చంద్రబాబు, లోకేశ్‌కు ఆత్మాభిమానం లేదు

Pawan kalyan Fires On Chandrababu and Lokesh - Sakshi

మలికిపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 

చమురు నిక్షేపాలను దోచుకెళ్తున్న వారిని నిలదీయరేం? 

రాష్ట్రాన్ని దోచుకుంటున్న వాళ్లను తెలుగు ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలా? 

మలికిపురం(రాజోలు)/అమలాపురం టౌన్‌/అమలాపురం రూరల్‌: రాష్ట్ర సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు ఆత్మాభిమానం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి చమురు నిక్షేపాలను దోచుకెళ్తున్న వారిని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆయిల్‌ దోపీడీని ప్రశ్నిస్తే బాబు కేసులను కేంద్రం బయటకు తీస్తుందని భయపడుతున్నారని చెప్పారు. తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకుండా ఆత్మాభిమానం లేకుండా చంద్రబాబు, లోకేశ్‌లు బతుకుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌కు కూడా మోదీ భయం పట్టుకుందన్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్న వీళ్లను తెలుగు ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని ఆదరించాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే భవిష్యత్తులో ప్రత్యేక దక్షిణ భారతదేశం అనే నినాదం తెరపైకి  వస్తుందన్నారు. 

రిలయన్స్‌ అంబానీలంటే జనసేన భయపడదు 
పచ్చటి కోనసీమలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా చమురు, గ్యాస్‌ను తోడుతూ ఈ భూభాగాన్ని చమురు కంపెనీలు నిప్పుల కుంపటిగా మార్చేశాయని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడారు. సహజ వనరులను చమురు సంస్థలు దోచుకుంటున్నాయని చెప్పారు. మన దేశంలో దోపిడీలు చేసే కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ముకాయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ నుంచి సహజ సంపదను రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు దోచుకుపోతుంటే  జనసేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పవన్‌ కల్యాణ్‌ అమలాపురంలో బుధవారం సాయంత్రం రోడ్‌ షో నిర్వహించారు. అమలాపురంలో తాను బస చేసిన సత్యనారాయణ గార్డెన్స్‌ నుంచి నల్లవంతెన, ముమ్మిడివరం గేటు సెంటరు, గడియారం స్తంభం సెంటరు, హైస్కూలు రోడ్డు, కాలేజీ రోడ్డు, కొంకాపల్లి, వై.జంక్షన్‌ వరకూ రోడ్‌ షో సాగింది.  

డ్వాక్రా మహిళలతో భేటీ 
అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో పవన్‌ కల్యాణ్‌ డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top