సర్కార్‌ను కూల్చకపోతే జనసైనికులమే కాదు

Pawan kalyan Fires On Chandrababu Govt - Sakshi

టీడీపీ ప్రభుత్వంలో దోపిడీ పెచ్చుమీరిపోయింది

లోకేశ్‌పై ప్రేమతో చంద్రబాబు ధృతరాష్ట్రుడైపోయారు

‘అనంత’ కవాతులో జనసేన అధ్యక్షుడు పవన్‌ 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘టీడీపీ నేతలు ఎన్నోసార్లు నన్ను అవమానించారు.. ఛీకొట్టారు.. సీమగడ్డ పైనుంచి చెబుతున్నా.. మీ ప్రభుత్వాన్ని కూలదోయకపోతే మేం జనసైనికులమే కాదు. ముఖ్యమంత్రి పెద్దాయనైపోయారు. కొడుకుపై ప్రేమతో ఆయన ధృతరాష్ట్రుడయ్యారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. విజన్‌ 2050 అంటున్నారు.. అప్పటివరకూ చంద్రబాబుకు వయస్సుందా? మీ ప్రభుత్వాన్ని తప్పకుండా కూలదోస్తాం’.. అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబునాయుడిపై శపథం చేశారు. ‘అనంత’ కరువు సమస్యలపై రైతు కవాతు పేరుతో ఆదివారం ఆయన అనంతపురంలో కవాతు నిర్వహించారు. మార్కెట్‌ యార్డు నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకూ కిలోమీటర్‌ మేర నడిచారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. 

చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి తనకు శత్రువులు కాదన్నారు. మంచి పాలన ఇస్తారని 2014లో జాతీయస్థాయిలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకు మద్దతిచ్చానని.. కానీవారు అవినీతి, జీఎస్టీతో ప్రజలను వేధించారన్నారు. హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారో చంద్రబాబు చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. జనసేన అధికారంలోకి వస్తే గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. కియా సంస్థలో స్థానికులకు స్వీపర్‌ ఉద్యోగం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. తొలి నుంచి బీజేపీని ఎదిరించింది తానేనని.. మోదీ అంటే చంద్రబాబు, జగన్‌కు భయమన్నారు. పాతకాలంలో మాదిరిగా ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తాననంటే చెల్లదని జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అవినీతిపై విదేశీయులూ వ్యాఖ్య
తాను యూరప్, లండన్‌ వెళ్లినప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టొచ్చు కదా అని అక్కడి వారిని అడిగితే.. ‘మీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ’ అని వ్యాఖ్యానించారని పవన్‌ తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో అవినీతి ఉందని తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని, కానీ.. తన కొడుకు అవినీతి ఎక్కడ చేశాడని చంద్రబాబు అంటూనే ఇసుక రీచ్‌లు స్వాహా చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనకు సొంత అన్న, కుటుంబం కంటే ప్రజలపైనే ప్రేమ ఉందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top