజసంఘం నేతలు పవన్‌ను కోరారు. పవన్‌ కళ్యాణ్‌ నారాయణపురంలో ముఖాముఖి కార్యక్రమానికి తిరుపతయ్య ఇంటి ముందు నుంచే వెళ్లాలి. అయితే తిరుపతయ్య ఇంటి వద్ద కారు ఆపినా పవన్‌ లోపలకు వెళ్లలేదు. తిరుపతయ్య ఫోటో తీసుకురావాలని జనసేన నేతలను ఆదేశించారు. ఇంతలో తిరుపతయ్య కుటుంబ సభ్యులే ఓ ఫోటోను పవన్‌ ఉన్న కారు వద్దకు తెచ్చారు. ఫోటో చేతిలో తీసుకుని దండం పెట్టి తిరిగి వారికి అప్పగించి పవన్‌ కారెక్కి వెళ్లిపోయారు. ఈ తరహా పరామర్శపై గ్రామస్తులు కంగుతిన్నారు. ఇంటి వద్దకు వచ్చి, ఇంట్లోకి వెళ్లకుండా ఫోటో తెప్పించుకుని చూడటం ఏమిటని విమర్శిస్తున్నారు. 

రెయిన్‌ గన్‌లు ఎక్కడున్నాయి బాబూ?
చీనీతోటలో పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘రెయిన్‌గన్‌లు తెచ్చి కరువును పారదోలతామని చంద్రబాబు చెప్పారు. కరువును పారదోలడం దేవుడికెరుక.. రెయిన్‌గన్‌లు ఎక్కడున్నాయో ఆయనకే తెలియాలి’ అని పేర్కొన్నారు. నారాయణపురం పంచాయతీకి తాగునీళ్లు లేవని మంత్రి పరిటాల సునీత వద్దకు వెళ్తే తన నియోజకవర్గ పరిధి కాదంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వద్దకు వెళితే మీరంతా వైఎస్సార్‌ సీపీకి ఓట్లేసినందున నీళ్లు ఇవ్వబోమంటున్నారని కొందరు గ్రామస్తులు పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తెచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top