విదేశాలకు దోచిపెట్టడమే అభివృద్ధా?

Pawan Kalyan Fires on Chandrababu - Sakshi

  నేను కాపు కాచి.. అండగా నిలబడింది అందుక్కాదు

  మా ఇష్టం అంటే చూస్తూ ఊరుకోను చంద్రబాబుపై పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌

చిత్తూరు అర్బన్‌/శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. మంగళవారం చిత్తూరులో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మూడు కిలో మీటర్ల పాటు రోడ్‌షో నిర్వహించిన అనంతరం గిరింపేట కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే భారతీయుల భూముల్ని బలవంతంగా లాక్కుని విదేశీయులకు అప్పగించడమా? రూ.వేల కోట్లను విదేశీ కంపెనీలకు దోచి పెట్టడమా? పేదల భూముల్ని లాక్కుని పెద్దలకు ధారాదత్తం చేయడమా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చిత్తూరులో రోడ్డు విస్తరణకు తాను వ్యతిరేకం కాదని, పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూముల్ని ఎలా లాక్కుంటారని నిలదీశారు.

అశోక్‌ గజపతిరాజు ప్రాతనిధ్యం వహిస్తున్న విజయనగరం నుంచి నంద్యాల, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అభివృద్ధి పేరుచెప్పి భూములు తీసుకొని పరిహారం ఇచ్చారని, ఆ చట్టం చిత్తూరుకు ఎందుకు వర్తించదని అడిగారు. ముఖ్యమంత్రి చేస్తున్న విధానం మంచిది కాదని, చాలా తప్పు చేస్తున్నారంటూ హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను అండగా నిలిచింది, కాపు కాచింది దీనికైతే కాదన్నారు. పేదలకు మంచి చేస్తారనుకున్నానని, కానీ ఇదేం పద్ధతని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా బలవంతంగా భూముల్ని లాక్కుంటే చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. సొంత జిల్లా వాసులని కూడా చూడకుండా చంద్రబాబు ఇక్కడి ప్రజల కడుపులు కొట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు.

దేవస్థానం తలుపులు వేసిన అధికారులు
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి పవణ్‌కల్యాణ్‌ మంగళవారం ఉదయం వచ్చారు. ముందుగా ఆలయ ఆవరణంలో భూమట్టానికి 32 అడుగుల తోతులో ఉన్న పాతాళవినాయకుని దర్శించుకున్న అనంతరం క్యూలైన్‌లో సామాన్య భక్తులతోపాటు వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. అయితే, పవణ్‌కల్యాణ్‌ అభిమానుల రద్దీని తట్టుకోలేక పవన్‌ దేవస్థానం లోపలికి వెళ్లిన తర్వాత ఇతర భక్తులు రాకుండా ప్రధానద్వారం తలుపులను పోలీసులు, దేవస్థానం అధికారులు  మూసేశారు. సాధారణంగా మంత్రులు, వీవీఐపీలు వస్తే ప్రధాన ద్వారం వద్ద సాధారణ భక్తులను నిలుపుదల చేయడం, వీవీఐపీలు దర్శనం చేసుకున్న తర్వాత సాధారణ భక్తులను వదిలిపెట్టడం పరిపాటి. పవన్‌ రాక సందర్భంగా ప్రధానద్వారం తలుపులు వేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top