అవిశ్వాసాన్ని పెట్టండి, మద్దతు తెస్తా: పవన్‌

Pawan Kalyan comments about YS Jagan on no confidence motion - Sakshi

జగన్‌ దమ్ము, ధైర్యం, తెగింపు ఉన్న వ్యక్తి 

సాక్షి, హైదరాబాద్‌/ అమరావతి: అవిశ్వాసానికి మద్దతు విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చొరవ తీసుకుంటే మిగతా పార్టీల మద్దతు తీసుకువస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానని చెప్పారు. ఆయన సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ సవాల్‌కు సమాధానం చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అన్నింటికీ సిద్ధపడి వచ్చానని, జగన్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నానని చెప్పారు. తాను టీడీపీకి చెందిన వాడిని కాదని, కేవలం గత ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీకి మద్దతు ఇచ్చానని తెలిపారు.

పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ఒక్క ఎంపీ అయినా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించవచ్చని, ఐదుగురు ఎంపీలున్న వైఎస్సార్‌సీపీ అవిశ్వాసం ప్రవేశపెడితే అవసరమైన మద్దతును తాను సంపాదిస్తానని చెప్పారు. సీపీఐ, సీపీఎం, బిజూ జనతాదళ్, ఆప్, టీడీపీ, కాంగ్రెస్‌.. ఇలా ఎవరయితే సంసిద్ధంగా ఉన్నారో వాళ్లందరి మద్దతు కూడగడతానని తెలిపారు. మద్దతు కోసం అవసరమైతే కర్ణాటక, తమిళనాడు వెళతానన్నారు. 50 కాదు 80 మంది మద్దతు వస్తుందని చెప్పారు.

జగన్‌ దమ్ము, ధైర్యం, తెగింపు ఉన్న బలమైన వ్యక్తని తనకు తెలుసునని, కేంద్ర మంత్రివర్గానికి ఆయన ఎదురుతిరిగితే తాము అండగా ఉంటామని, అవసరమైతే వీధుల్లోకి వస్తామని తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ వైఖరి కూడా వెల్లడవుతుందన్నారు. జగన్‌ మార్చ్‌ 4న ఢిల్లీ వెళ్లి అవిశ్వాస నోటీసు తీర్మానం ఇవ్వాలని కోరారు. తెలుగుజాతి సమస్యపై పది రోజుల్లో పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. ఒకవేళ జగన్‌ వెనక్కుపోతే టీడీపీకి, చంద్రబాబుకు ఒక ఛాన్స్‌ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎవరు తీర్మానం ప్రవేశపెట్టినా తాము అండగా ఉంటామని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top